టీ తోటల మధ్యలో క్వార్టర్లు
ఆకాశం మబ్బు పట్టి ఉంది. ఉదయం నుంచి వర్షం కురిసి వాతావరణం చల్లగా ఉంది. వేడివేడిగా టీ తాగాలనిపిస్తుంది. వంటగదిలోకెళ్లి టీ కెటిల్‌లో నీళ్లు పెట్టి గత ఏడాది మునార్ టూర్‌కెళ్లినప్పుడు తెచ్చుకున్న టీ పౌడర్ వేసి మూతపెడతాం. రొటీన్ టీ కాదు, ఒక ఏలక్కాయ కూడా వేస్తే... అనుకుంటూ ఒక ఏలక్కాయను కొట్టి టీలో వేస్తాం. ఎంతయినా అక్కడ నుంచి తెచ్చుకున్న టీ పొడి, ఏలక్కాయల క్వాలిటీనే వేరు. ఆకు పచ్చటి పెద్ద ఏలక్కాయలు మనకు దొరకడం చాలా అరుదు. ఇవి సౌదీకి ఎగుమతి అవుతాయట. ఒక ఏలక్కాయ రైతుకి ఒక ఎకరా పంట నుంచి ఏడాదికి లక్ష రూపాయలు వస్తాయట. కేరళ పర్యటనలో తెలుసుకున్న వివరాలన్నీ గుర్తు చేసుకుంటూ తుంపరలుగా పడుతున్న చిరు చినుకులను కిటికీలో నుంచి చూస్తూ టీని ఆస్వాదిస్తాం. వీటన్నింటికీ వెనుక మరో కోణం ఉంది. వాళ్ల నాసిక ఏలకుల సువాసనను గుర్తించడం మానేసి తరాలు దాటుతోంది. తేయాకులోని వగరు మినహా మరేమీ మిగలని జీవితం వాళ్లది. తల దాచుకోవడానికి ఇల్లు కావాలి, ఆ ఇల్లు కావాలంటే టీ తోటలోనే పని చేయాలి.
తరాలుగా తోటల్లోనే
టీ కంపెనీ అడ్వర్టయిజ్‌మెంట్‌లో ఒక అందమైన అమ్మాయి రంగురంగుల దుస్తులు ధరించి, చక్కగా మేకప్ వేసుకుని, వీపుకు వెదురు బుట్ట కట్టుకుని పాట పాడుతూ, సంగీతానికి అనుగుణంగా లయబద్దంగా పాదాలను కదిలిస్తూ మునివేళ్లతో లేత టీ ఆకులను కోసి వెనుక ఉన్న బుట్టలో వేస్తుంది. నిజానికి టీ తోటల్లో పని చేసే ఆడవాళ్ల చేతులు యాడ్‌లో అమ్మాయి చేతులున్నట్లు మృదువుగా ఉండవు. టీ ఆకులను కోసి కోసి, కొమ్మలు గీరుకుపోయి గరుకుబారి ఉంటాయి. పని చేసేటప్పుడే కాదు, పండుగ పబ్బాలకు కూడా ఖరీదైన దుస్తులు ధరించే పరిస్థితి ఉండదు. ఈ ఉద్యోగంలో తినడానికి తిండి ఉంటుంది. కట్టుకోవడానికి ముతక దుస్తుల వరకు భరోసా ఉంటుంది. ఉండడానికి ఇల్లు... ఇల్లు ఉంటుంది. కానీ అది సొంతం కాదు.
టీ తోటలో కార్మికులు
ఎస్టేట్ యజమానులు ఏర్పాటు చేసిన క్వార్టర్. వంటగది, ఒక బెడ్ రూమ్, ముందుగది ఒకటి మొత్తం మూడు గదులతో గూడ పెంకు కప్పిన చిన్న పోర్షన్. అక్కడ ఉద్యోగం చేసినంత కాలం ఆ ఇంటిలో ఉండవచ్చు. రిటైర్ అయిన తర్వాత ఖాళీ చేసి వెళ్లి పోవాలి. ఖాళీ చేస్తే ఎక్కడికి పోవాలి? అదే ఇప్పుడు వారిని తరతరాలుగా వేధిస్తున్న ప్రశ్న. మూడు తరాలకు ముందు తమిళనాడు నుంచి వలస వచ్చిన కుటుంబాలున్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్లడానికి తమ ఊరు ఏదో కూడా ఈ తరానికి తెలియదు. దాంతో విధిగా తర్వాతి తరం కూడా టీ తోటల్లోనే ఉపాధిని వెతుక్కోవాల్సి వస్తోంది.
ఇంటికోసమే ఈ పని
బయటకు వెళ్తే ఏ పని చేసుకున్నా ఎక్కువ డబ్బు వస్తుంది, అంతే మొత్తంలో ఆ డబ్బు ఇంటి అద్దెలకు పోతుంది. అందుకే ఇందులోనే మగ్గిపోక తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు కేరళలోని మునార్ టీ తోటలు, ఇడుక్కి ఏలకుల తోటల పనివాళ్లు. ‘కొచ్చిలో బేకరీలో పని చేస్తే రోజుకు వెయ్యి రూపాయలు వచ్చేవి. మా అమ్మా నాన్న టీ తోటల్లో పనిచేసేవాళ్లు. టీ ఎస్టేట్ ఇచ్చిన క్వార్టర్‌లో ఉండేవాళ్లు. ఇప్పుడు వాళ్లు రిటైర్ అయ్యారు. మాకు క్వార్టర్ కావాలంటే ఎవరో ఒకరం టీ తోటల్లో పని చేయాలి. అందుకే బేకరీ ఉద్యోగం వదిలేసి టీ తోటల పనికి వచ్చాను. ఇక్కడ రోజుకు మూడు వందలు వస్తాయి’ అని చెప్తున్నాడు ఓ కార్మికుడు.
Comments
Please login to add a commentAdd a comment