సబర్మతీ ఆశ్రమంలో మహాత్మునికి నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ
అహ్మదాబాద్: 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమంలో శుక్రవారం ప్రారంభించారు. జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన చరిత్రాత్మక దండియాత్రను స్మరించుకుంటూ సబర్మతీ ఆశ్రమం నుంచి పాదయాత్రకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. ఈ యాత్రలో 81 మంది పాల్గొంటున్నారు. వీరంతా 386 కిలోమీటర్లు నడిచి ఏప్రిల్ 5వ తేదీ నాటికి నవసరీ జిల్లాలోని దండికి చేరుకుంటారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా మహాత్మాగాంధీ 78 మంది అనుచరులతో కలిసి 1930 మార్చి 12న దండియాత్రలో మొదటి అడుగు వేసిన సంగతి తెలిసిందే.
ప్రజాస్వామ్యానికి తల్లి.. భారత్
75వ స్వాతంత్య్ర దినోత్సవాలు 2022 ఆగస్టు 15 వరకూ కొనసాగుతాయని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. దేశంలో ఎంతోమంది మహనీయులు తగిన గుర్తింపునకు నోచుకోలేకపోయారని, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో గత ఆరేళ్లుగా వారి చరిత్రను పదిలపర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంప్రదాయాలు మనకు గర్వకారణమని చెప్పారు. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది భారత్ అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని వ్యాఖ్యానించారు. మనం సాధించిన ఘనతలు, విజయాలు మనకు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా వెలుగులు పంచుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. మనం ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్ భారత్’తో ప్రపంచ అభివృద్ధి ప్రయాణం వేగం పుంజుకుంటుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
అవి మన చోదక శక్తులు
‘‘ఐదు స్తంభాలు.. స్వాతంత్య్ర పోరాటం, ఆలోచనలు, విజయాలు, చర్యలు, తీర్మానాలు అనేవి మనం ముందుకు సాగడానికి తోడ్పడే చోదకశక్తులు. మహనీయుల చరిత్రను వెలికి తీసి, పదిలపరుస్తున్నాం. దండియాత్రతో ముడిపడి ఉన్న ప్రాంతానికి, అండమాన్‌లో నేతాజీ సుభాష్‌చంద్రబోస్ త్రివర్ణ పతాకం ఎగురవేసిన ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చాం. అలాగే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు సంబంధించిన స్థలాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేశాం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.
నా అంకితభావం బలోపేతం
అంతకుముందు ఢిల్లీ నుంచి విమానంలో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన నరేంద్ర మోదీ నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఆశ్రమంలో 1918 నుంచి 1930 వరకు గాంధీజీ తన భార్య కస్తూర్బాతో కలిసి నివసించిన హృదయ్‌కుంజ్ అనే ఇంటిని మోదీ సందర్శించారు. ‘ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్’ మన స్వాతంత్య్ర సమర యోధులకు, స్వాతంత్య్ర పోరాటానికి ఒక నివాళి అని సందర్శకుల పుస్తకంలో రాశారు. జాతి నిర్మాణం పట్ల తన అంకితభావం సబర్మతీ ఆశ్రమానికి రావడంతో, బాపూజీ స్ఫూర్తితో మరింత బలోపేతమయ్యిందని అందులో పేర్కొన్నారు. స్వావలంబన(ఆత్మ నిర్భరత), ఆత్మ విశ్వాసం అనే సందేశాన్ని బాపూజీ ఇక్కడి నుంచే ఇచ్చారని గుర్తుచేశారు. సబర్మతీ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను నరేంద్ర మోదీ తిలకించారు.
వోకల్ ఫర్ లోకల్..
స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభం కంటే ముందు ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ఏదైనా స్థానిక ఉత్పత్తిని కొనుగోలు చేసి, ఆ ఫొటోను ‘వోకల్‌ఫర్‌లోకల్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టు చేయాలని సూచించారు. సబర్మతీ ఆశ్రమంలో ఒక చరఖాను ఏర్పాటు చేస్తామని, ఆత్మనిర్భరతకు సంబంధించిన ప్రతి ట్వీట్‌కు ఇది ఒక పూర్తివృత్తం తిరుగుతుందని చెప్పారు. స్థానిక ఉత్పత్తుల కొనుగోలును ప్రోత్సహించే దిశగా ఇదొక ఉత్ప్రేరకంగా పని చేస్తుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘వోకల్‌ఫర్‌లోకల్’ గాంధీజీకి, మన స్వాతంత్య్ర సమరయోధులకు గొప్ప నివాళి అవుతుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment