వయనాడ్‌ వారియర్స్‌: స్త్రీని కాబట్టి వెనక్కు తగ్గాలా? | Anganwadi Teacher Vijayakumari Helped The Victims In The Wayanad Kerala Incident | Sakshi
Sakshi News home page

వయనాడ్‌ వారియర్స్‌: స్త్రీని కాబట్టి వెనక్కు తగ్గాలా?

Published Wed, Aug 7 2024 9:23 AM | Last Updated on Wed, Aug 7 2024 9:23 AM

Anganwadi Teacher Vijayakumari Helped The Victims In The Wayanad Kerala Incident

వయనాడ్‌ వారియర్స్‌..

ప్రమాదం జరిగినప్పుడు స్త్రీలను అక్కడకు వెళ్లనివ్వరు. చాలామంది స్త్రీలు తమ భర్త, కొడుకులను సహాయానికి పంపడానికి సంశయిస్తారు. కాని వయనాడ్‌ వరద బీభత్సం సంభవించినప్పుడు ఒక అంగన్‌వాడి టీచర్‌ రక్షణ దళాలతో సమానంగా రంగంలో దిగింది. సహాయక చర్యల్లో పాల్గొంది. ‘ఇంత దారుణ పరిస్థితిలో అందరూ ఉంటే స్త్రీని కాబట్టి నేను వెనక్కు తగ్గాలా?’ అని ప్రశ్నించిందామె.

వయనాడ్‌లోని చిన్న పల్లె ముప్పైనాడ్‌. అక్కడ అంగన్‌వాడి టీచర్‌గా పని చేస్తోంది 36 ఏళ్ల విజయకుమారి. జూలై 30 తెల్లవారుజామున నాలుగు గంటలకు ఫోన్‌ కాల్‌ అందుకుంది. వాళ్ల పల్లె నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న చూరల్‌మలను వరద చుట్టుముట్టిందని అందరూ ప్రమాదంలో ఉన్నారని. ఆమె అంగన్‌వాడి టీచర్‌. ప్రమాదస్థలంలో ఆమెకు ఏ విధమైన విధులు లేవు ఒక ఉద్యోగిగా. ఒక పౌరురాలిగా ఎలాంటి నిర్బంధం లేదు సేవకు. కాని ఆమె ఆగలేక΄ోయింది. వెంటనే బయల్దేరడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. బయట భారీ వర్షం. హోరు గాలి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. అయినా సరే తన టూ వీలర్‌ తీసి చూరల్‌మలకు బయలుదేరింది. తెల్లవారుజాము ఐదు అవుతుండగా అక్కడకు చేరుకుంది.

కాని అక్కడ కనిపించిన దృశ్యం ఆమెను అవాక్కు చేసింది. తనకు బాగా పరిచయమైనప్రాంతం, జనావాసం ఇప్పుడు కేవలం బురదదిబ్బ. ఎవరు ఏమయ్యారో తెలియదు. సహాయ బృందాలు వచ్చి అప్పుడప్పుడే సహాయక చర్యలు మొదలెట్టాయి. విజయకుమారి ఏమీ ఆలోచించలేదు. వెంటనే రంగంలో దిగింది. వారికి తనను పరిచయం చేసుకుని అగ్నిమాపక బృందం వారి షూస్, ఇనుపటోపి పెట్టుకుని రంగంలో దిగింది. ఆ తర్వాత ఆమె చేసినదంతా ఎవరూ చేయలేనంత సేవ. ‘నా ఎదురుగా మహా విపత్తు.ప్రాణంపోయిన వారు ఎందరో. ఇలాంటి సందర్భంలో స్రీగా వెనక్కు తగ్గాలా? అనిపించింది. కాని మనిషిగా ముందుకే వెళ్లాలని నిశ్చయించుకున్నాను. సహాయక చర్యల్లో పాల్గొన్నాను. తెల్లవారుజాము 5 నుంచి 8 లోపు ఎన్నో మృతదేహాలను వెలికి తీసి రవాణా చేయడంలో సాయ పడ్డాను’ 
అందామె.

పనికి వచ్చిన కరాటే..
విజయకుమారికిపోలీసు కావాలని చిన్నప్పటి నుంచి కోరిక.పోలీసు కావాలని కరాటే నేర్చుకొని బ్రౌన్‌ బెల్ట్‌ వరకూ వెళ్లింది. అంతేకాదు పరీక్షలు రాసిపోలీస్‌గా సెలెక్ట్‌ అయ్యింది కూడా. కాని వాళ్ల నాన్నకు ఆమె ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. అపాయింట్‌మెంట్‌ లెటర్‌ చింపేశాడు. ఆమె అంగన్‌వాడి టీచర్‌గా మిగలాల్సి వచ్చింది. పోలీస్‌ కావాలని నేను తీసుకున్న కరాటే శిక్షణ, చేసిన ఎక్సర్‌సైజులు నాకు ఈ సమయంలో తోడు వచ్చాయి. రక్షణ దళాలతో సమానంగా నేను కష్టపడ్డాను. మనిషికి మనిషి సాయం చేయాల్సిన సమయం ఇది. ముఖ్యంగా ఈ సమయంలో ఎందరో స్త్రీలు దుఃఖంతో స్పృహ త΄్పారు. సహాయక బృందాల్లో అందరూ మగవారే ఉంటారు. వారు ఓదార్చలేరు. కాని నేను స్త్రీని కావడం వల్ల వారిని దగ్గరకు తీసుకొని ఓదార్చగలిగాను. ఇలాంటి సందర్భాల్లో స్త్రీలు ఉండాలి స్త్రీల కోసం’ అంటుంది విజయకుమారి. ఆమె సేవలను అందరూ మెచ్చుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement