కర్ణాటక రాజధాని బెంగళూరులో గత కొన్ని రోజులుగా నీటి సంక్షోభం ఏర్పడింది. కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాయి. ఈ తరుణంలో బెంగళూరులో నీటి ఎద్దడి లేదని ఉప ముఖ్యమంత్రి 'డీకే శివకుమార్' కీలక వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరులో నీటి సంక్షోభం లేదు. దాదాపు 7000 బోర్‌వెల్‌లు ఎండిపోయినప్పటికీ.. నీటి కొరత ఉండకూడదని తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పటికే ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నాం. నీటి వనరులను గుర్తించాం.. నీటి సరఫరా జరిగేలా చూస్తామని డీకే శివకుమార్ అన్నారు.
నీటి కొరత రాకుండా ఉండటానికి నగరంలో కార్ వాషింగ్, గార్డెనింగ్, నిర్మాణం, నిర్వహణ కోసం తాగునీటిని ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేదించారు. తాగునీరు, రోజువారీ పనుల కోసం ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడిన నివాసితుల కోసం.. జిల్లా యంత్రాంగం ప్రైవేట్ ట్యాంకర్లకు రేట్లను ఫిక్స్ చేసింది.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 'పొలిటికల్ గేమ్' ఆడుతోందని డీకే శివకుమార్ నిందించారు. రాష్ట్రంలో తీవ్రమైన నీటి కొరత ఉన్నప్పటికీ పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ నది నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం రహస్యంగా విడుదల చేస్తోందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
రామనగర జిల్లాలోని కనకపుర తాలూకాలోని మేకేదాటు వద్ద కావేరి నదికి అడ్డంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 'వాక్ ఫర్ మేకేదాటు ప్రాజెక్ట్' నిర్వహించింది తానేనని శివకుమార్ బీజేపీ నేతలకు గుర్తు చేయాలని కోరారు. ఆ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూసేందుకే పాదయాత్ర నిర్వహించిన విషయం కూడా గుర్తు చేశారు. మేకేదాటు ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ట్రానికి అనుమతి వచ్చేలా చూడాలని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులను ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment