ఉత్తర్వులపై సంతకం చేసిన అధ్యక్షుడు బైడెన్
వాషింగ్టన్: అమెరికాలో తుపాకీ సంస్కృతికి చరమగీతం పాడేందుకు దేశాధ్యక్షుడు బైడెన్ కీలక చట్టం తెచ్చారు. అమెరికా అత్యున్నత అధకారమైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఈచట్టం తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం సంతకం చేశారు. కొత్త చట్టం ప్రకారం లైసెన్స్‌లేని తుపాకులు, సీరియల్ నంబర్‌లేని తుపాకులు, 3డీ పద్ధతిలో ముద్రించిన తుపాకుల కట్టడి, నిషేధంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు.
సాధారణ గన్, పిస్టల్‌ను ఆటోమేటిక్ మెషీన్ గన్‌గా మార్చే యంత్రాలను నిషేధించేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం దఖలు పడనుంది. మరికొద్ది వారాల్లో అధ్యక్షుడిగా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై బైడెన్ సంతకం చేయడం గమనార్హం. 3డీ ప్రింటెడ్ గన్‌లను స్కానింగ్ యంత్రాలు, మెటల్ డిటెక్టర్లు కూడా గుర్తించలేకపోతున్నాయని బైడెన్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తంచేశారు. కొత్త చట్టంపై ముసాయిదా రూపకల్పన బాధ్యతలను 2023లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అప్పగించడం తెల్సిందే.
ఉత్తర్వులకు ముందు అప్పీల్
ఉత్తర్వులపై సంతకం చేయడానికి ముందు అధ్యక్షుడు బైడెన్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ చేశారు. ‘‘అమెరికాలో పిల్లల మరణాలకు వ్యాధులు, ప్రమాదాలకంటే తుపాకీ హింసే ప్రధాన కారణం. ఇది బాధాకరం. ఈ హింసను అంతం చేయడానికి నాతో, ఉపాధ్యక్షురాలు హారిస్‌తో చేతులు కలపండి. తుపాకీ హింసను అరికట్టేందుకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తున్నా’’అని అన్నారు. ఆయుధాలను పూర్తిగా నిషేధించాలని ఇటీవలే బైడెన్ పిలుపునిచ్చారు. ఒక దేశంగా తుపాకీ హింసను అంగీకరించలేమన్నారు. దేశంలో తుపాకీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా కాంగ్రెస్‌ను కోరారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి అమ్మకాలపై సమగ్ర తనిఖీలు, సమతుల్యత పాటించాలని పిలుపునిచ్చారు. ఈ చర్యలేవీ చనిపోయిన పిల్లలను తిరిగి తీసుకురాలేవని, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే భవిష్యత్‌లో పిల్లల ప్రాణాలను కాపాడగలమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment