bengaluru city
-
బెంగళూరు గొంతెండుతోంది
‘‘అవడానికి మాదో లగ్జరీ అపార్ట్మెంట్. కానీ ఏం లాభం? నెల రోజులుగా చుక్క నీటికీ దిక్కు లేక అల్లాడుతున్నాం! 24 గంటలూ రావాల్సిన నల్లా నీళ్లు ఏ రాత్రి వేళో వస్తున్నాయి. అవీ మురికిమయం! స్నానపానాలకే కాదు, చివరికి టాయ్‌లెట్ అవసరాలకు కూడా నీరు లేదు. సరిగా నీళ్లు కూడా పోయక ఏ ఫ్లాట్‌లో చూసినా టాయ్లెట్లు భరించలేనంతగా కంపు కొడుతున్నాయి. దాంతో రెసిడెంట్లు మూకుమ్మడిగా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. అలా వెళ్లలేనివాళ్లం విధిలేక పక్కనే ఉన్న ఫోరం సౌత్ మాల్‌లోకి వెళ్లి టాయ్‌లెట్ అవసరాలు తీర్చుకుంటున్నాం!’’ – రెడిట్‌లో ఓ బెంగళూరు వాసి పెట్టిన పోస్టిది! అలాంటిదేమీ లేదంటూ సదరు అపార్ట్మెంట్ అసోసియేషన్ ఖండించినా ఈ పోస్టు ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనికి బెంగళూరు టెకీల నుంచి విపరీతమైన స్పందన వెల్లువెత్తుతోంది. తమ నీటి కష్టాలకు అంతు లేదంటూ వర్ణిస్తూ వారు పెడుతున్న పోస్టులతో ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది... దేశ ఐటీ రాజధాని బెంగళూరు గొంతెండిపోతోంది. తీవ్ర నీటి కొరతతో అల్లాడుతోంది. గుక్కెడు తాగునీటి కోసం జనం అలో లక్ష్మణా అంటూ అలమటిస్తున్నారు. నగరవ్యాప్తంగా బోర్లన్నీ చుక్క నీరైనా లేకుండా ఎండిపోయాయి. నగరంలో ఏటా వేసవిలో నీటి కొరత మామూలే అయినా ఈసారి మాత్రం సమస్య చాలా దారుణంగా ఉంది. ఇంకా వేసవి మొదలైనా కాకముందే నీటి కొరత తారస్థాయికి చేరింది. కోట్లు పెట్టి లగ్జరీ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్లు కూడా కనీసం స్నానానికైనా నీళ్లు లేక లబోదిబోమంటున్నారు. సమర్థమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేక ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రస్తుతానికి చేష్టలుడిగింది. రాష్ట్రవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొని ఉందంటూ ప్రకటించింది! నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే తాలూకా స్థాయిలో కంట్రోల్ రూములు, హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. బెంగళూరులో నీటి సమస్య నివారణకు ఎంతదూరమైనా వెళ్తామంటూ ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ చేసిన ప్రకటనలు ఇప్పటికైతే కార్యరూపం దాల్చలేదు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకుండా చూసేందుకు నగరంలో నీటి వాడకంపై రాష్ట్ర జల బోర్డు కఠిన ఆంక్షలు విధించింది. కార్లు కడిగేందుకు, మొక్కలకు, మెయింటెన్స్, నిర్మాణ పనులకు తాగునీటి వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా తప్పదని హెచ్చరించింది. బెంగళూరులోనే గాక కర్ణాటకవ్యాప్తంగా నీటి ఎద్దడి ఆందోళనకర స్థాయిలోనే ఉంది. గత సీజన్లో వర్షాభావమే ఈ దుస్థితికి కారణమన్న ప్రభుత్వ ప్రకటనపై జనం మండిపడుతున్నారు. ఇంతటి సమస్య తప్పదని ముందే తెలిసి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేదంటూ దుయ్యబడుతున్నారు. ‘‘నిజానికి మూడు నెలలుగా నీటి సమస్య వెంటాడుతోంది. నెల నుంచి పరిస్థితి మరీ విషమించింది’’ అంటూ వాపోతున్నారు. ట్యాంకర్ల రేట్లు చుక్కల్లోకి... ► బెంగళూరులో ఏకంగా 60 శాతం జనం నీటి కోసం వాటర్ ట్యాంక్‌ల మీదే ఆధారపడ్డారు! అదను చూసి ప్రైవేట్ ట్యాంకర్లు రేట్లు ఎడాపెడా పెంచేశాయి. ► మామూలు రోజుల్లోనే 6,000 లీటర్ల ట్యాంకర్‌కు రూ.600, 8,000 లీటర్లకు రూ.800, 12 వేల లీటర్ల ట్యాంకరైతే రూ.1,000 చార్జి చేస్తారు. ► ఈ రేట్లకు జీఎస్టీ అదనం. పైగా దూరం 5 కి.మీ. దాటితే మరో రూ.200 దాకా పెరుగుతుంది. ► ఇప్పుడు ప్రైవేట్ ట్యాంకర్లు రెట్టింపు, అంతకుమించి వసూలు చేస్తున్నాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ► దాంతో ట్యాంకర్ల రేట్లకు పరిమితి విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఎక్కడా పెద్దగా అమలు కావడం లేదు. ► ఇవేం ధరలంటూ గట్టిగా నిలదీస్తే ట్యాంకర్వాలాలు ఆ కాలనీల ముఖం కూడా చూడటం లేదు. ► మున్సిపాలిటీ నల్లాల వద్ద క్యూ లైన్లు కిలోమీటర్లు దాటేస్తున్నాయి. అక్కడా ఒక్క బిందెకు మించి ఇవ్వడం లేదు! ► ఆర్వో ప్లాంట్ల ముందు కూడా ఒక్కరికి ఒక్క క్యానే అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి! ► చాలా ప్లాంట్లు ‘నో వాటర్’ అంటూ బోర్డులు పెట్టి బ్లాకులో అడ్డగోలు రేట్లకు అమ్ముకుంటున్నాయి. ► నీటి ఎద్దడి దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు ఆన్లైన్ బాట పడుతున్నాయి. ఆన్లైన్ క్లాసులతో పని కానిస్తున్నాయి. ఎందుకింత సమస్య... ► 2023లో కర్ణాటకవ్యాప్తంగా నెలకొన్న వర్షా భావ పరిస్థితులు ప్రస్తుత నీటి సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి. ► రాష్టంలో ఎక్కడ చూసినా భూగర్భ జలాలు అడుగంటాయి. కావేరీ బేసిన్‌లోని రిజర్వాయర్లన్నీ దాదాపుగా వట్టిపోయాయి. ► కర్ణాటకలోని 16 పెద్ద రిజర్వాయర్లలో 2023లో ఇదే సమయానికి సగం వరకున్న నీటిమట్టం ఈసారి 29 శాతానికి పడిపోయింది. ► బెంగళూరులో ఎక్కడ చూసినా బోర్లే దర్శనమిస్తుంటాయి. భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం నగరంలో నీటి ఎద్దడికి ప్రధాన కారణం. ► రియల్టీ బూమ్ నేపథ్యంలో రెండు దశాబ్దాలుగా నగరంలోని చెరువులు, నీటి ఆవాసాలన్నీ కాలనీలు, అపార్ట్మెంట్లుగా మారిపోయాయి. ఆ దెబ్బకు స్థానిక నీటి వనరులు పూర్తిగా కనుమరుగయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెంగళూరులో వర్షం బీభత్సం
-
ఐటీ నగరిని ముంచెత్తిన భారీ వర్షాలు
-
‘అలాంటిది ఏమీ లేదు’
సాక్షి, బెంగళూరు : దేశ ఐటీ రాజధాని బెంగళూరులో నూతన సంవత్సర వేడుకల్లో మళ్లీ కీచక పర్వం చోటు చేసుకున్నట్టు వచ్చిన వార్తలను నగర పోలీస్ కమిషనర్ ఖండించారు. అమ్మాయిలను వేధించిన ఘటనలేవీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో జరగలేదని చెప్పారు. గతేడాది కీచక పర్వం చోటు చేసుకున్న ప్రాంతంలో ఓ యువతి ఏడుస్తూ వెళ్లడం అనుమానాలకు తావిచ్చింది. దీనిపై వివరణ ఇచ్చిన కమిషనర్ సునీల్ కుమార్.. సీసీటీవీ ఫుటేజిలో వేధింపులకు సంబంధించిన దృశ్యాలు ఏవీ లభ్యం కాలేదని చెప్పారు. నిరుడు నగరంలోని బిగ్రేడ్, ఎంజీ రోడ్ ప్రాంతాల్లో యువతులపై అల్లరిమూకలు సామూహిక వేధింపులకు పాల్పడినట్టు వెల్లడికావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. రక్షణ కల్పించడంలో విఫలమైన ప్రభుత్వంపై ప్రజలు, విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఈ నేపథ్యంలో 2018 నూతన సంవత్సర వేడుకలకు కర్ణాటక ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేసింది. గతేడాది చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బిగ్రేడ్, ఎంజీ రోడ్డు, చర్చి స్ట్రీట్లలో పెద్ద ఎత్తున పోలీసులను మొహరించింది. ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసింది. డ్రోన్ కెమెరాలు, మఫ్టీ పోలీసులతోనూ నిఘా పెట్టింది. అయితే, ఈ సారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో మొత్తం 1300ల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులో నమోదయ్యాయి. వేడుకల్లో శ్రుతిమించితే కఠిన దండన తప్పదని ముందే పోలీసులు హెచ్చిరించినా బెంగళూరు వాసులు వెనక్కు తగ్గలేదు. కొత్త ఉత్సాహంతో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. -
పెరుగుతున్న గన్ కల్చర్
బెంగళూరు : బెంగళూరు నగరంలో గన్ వినియోగం పై ఆసక్తి పెరుగుతోంది. ఏడాదికేడాది ఇందుకోసం దరఖాస్తు చేసుకొనేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2015 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ తుపాకీ కొనుగోలు, వినియోగానికి సంబంధించి అనుమతి ఇవ్వాల్సిందిగా 1,500 మంది డీజీపీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 30 శాతం ఎక్కువ. దరఖాస్తు చేసుకున్నవారిలో కేవలం 380 మందికి మాత్రమే పోలీసు అధికారులు అనుమతి ఇవ్వగా 256 మంది తుపాకీ వినియోగానికి సంబంధించిన శిక్షణ పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారు శిక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా గన్ను కొనుగోలు చేయడం ఎలా? శిక్షణ ఎక్కడ తీసుకోవాలి? ఆయుధం ధరలు తదితర విషయాలకు సంబంధించిన కథనం... ఎవరికి గన్‌లెసైన్స్ దొరుకుతుంది? అడిగిన వారందరికీ ఆయుధ లెసైన్స్ దొరకదు. నగర కమిషనరేట్‌లో ఆయుధ లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత సదరు వ్యక్తి పూర్వాపరాలను స్థానిక పోలీసులు పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తారు. ఆయుధలెసైన్సు దరఖాస్తుకు కారణం?, సమాజంలో వ్యక్తికి ఉన్న స్థానం, విరోధుల నుంచి ప్రాణహానితో పాటు సదరు వ్యక్తి వృత్తి తదితర విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఆయుధ లెసైన్సును పోలీసు ఆధికారులు జారీ చేస్తారు. మూడు చోట్ల శిక్షణ కేంద్రాలు... నగర ఆర్మ్డ్ రిజర్వ్ ఆధ్వర్యంలో మూడు చోట్ల తుపాకి వినియోగం పై శిక్షణ ఇస్తారు. మైసూరు రోడ్డులోని సిర్సీ సర్కిల్, ఆడుగోడి సర్కిల్లోని సీఏఆర్ ఉత్తర విభాగం ప్రాంగణం, యలహంకలోని సీఏఆర్ దక్షిణ విభాగం ప్రాంగణంలో పోలీసు విభాగం నుంచి అనుమతి పొందిన దరఖాస్తుదారులకు శిక్షణ ఇస్తారు. సీఏఆర్ కేంద్ర కార్యాలయానికిచేరిన దరఖాస్తులను అనుసరించి రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలం 10 రోజులు. ఉదయం 6:30 గంటలకు మొదలయ్యే శిక్షణ మూడు నుంచి నాలుగు గంటల పాటు సాగుతుంది. శిక్షణ తర్వాత సీఏఆర్ అధికారులు నిర్వహించే పరీక్షలో పాస్ అయిన వారికి గన్ ఖరీదు చేయడానికి పూర్తి స్థాయి ధ్రువీకరణ పత్రం అందుతుంది. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల విలువ చేసే ఆయుధాలు... రాష్ట్రంలో రివల్వార్, గన్ తదితర ఆయుధాలను విక్రయించేందుకు ప్రభుత్వం నగరంలో 15 సంస్థలకు అనుమతిచ్చింది. ఈ సంస్థలు దేశ, విదేశాలకు చెందిన ఆయుధాలను విక్రయిస్తుంటాయి. రూ.50 వేల నుంచి మొదలు దాదాపు రూ.4 లక్షల విలువ చేసే ఆయుధాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్కసారి 20 నుంచి వంద బులెట్లను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గన్ను దుర్వినియోగం చేస్తే తక్షణం సదరు వ్యక్తి ఆయుధ లెసైన్స్ రద్దు చేసే అధికారం పోలీసు అధికారులకు ఉంటుంది. -
బెంగళూరులో 'సరి - బేసి విధానం' !
బెంగళూరు : దేశ రాజధాని న్యూఢిల్లీలో సరికొత్తగా అమలు చేస్తున్న 'సరి - బేసి' విధానాన్ని బెంగళూరు నగరంలో కూడా అమలు చేయాలని భావిస్తున్నట్లు కర్ణాటక హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ వెల్లడించారు. శనివారం బెంగళూరులోని సుబ్రహ్మణ్యపుర ప్రాంతంలో నిర్మించిన పోలీస్ క్వార్టర్స్‌ను పరమేశ్వర్ ప్రారంభించారు. అనంతరం జి.పరమేశ్వర్ మాట్లాడుతూ... ఈ విధానం అమలుకు సంబంధించిన సాధక, బాధకాలపై ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీతోపాటు వాయు, శబ్ద కాలుష్యం సైతం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని అంశాలపై తాము చర్చిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో అమలు చేస్తున్న సరి బేసి విధానం ఈ సమస్యకు పరిష్కారం చూపగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందువల్ల ఈవిధానంపై చర్చిస్తున్నట్లు పరమేశ్వర్ చెప్పారు.