
అహ్మదాబాద్: ప్రజల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడంలో భారత న్యాయవ్యవస్థ తనవంతు కర్తవ్యాన్ని భేషుగ్గా నిర్వర్తిస్తోందని, భారత రాజ్యాంగాన్ని ఇది బలోపేతం చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. గుజరాత్ హైకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకల్లో మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. కరోనా వైరస్ సంక్షోభంలో భారత న్యాయస్థానాలు ఉత్తమ పనితీరు కనపర్చాయన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అధికంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలు చేపట్టిందని ఆయన తెలిపారు. దేశ భవిష్యత్ న్యాయవ్యవస్థ అవసరాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు మోదీ చెప్పారు. గుజరాత్ హైకోర్టు వ్యవస్థాపన జరిగిన 60ఏళ్లయిన సందర్భంగా మోదీ తపాలా బిళ్లను విడుదల చేశారు.
ప్రత్యక్ష ప్రసారాల ఆరంభం..
కోవిడ్ సందర్భంలో ప్రత్యక్ష ప్రసారాలను మొట్టమొదటిగా ప్రారంభించింది గుజరాత్ హైకోర్టేనని మోదీ చెప్పారు. ‘దేశంలో 18,000 పైగా కోర్టులు కంప్యూటీకరించబడ్డాయి. వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీ కాన్ఫరెన్సింగ్‌లకు సుప్రీంకోర్టు అనుమతించడంతో దేశంలోని అన్ని కోర్టుల్లో ఆన్‌లైన్ విచారణలు సాధ్యమయ్యాయి’ అని మోదీ అన్నారు. డిజిటల్ విభజనను తగ్గించడానికి హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో కూడా ఈ సేవా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు మోదీ చెప్పారు. దేశంలో తొలి లోక్ అదాలత్ గుజరాత్‌లోని జునాగఢలో నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమైందని మోదీ తెలిపారు.