బెంగళూరు: కర్నాటక మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నందున ఈ పథకాన్ని సమీక్షిస్తామని తెలిపారు. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఐరావత క్లబ్ క్లాస్ 2.0 బస్సులను బుధవారం ప్రవేశపెట్టాక శివకుమార్ మాట్లాడారు.
‘సోషల్ మీడియా ద్వారా, ఈ–మెయిళ్ల ద్వారా చాలామంది మహిళలు టికెట్లకు డబ్బులు చెల్లించి ప్రయాణిస్తామని మమ్మల్ని సంప్రదిస్తున్నారు. దీనిపై చర్చిస్తాం’ అని శివకుమార్ తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించే శక్తి పథకం కాంగ్రెస్ కన్నడనాట ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఒకటనే విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కిందటేడాది జూన్ 11న శక్తి పథకాన్ని ప్రారంభించింది.
ఈనెల 18 నాటికి 311 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగ్గా.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,507 కోట్లను దీనిపై వెచ్చించింది. ‘‘ 5 నుంచి 10 శాతం మంది మహిళలు టికెట్లకు డబ్బు చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా.. కండక్టర్లు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. రవాణా మంత్రి రామలింగా రెడ్డితో దీనిపై చర్చిస్తాను’’ అని శివకుమార్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment