పెరుగుతున్న గన్ కల్చర్
బెంగళూరు : బెంగళూరు నగరంలో గన్ వినియోగం పై ఆసక్తి పెరుగుతోంది. ఏడాదికేడాది ఇందుకోసం దరఖాస్తు చేసుకొనేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2015 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ తుపాకీ కొనుగోలు, వినియోగానికి సంబంధించి అనుమతి ఇవ్వాల్సిందిగా 1,500 మంది డీజీపీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 30 శాతం ఎక్కువ.
దరఖాస్తు చేసుకున్నవారిలో కేవలం 380 మందికి మాత్రమే పోలీసు అధికారులు అనుమతి ఇవ్వగా 256 మంది తుపాకీ వినియోగానికి సంబంధించిన శిక్షణ పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారు శిక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా గన్‌ను కొనుగోలు చేయడం ఎలా? శిక్షణ ఎక్కడ తీసుకోవాలి? ఆయుధం ధరలు తదితర విషయాలకు సంబంధించిన కథనం...
ఎవరికి గన్‌లెసైన్స్ దొరుకుతుంది?
అడిగిన వారందరికీ ఆయుధ లెసైన్స్ దొరకదు. నగర కమిషనరేట్‌లో ఆయుధ లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత సదరు వ్యక్తి పూర్వాపరాలను స్థానిక పోలీసులు పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తారు. ఆయుధలెసైన్సు దరఖాస్తుకు కారణం?, సమాజంలో వ్యక్తికి ఉన్న స్థానం, విరోధుల నుంచి ప్రాణహానితో పాటు సదరు వ్యక్తి వృత్తి తదితర విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఆయుధ లెసైన్సును పోలీసు ఆధికారులు జారీ చేస్తారు.
మూడు చోట్ల శిక్షణ కేంద్రాలు...
నగర ఆర్మ్‌డ్ రిజర్వ్ ఆధ్వర్యంలో మూడు చోట్ల తుపాకి వినియోగం పై శిక్షణ ఇస్తారు. మైసూరు రోడ్డులోని సిర్సీ సర్కిల్, ఆడుగోడి సర్కిల్‌లోని సీఏఆర్ ఉత్తర విభాగం ప్రాంగణం, యలహంకలోని సీఏఆర్ దక్షిణ విభాగం ప్రాంగణంలో పోలీసు విభాగం నుంచి అనుమతి పొందిన దరఖాస్తుదారులకు శిక్షణ ఇస్తారు. సీఏఆర్ కేంద్ర కార్యాలయానికిచేరిన దరఖాస్తులను అనుసరించి రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలం 10 రోజులు.
ఉదయం 6:30 గంటలకు మొదలయ్యే శిక్షణ మూడు నుంచి నాలుగు గంటల పాటు సాగుతుంది. శిక్షణ తర్వాత సీఏఆర్ అధికారులు నిర్వహించే పరీక్షలో పాస్ అయిన వారికి గన్ ఖరీదు చేయడానికి పూర్తి స్థాయి ధ్రువీకరణ పత్రం అందుతుంది.
రూ.50 వేల నుంచి రూ.4 లక్షల విలువ చేసే ఆయుధాలు...
రాష్ట్రంలో రివల్వార్, గన్ తదితర ఆయుధాలను విక్రయించేందుకు ప్రభుత్వం నగరంలో 15 సంస్థలకు అనుమతిచ్చింది. ఈ సంస్థలు దేశ, విదేశాలకు చెందిన ఆయుధాలను విక్రయిస్తుంటాయి. రూ.50 వేల నుంచి మొదలు దాదాపు రూ.4 లక్షల విలువ చేసే ఆయుధాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్కసారి 20 నుంచి వంద బులెట్లను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గన్‌ను దుర్వినియోగం చేస్తే తక్షణం సదరు వ్యక్తి ఆయుధ లెసైన్స్ రద్దు చేసే అధికారం పోలీసు అధికారులకు ఉంటుంది.