Central Investigation Unit
-
‘మహాదేవ్’ లూటీ రోజుకు రూ.200 కోట్లు
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన వ్యవహారమిది. బాలీవుడ్ ప్రముఖ నటులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. యాప్‌పై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గత నెలలో భారత్‌లో 39 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.417 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, నగదు స్వా«దీనం చేసుకుంది. యాప్ కోసం ప్రచారం చేసిన బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురి నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ యాప్ బాగోతం బయటపడింది. ► ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి పట్టణానికి చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ దుబాయ్‌లో మకాం వేసి, మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ► కొత్తకొత్త వెబ్సైట్లు, చాటింగ్ యాప్‌ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తారు. ఆన్లైన్లో బెట్టింగ్‌ల్లో భారీగా లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ► తమ వలలో చిక్కిన కస్టమర్లతో వాట్సాప్‌లో గ్రూప్‌లు ఏర్పాటు చేస్తారు. వారితో నేరుగా ఫోన్లలో మాట్లాడరు. వాట్సాప్ ద్వారానే సంప్రదిస్తుంటారు. ► కస్టమర్లను బెట్టింగ్ యాప్‌లో సభ్యులుగా చేర్చి, యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత వారితో నగదు జమ చేయించుకుంటారు. ఈ వ్యవహారాన్ని మహాదేవ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు పర్యవేక్షిస్తుంటారు. ఈ డబ్బంతా తప్పుడు పత్రాలతో తెరిచిన యాప్ నిర్వాహకుల బినామీ బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది. ► యాప్‌లో బెట్టింగ్‌లు కాస్తే తొలుత లాభాలు వచి్చనట్లు నమ్మిస్తారు. దాంతో కస్టమర్లో ఆశ పెరిగిపోతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా అతడిని ప్రేరేపిస్తారు. చివరకు అదంతా నష్టపోయేలా బెట్టింగ్ యాప్‌లో రిగ్గింగ్ చేస్తారు. మళ్లీ కొత్త బకరా కోసం వేట మొదలవుతుంది. ► మహాదేవ్ బెట్టింగ్ యాప్ సంపాదన ప్రతిరోజూ రూ.200 కోట్లు ఉంటుందని ఈడీ దర్యాప్తులో తేలింది. ► భారత్, మలేసియా, థాయ్‌లాండ్, యూఏఈలో మహాదేవ్ యాప్‌నకు వందలాది కాల్ సెంటర్లు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉంది. నాలుగు దేశాల్లో పెద్ద సంఖ్యలో బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచారు. ► భారత్‌లోని 30 కాల్ సెంటర్లను అనిల్ దమానీ, సునీల్ దమానీ నిర్వహిస్తున్నారు. వీరిద్దరిని ఈడీ అరెస్టు చేసింది. ► బెట్టింగ్ యాప్ జోలికి రాకుండా ఉండడానికి పోలీసులకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు నిర్వాహకులు హవాలా మార్గాల్లో లంచాలు ఇచి్చనట్లు వెల్లడయ్యింది. ► బెట్టింగ్ సిండికేట్ నడిపిస్తున్న ఓ యాప్‌ను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రమోట్ చేస్తున్నట్లు ఈడీ చెబుతోంది. ► ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఓ పెళ్లి నిర్వహణకు రూ.200 కోట్లు నగదు రూపంలో చెల్లించారు. దీనిపై దర్యాప్తు చేయగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ గురించి బయటపడింది. ఈ పెళ్లిలో రణబీర్ కపూర్, శ్రద్ధాకపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్‌తోపాటు మరికొందరు బాలీవుడ్ నటులు ప్రదర్శన ఇచ్చారు. వారికి హవాలా మార్గంలో రూ.కోట్లలో చెల్లింపులు చేసినట్లు తేలింది. పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలను చార్టర్డ్ విమానంలో దుబాయ్‌కి తీసుకెళ్లారని ఈడీ అధికారులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎంతటివారినైనా ఎదుర్కోండి
న్యూఢిల్లీ: అవినీతిపరులు ఎంతటి శక్తివంతులైనాసరే కర్తవ్య దీక్షలో ముందడుగువేసి పోరాడాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ కర్తవ్యబోధ చేశారు. సోమవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన సీబీఐ వజ్రోత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ‘ కేంద్రప్రభుత్వ స్థాయిలో అవినీతిని ఎదుర్కొనేందుకు రాజకీయ సంకల్పానికి కొదువే లేదు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయస హకారాలు అందుతాయి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. అవినీతిపై పోరాడండి. అవినీతిపరులు ఎంతటి శక్తివంతులైనాసరే తగ్గేదేలేదు’ అంటూ సీబీఐ అధికారులను ఆదేశించారు. ‘ ప్రజాస్వామ్యం, న్యాయాలకు అవినీతే అతిపెద్ద అవరోధం. అవినీతి నుంచి దేశాన్ని విముక్తి చేయాల్సిన బాధ్యత సీబీఐ పైనే ఉంది. అవినీతిపరులను వదలొద్దని ప్రజలు కోరుకుంటున్నారు. దశాబ్దాలుగా అవినీతితో లబ్ధిపొందిన నేతలు నేడు ఏకంగా సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలపైనే విమర్శలు చేసే పరిస్థితులు సృష్టించారు. పక్కదోవ పట్టించే వీళ్లను పట్టించుకోకుండా విధి నిర్వహణపై దృష్టిపెట్టండి. మన ప్రయత్నంలో అలసత్వం, నిర్లక్ష్యం వద్దు. ఇదే దేశం, దేశ ప్రజలు కోరుకునేది. దేశం, చట్టం, రాజ్యాంగం మీ వెన్నంటే ఉన్నాయి’ అని అధికారులకు భరోసా ఇచ్చారు. ఫోన్‌కాల్‌తో వేలకోట్ల రుణాలు ఇప్పించుకున్నారు ‘స్వాతంత్య్రం వచ్చేనాటికే దేశంలో అవినీతి తిష్టవేసి ఉంది. దీన్ని తొలగించాల్సిన ఆనాటి నేతలు కొందరు దీనిని మరింత పెంచడం దారుణం. ఎవరెంతగా అవినీతి చేయగలరనే పోటీ నడుస్తోందిప్పుడు. దీంతో దేశంలో పలు వ్యవస్థలు ధ్వంసమై ప్రభుత్వ విధానాలు నిర్వీర్యమై అభివృద్ధి ఆగిపోతోంది. దేశ ఐక్యత, స్నేహభావం, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే అవినీతిని పెకిలించాలి. ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి పారదర్శకమైన విధానాలొచ్చాయిగానీ గతంలో కొందరు ‘శక్తివంతమైన’ నేతలు కేవలం ఫోన్‌కాల్ ద్వారా తమ వారికి వేలకోట్ల రుణాలు దక్కేలా చేశారు. అలా ఆయాచిత లబ్ధిపొందాక దేశం వదిలి పారిపోయారు. పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం ద్వారా మేం రూ.20,000 కోట్ల ఆస్తులను జప్తుచేశాం. ఇలాంటి అవినీతిపరులు మరింత తెగించి ప్రభుత్వం ద్వారా నిజమైన లబ్ధిదారులకు దక్కాల్సిన రేషన్, ఇళ్లు, స్కాలర్షిప్, పెన్షన్లనూ లూటీ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలే వాస్తవ లబ్ధిదారునికి చేరుతోందని స్వయంగా గత ప్రధానమంత్రే సెలవిచ్చారు’ అని మోదీ గుర్తుచేశారు. అందరి నోటా సీబీఐ ‘‘ఏదైనా కేసు సంక్షిష్టంగా, సమస్యాత్మకంగా ఉందంటే పరిష్కారం కోసం ప్రజల నోట వినిపించే ఒకే ఒక పేరు సీబీఐ. 60 ఏళ్లుగా న్యాయం, సత్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సీబీఐ నిలుస్తోంది. పంచాయతీ స్థాయిలో జరుగుతున్న ముఖ్య నేరాలనూ సీబీఐకి అప్పజెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవినీతి చిన్నదిగా కనిపించొచ్చు. కానీ అది పేదల హక్కులను లాగేసుకుంటుంది. కొత్తగా ఎన్నో నేరాలకు అంటుకడుతుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌ను, చక్కని దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులకు బంగారు పతకాలను ప్రధాని ప్రదానం చేశారు. స్మారక తపాలా బిళ్ల, నాణేలను ఆవిష్కరించారు. -
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ పదవీకాలం ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాము అనుకున్నదే చేస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల దాకా పొడిగించే వెసులుబాటును కల్పిస్తూ ఇటీవలే వివాదాస్పద ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చిన కేంద్రం... దీనికి అనుగుణంగానే ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని బుధవారం మరో ఏడాదిపాటు పెంచింది. 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన మిశ్రా 2018 నవంబరు 18న రెండేళ్ల పదవీకాలానికి ఈడీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2020లో ఆయన పదవీకాలాన్ని పెంచుతూ... రెండేళ్ల బదులు మూడేళ్లకు గాను ఆయన్ను ఈడీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర నియామక ఉత్తర్వులను సవరించింది. కొందరు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా... ఆ ఒక్కసారికి పొడిగింపునకు సమ్మతించిన కోర్టు తదుపరి మాత్రం సంజయ్‌కుమార్ మిశ్రాకు పొడిగింపు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అయినప్పటికీ సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పదవీకాలాన్ని పెంచుతూ ఆర్డినెన్స్ తెచ్చి... మిశ్రాకు మరో ఏడాది పొడిగింపునిచ్చింది. గురువారం ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా... 2022 నవంబరు 18 దాకా ఆయన పదవిలో కొనసాగుతారని బుధవారం ఆదేశాలు జారీచేసింది. జాబితాలోకి విదేశాంగ కార్యదర్శి పదవీకాలం పొడిగింపు అర్హుల జాబితాలో విదేశాంగ కార్యదర్శిని చేరుస్తూ కేంద్రం ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను సవరించింది. రక్షణ, హోంశాఖ కార్యదర్శులు, ఐబీ డైరెక్టర్, ‘రా’ కార్యదర్శి, సీబీఐ, ఈడీల డైరెక్టర్ల పదవీకాలాన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు పొడిగించేలా ఆదివారం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో విదేశాంగ కార్యదర్శిని చేర్చింది. -
ఏసీబీ వలలో ఒంగోలు డీఎస్పీ
చీరాల/ఒంగోలు క్రైం/గుంటూరు: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కళాశాల(పీటీసీ) డీఎస్పీగా పనిచేస్తున్న దేవిశెట్టి దుర్గాప్రసాద్ ఇళ్లపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేసి పలు విలువైన పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. దుర్గాప్రసాద్ గుంటూరు జిల్లాలో ఎస్ఐగా కెరీర్ ప్రారంభించి సీఐగా పదోన్నతి పొంది ప్రస్తుతం ఒంగోలులో డీఎస్పీగా పనిచేస్తున్నారు. అయితే ఏసీబీ సిబ్బంది ఏకకాలంలో గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోని దుర్గాప్రసాద్, ఆయన బంధువులు, బినామీల ఇళ్లపై దాడులు చేసింది. ఆ వివరాలను సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ రమా దేవి విలేకరులకు వెల్లడించారు. మొత్తం పదకొండు బృందాలతో కలసి 14 ప్రదేశాలపై దాడులు నిర్వహించామని చెప్పారు. గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్‌లలో జరిపిన సోదాల్లో దుర్గాప్రసాద్ పేరుతో పాటు ఆయన అత్త ఉషారాణి, స్నేహితులు, బంధువుల పేర్లపై పలు ఆస్తులు ఉన్నట్టు గుర్తించామన్నారు. అలాగే సోదాల్లో 750 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి, రూ.50 వేల నగదు బయట పడిందని తెలిపారు. మొత్తంగా ఆదాయానికి మించి రూ.2 కోట్ల మేర ఆస్తులు కూడబెట్టినట్లు తేలిందని వెల్లడించారు.