ఎటుచూసినా నీటి ఎద్దడే నగరంలో వట్టిపోయిన బోర్లు
వేసవి రాకముందే సమస్య
నీటి వాడకంపై ఆంక్షలు
ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా
‘‘అవడానికి మాదో లగ్జరీ అపార్ట్‌మెంట్. కానీ ఏం లాభం? నెల రోజులుగా చుక్క నీటికీ దిక్కు లేక అల్లాడుతున్నాం! 24 గంటలూ రావాల్సిన నల్లా నీళ్లు ఏ రాత్రి వేళో వస్తున్నాయి. అవీ మురికిమయం! స్నానపానాలకే కాదు, చివరికి టాయ్‌లెట్ అవసరాలకు కూడా నీరు లేదు. సరిగా నీళ్లు కూడా పోయక ఏ ఫ్లాట్‌లో చూసినా టాయ్‌లెట్లు భరించలేనంతగా కంపు కొడుతున్నాయి. దాంతో రెసిడెంట్లు మూకుమ్మడిగా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.
అలా వెళ్లలేనివాళ్లం విధిలేక పక్కనే ఉన్న ఫోరం సౌత్ మాల్‌లోకి వెళ్లి టాయ్‌లెట్ అవసరాలు తీర్చుకుంటున్నాం!’’ – రెడిట్‌లో ఓ బెంగళూరు వాసి పెట్టిన పోస్టిది! అలాంటిదేమీ లేదంటూ సదరు అపార్ట్‌మెంట్ అసోసియేషన్ ఖండించినా ఈ పోస్టు ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనికి బెంగళూరు టెకీల నుంచి విపరీతమైన స్పందన వెల్లువెత్తుతోంది. తమ నీటి కష్టాలకు అంతు లేదంటూ వర్ణిస్తూ వారు పెడుతున్న పోస్టులతో ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది...
దేశ ఐటీ రాజధాని బెంగళూరు గొంతెండిపోతోంది. తీవ్ర నీటి కొరతతో అల్లాడుతోంది. గుక్కెడు తాగునీటి కోసం జనం అలో లక్ష్మణా అంటూ అలమటిస్తున్నారు. నగరవ్యాప్తంగా బోర్లన్నీ చుక్క నీరైనా లేకుండా ఎండిపోయాయి. నగరంలో ఏటా వేసవిలో నీటి కొరత మామూలే అయినా ఈసారి మాత్రం సమస్య చాలా దారుణంగా ఉంది. ఇంకా వేసవి మొదలైనా కాకముందే నీటి కొరత తారస్థాయికి చేరింది.
కోట్లు పెట్టి లగ్జరీ అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్లు కూడా కనీసం స్నానానికైనా నీళ్లు లేక లబోదిబోమంటున్నారు. సమర్థమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేక ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రస్తుతానికి చేష్టలుడిగింది. రాష్ట్రవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొని ఉందంటూ ప్రకటించింది! నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే తాలూకా స్థాయిలో కంట్రోల్ రూములు, హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసింది.
బెంగళూరులో నీటి సమస్య నివారణకు ఎంతదూరమైనా వెళ్తామంటూ ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ చేసిన ప్రకటనలు ఇప్పటికైతే కార్యరూపం దాల్చలేదు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకుండా చూసేందుకు నగరంలో నీటి వాడకంపై రాష్ట్ర జల బోర్డు కఠిన ఆంక్షలు విధించింది. కార్లు కడిగేందుకు, మొక్కలకు, మెయింటెన్స్, నిర్మాణ పనులకు తాగునీటి వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా తప్పదని హెచ్చరించింది.
బెంగళూరులోనే గాక కర్ణాటకవ్యాప్తంగా నీటి ఎద్దడి ఆందోళనకర స్థాయిలోనే ఉంది. గత సీజన్లో వర్షాభావమే ఈ దుస్థితికి కారణమన్న ప్రభుత్వ ప్రకటనపై జనం మండిపడుతున్నారు. ఇంతటి సమస్య తప్పదని ముందే తెలిసి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేదంటూ దుయ్యబడుతున్నారు. ‘‘నిజానికి మూడు నెలలుగా నీటి సమస్య వెంటాడుతోంది. నెల నుంచి పరిస్థితి మరీ విషమించింది’’ అంటూ వాపోతున్నారు.
ట్యాంకర్ల రేట్లు చుక్కల్లోకి...
► బెంగళూరులో ఏకంగా 60 శాతం జనం నీటి కోసం వాటర్ ట్యాంక్‌ల మీదే ఆధారపడ్డారు! అదను చూసి ప్రైవేట్ ట్యాంకర్లు రేట్లు ఎడాపెడా పెంచేశాయి.
► మామూలు రోజుల్లోనే 6,000 లీటర్ల ట్యాంకర్‌కు రూ.600, 8,000 లీటర్లకు రూ.800, 12 వేల లీటర్ల ట్యాంకరైతే రూ.1,000 చార్జి చేస్తారు.
► ఈ రేట్లకు జీఎస్టీ అదనం. పైగా దూరం 5 కి.మీ. దాటితే మరో రూ.200 దాకా పెరుగుతుంది.
► ఇప్పుడు ప్రైవేట్ ట్యాంకర్లు రెట్టింపు, అంతకుమించి వసూలు చేస్తున్నాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు.
► దాంతో ట్యాంకర్ల రేట్లకు పరిమితి విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఎక్కడా పెద్దగా అమలు కావడం లేదు.
► ఇవేం ధరలంటూ గట్టిగా నిలదీస్తే ట్యాంకర్‌వాలాలు ఆ కాలనీల ముఖం కూడా చూడటం లేదు.
► మున్సిపాలిటీ నల్లాల వద్ద క్యూ లైన్లు కిలోమీటర్లు దాటేస్తున్నాయి. అక్కడా ఒక్క బిందెకు మించి ఇవ్వడం లేదు!
► ఆర్వో ప్లాంట్ల ముందు కూడా ఒక్కరికి ఒక్క క్యానే అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి!
► చాలా ప్లాంట్లు ‘నో వాటర్’ అంటూ బోర్డులు పెట్టి బ్లాకులో అడ్డగోలు రేట్లకు అమ్ముకుంటున్నాయి.
► నీటి ఎద్దడి దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు ఆన్‌లైన్ బాట పడుతున్నాయి. ఆన్‌లైన్ క్లాసులతో పని కానిస్తున్నాయి.
ఎందుకింత సమస్య...
► 2023లో కర్ణాటకవ్యాప్తంగా నెలకొన్న వర్షా భావ పరిస్థితులు ప్రస్తుత నీటి సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి.
► రాష్టంలో ఎక్కడ చూసినా భూగర్భ జలాలు అడుగంటాయి. కావేరీ బేసిన్లోని రిజర్వాయర్లన్నీ దాదాపుగా వట్టిపోయాయి.
► కర్ణాటకలోని 16 పెద్ద రిజర్వాయర్లలో 2023లో ఇదే సమయానికి సగం వరకున్న నీటిమట్టం ఈసారి 29 శాతానికి పడిపోయింది.
► బెంగళూరులో ఎక్కడ చూసినా బోర్లే దర్శనమిస్తుంటాయి. భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం నగరంలో నీటి ఎద్దడికి ప్రధాన కారణం.
► రియల్టీ బూమ్ నేపథ్యంలో రెండు దశాబ్దాలుగా నగరంలోని చెరువులు, నీటి ఆవాసాలన్నీ కాలనీలు, అపార్ట్‌మెంట్లుగా మారిపోయాయి. ఆ దెబ్బకు స్థానిక నీటి వనరులు పూర్తిగా కనుమరుగయ్యాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment