వీసాల రద్దు అన్యాయం | Indian student, three others file lawsuit against possible deportation from US | Sakshi
Sakshi News home page

వీసాల రద్దు అన్యాయం

Published Thu, Apr 17 2025 5:41 AM | Last Updated on Thu, Apr 17 2025 5:41 AM

Indian student, three others file lawsuit against possible deportation from US

ట్రంప్‌ ప్రభుత్వంపై భారత విద్యార్థి దావా

న్యూయార్క్‌: అధికారులు తమ స్టూడెంట్‌ వీసాలను అన్యాయంగా రద్దు చేశారంటూ భారతీయ విద్యార్థి సహా నలుగురు అమెరికా కోర్టులో కేసువేశారు. అధికారులు తమను నిర్బంధించి, సొంత దేశాలకు బలవంతంగా పంపించే అవకాశముందని వారు ఆరోపించారు. వీసాలను పొడిగించి, చదువులు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండనివ్వాలని భారత్‌కు చెందిన చిన్మయ్‌ డియోరా, నేపాల్‌ వాసి యోగేశ్‌ జోషి, చైనా విద్యార్థులు జియాంగ్‌యున్‌ బు, క్వియువి యంగ్‌ కోరారు. వీరిలో చిన్మయ్‌ డియోరా.. వేన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. 

హోంల్యాండ్‌ డిపార్టుమెంట్‌(డీహెచ్‌ఎస్‌), ఇమిగ్రేషన్‌ అధికారులు తమకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ఆన్‌లైన్‌లో స్టూడెంట్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(ఎస్‌ఈవీఐఎస్‌)లో స్టూడెంట్‌ ఇమిగ్రేషన్‌ స్టేటస్‌ను రద్దు చేశారని ఆరోపించారు. ఎలాంటి కారణం చూపకుండా, నోటీసు ఇవ్వకుండా ప్రభుత్వం వీసా రద్దు చేయడంపై వీరి తరఫున తాము మిషిగన్‌ కోర్టులో కేసు వేశామని అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌(ఏసీఎల్‌యూ) తెలిపింది.

 వీరిపై ఎలాంటి కేసులు లేవని, వలస చట్టాలను వీరు ఉల్లంఘించలేదని పేర్కొంది. ఎఫ్‌–1 వీసాల రద్దు కారణాలపై సంబంధిత వర్సిటీలకు ఎలాంటి వివరణ కూడా అధికారులు ఇవ్వలేదని తెలిపింది. ట్రాఫిక్‌ చలాన్లు, రాంగ్‌ పార్కింగ్, గతంలో అధికారులతో గొడవ పడిన ఘటనలను సాకుగా చూపుతూ విద్యార్థులను బలవంతంగా పంపేయడం తగదని పేర్కొన్నారు. ఇదే అంశంపై న్యూహాంప్‌షైర్, ఇండియానా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement