ఆరడుగుల బుల్లెట్‌ | Land mafia in munnar vs IAS Sriram | Sakshi
Sakshi News home page

ఆరడుగుల బుల్లెట్‌

Published Tue, May 2 2017 5:36 AM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

ఆరడుగుల బుల్లెట్‌

ఆరడుగుల బుల్లెట్‌

మున్నార్‌... కేరళలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. సముద్ర మట్టానికి 5,200 అడుగుల ఎత్తులో ఉన్న హిల్‌స్టేషన్‌. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ వేసవి తాపాన్ని తప్పించుకోవడానికి లక్షలాది పర్యాటకులు ఏటా మున్నార్‌కు వస్తుంటారు. ఇదే అక్కడో మాఫియా పుట్టడానికి కారణం. అది ల్యాండ్‌ మాఫియా. మున్నార్‌ ల్యాండ్‌ మాఫియా. ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమించి రిసార్టో, హోటలో కట్టేయడం. వాణిజ్య సముదాయాలు లేపేయడం. పార్టీలతో సంబంధం లేకుండా నేతలందరీ బినామీల పేరిట ఇదే దందా. అది 2016 జూలై. దేవికుళం సబ్‌ కలెక్టర్‌గా ఒక్కడొచ్చాడు... పేరు శ్రీరామ్‌ వెంకిటరమణన్‌. 2013లో సివిల్‌ సర్వీసెస్‌లో దేశంలోనే రెండో ర్యాంకు సాధించిన కేరళవాసి. 
 
సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపడుతూనే శ్రీరామ్‌ ఈ ప్రభుత్వ స్థలాల దురాక్రమణలపై దృష్టి పెట్టాడు. రెవెన్యూ యంత్రాగాన్ని పరుగులు పెట్టించి ఆక్రమణలను తొలగించాడు. పార్టీ యంత్రాంగాలు, ట్రేడ్‌ యూనియన్లు బలంగా ఉండే కేరళలో శ్రీరామ్‌ తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నాడు. నిరసనలకు దిగినా, భౌతికంగా అడ్డుగా నిలిచినా, దూషణలకు దిగినా... లెక్కచేయలేదాయన. హైకోర్టులో ఈ కూల్చివేతలు నిలిపివేయాలని పిటిషన్లు పడితే... ప్రతికేసులో పక్కా ఆధారాలు సమర్పించి ప్రభుత్వ భూమిగా నిరూపిస్తూ పోయారు. పోలీసులు సహకరించకున్నా... ఆక్రమణలను కూల్చడంలో వెనుకడుగు వేయలేదు. బెదిరించారు... రాజకీయంగా ఒత్తిడి తెచ్చారు.
 
ప్రజలకేదో సేవచేయాలనే ఉద్దేశంతో డాక్టర్‌ వృత్తిని వదులుకొని సివిల్స్‌ను ఎంచుకొన్న ఈ యువ అధికారి తగ్గలేదు. అక్రమాలను సహించని స్థానిక యువతలోనూ అతనికి క్రేజ్‌ ఏర్పడింది. రెండు వారాల కిందట మన్నూర్‌ సమీపంలోని చిన్నక్కనల్‌ గ్రామంలో ఆక్రమిత భూమిలో నుంచి ఓ చర్చికి సంబంధించిన శిలువను తొలగించింది శ్రీరామ్‌ బృందం. అంతే కాచుకొని ఉన్న పార్టీలు రాజకీయం చేశాయి. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారనే ఫిర్యాదు కేరళ సీఎం పినరయి విజయన్‌కు వెళ్లింది. అఖిలపక్షం నిర్వహించే దాకా ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని విజయన్‌ ఇడుక్కి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీచేశారు. అయితే అఖిలపక్షం పెట్టేదిశగా సీఎం ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సీపీఎంలో బలమైన నాయకుడిగా పేరున్న విద్యుత్‌శాఖ మంత్రి కె.కె.మణిది ఇడుక్కి జిల్లానే.
 
శ్రీరామ్‌ ధోరణితో రగిలిపోతున్న ఆయన ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ ‘చర్చిలు, దేవాలయాలు, మసీదులు ఎన్నో పట్టాలేని భూముల్లో ఉన్నాయి. వీటిని తొలగించొచ్చని ఓ మూర్ఖపు సబ్‌ కలెక్టర్‌ అనుకుంటే... అతన్ని పిచ్చాసుపత్రికి పంపాల్సిందే’ అని తన అక్కసును వెళ్లగక్కారు. శ్రీరామ్‌ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోరు. చట్టానికి లోబడి పనిచేస్తున్నపుడు... తానెవరికీ భయపడాల్సిన పనిలేదని అంటారాయన. బదిలీలు అనేవి ఉద్యోగికి మామూలేనని తేలికగా తీసుకునే.. శ్రీరామ్‌ విషయంలో కేరళలోని సీపీఎం ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
 
నిజాయితీ పరుడైన అధికారిని అకారణంగా బదిలీ చేశారనే అపవాదు తెచ్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుందా? గుబురుగా పెరిగిన గడ్డం, జీన్స్‌ ప్యాంటు, పైన జాకెట్‌ లేదా టీషర్ట్‌. ఇదీ శ్రీరామ్‌ ఆహర్యం. సామాన్యుడిలా బుల్లెట్‌పై మున్నార్‌ చుట్టుపక్కల గ్రామాలన్నీ కలియదిరుగుతూ ప్రజలతో మమేకమవుతుంటారు. అన్యాయంపై ఎక్కుపెట్టిన ఆరడుగుల బుల్లెట్‌గా జనం  మన్ననలు అందుకుంటున్నాడీ 31 ఏళ్ల యువ ఐఏఎస్‌.
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement