విద్యా సౌగంధిక! | St. Francis College For Women Diamond Jubilee Celebrations | Sakshi
Sakshi News home page

విద్యా సౌగంధిక!

Published Fri, Aug 2 2019 1:30 PM | Last Updated on Fri, Aug 2 2019 1:30 PM

St. Francis College For Women Diamond Jubilee Celebrations - Sakshi

జూబ్లీహిల్స్‌: సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాల. తెలుగు రాష్ట్రాల్లో పరిచయంఅక్కరలేని మహిళా కళాశాల. అరవై వసంతాల ఘన చరిత దీని సొంతం. నగరం నడిబొడ్డున 8 ఎకరాల సువిశాల స్థలంలో సకల సౌకర్యాలతో కూడిన ప్రాంగణంతో ఈ కళాశాల అలరారుతోంది. విద్యా సౌగంధికగా విరాజిల్లుతోంది. డైమండ్‌ జూబ్లీ వేడుకలు చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

సిస్టర్స్‌ ఆఫ్‌ చారిటీ. ఇటలీలో 1832లో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా సామాజిక,  విద్యారంగంలో సేవలు అందిçస్తున్న  ప్రఖ్యాత సేవాసంస్థ. 1860లో భారత్‌లో ప్రవేశించి క్రమంగా తన సేవలను విస్తరించింది. 1959లో 15మంది విద్యార్థినులతో సికింద్రాబాద్‌లో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ మహిళా కళాశాలను ప్రారంభించింది. ముందుగా బీఏ కోర్స్‌ తర్వాత బీకాం, బీఎస్సీ కోర్సులు ప్రారంభించింది. 1977 ప్రాంతంలో బేగంపేటలోని కుందన్‌బాగ్‌లో 8ఎకరాల సువిశాల ప్రాంగణంలోకి కళాశాలను మార్చారు. 1999లో నాక్‌ 5 స్టార్‌ గుర్తింపు లభించింది.  క్రమంగా 2006, 2012లలో ‘ఎ’ గ్రేడ్‌ గుర్తింపు పొందింది. 2014లో ప్రతిష్టాత్మకమైన ‘కాలేజ్‌ విత్‌ పొటెన్షియల్‌ ఎక్స్‌లెన్స్‌ ’ (సీపీఈ)గా నాక్‌ ప్రకటించింది. 2018లో గోల్డెన్‌ జూబ్లీ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం 172మంది అధ్యాపకులు, 110 మంది నాన్‌టీచింగ్‌ స్టాఫ్, 4 వేలకుపైగా విద్యార్థిలున్నారు. 

కోర్సులు ఇవీ..
26 డిపార్ట్‌మెంట్లతో పలు పీజీ, యూజీ కోర్సులు, సర్టిఫికెట్‌ కోర్సులు, ఫారిన్‌ కొలాబరేషన్‌తో కొన్ని కోర్సులునిర్వహిస్తున్నారు.

పూర్వ విద్యార్థులు.. హేమాహేమీలు..
వివిధరంగాల్లో ఉన్నత స్థితికి ఎదిగిన ఎంతోమంది విద్యార్థులను ఈ కళాశాల అందించింది. ఐఏఎస్‌ అధికారులు స్మితా సబర్వాల్, వాణీమోహన్, సునీత ఐపీఎస్‌ తేజ్‌దీప్‌కౌర్‌ మీనన్, నటీమణులు మంచు లక్ష్మి, నందిత, అర్చనా వేద తదితరులు ఇక్కడ చదువుకున్నవారే. కళాశాలలో పలు విభాగాలు క్లబ్‌లు నిర్వహిస్తున్నాయి. వ్యాపారంగంలో ప్రవేశించాలనుకునే విద్యార్థినుల కోసం ప్రత్యేక ఎంటర్‌ప్రెన్యూర్‌ సెల్‌ నిర్వహిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ఎన్‌సీసీ విభాగాలు ఉన్నాయి. విద్యార్థినులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని పలు పతకాలు సాధించారు.

గ్రీన్‌ కాలేజీ..
పర్యావరణ పరిరక్షణకు ఈ కళాశాల పెద్దపీట వేస్తోంది. ప్రాంగణంలో వర్షపు నీరు ఒడిసిపట్టడానికి ఇంకుడుగుంతలు ఏర్పాటు చేశారు. శుభం పేరుతో వేస్ట్‌ మేనేజ్‌మెంట్, సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ‘ప్రకృతి’ పేరుతో ప్రత్యేకంగా కాలేజీ క్లబ్‌ ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలునిర్వహిస్తున్నారు. 

యూజీసీ అటానమస్‌ హోదా..  
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతున్న ఈ కళాశాలకు నగరంలో మొదటిసారిగా 1988లో యూజీసీ అటానమస్‌ హోదా  లభించింది. 2015 నుంచి ‘చాయిస్‌ అండ్‌  క్రెడిట్‌ బేస్డ్‌ సెమిస్టర్‌ సిస్టమ్‌’ (సీసీబీఎస్‌ఎస్‌) పద్ధతి అమలు చేస్తున్నారు.  

ఎన్నో సదుపాయాలు
83 వేలకుపైగా పుస్తకాలు, ‘స్లిమ్‌ 21 ’పేరుతో కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ జర్నల్స్, ఇంటర్నెట్‌ రిసోర్స్‌ సెంటర్, సైన్స్‌ ల్యాబ్, ఇంగ్లిష్‌ ల్యాబ్, కంప్యూటర్‌ ల్యాబ్, యూజీ, పీజీ సైకాలజీ ల్యాబ్, మాస్‌కమ్యునికేషన్‌ ల్యాబ్, ఇండోర్‌ స్టేడియం, స్టూడెంట్‌ కార్నర్, మైక్రోబయాలజీకి ప్రత్యేకించిన లూయిస్‌ పాశ్చర్‌ రిసెర్చ్‌ ల్యాబ్, ఫిటనెస్‌ సెంటర్, హెల్త్‌సెంటర్, అమెరికన్‌ కార్నర్‌ తదితర సదుపాయాలు ఏర్పాటు చేశారు.

15 మందితో ప్రస్థానం మొదలు..
1959లో కేవలం 15మంది విద్యార్థినులతో కళాశాల ప్రయాణం మొదలైంది. ఆరు దశాబ్దాల కాలంలో 4వేలకుమందికిపైగా విద్యార్థినులు, 28 విభాగాలు, 300కిపైగా టీచింగ్, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌తో సాగుతోంది. విలువలతో కూడిన విద్యాబోధన మా సొంతం. ఇందుకు సహకరిస్తున్న  ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.   – సాండ్రా హోర్తా, ప్రిన్సిపాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement