gun control in US
-
తుపాకీ నియంత్రణకు కొత్త చట్టం
వాషింగ్టన్: అమెరికాలో తుపాకీ సంస్కృతికి చరమగీతం పాడేందుకు దేశాధ్యక్షుడు బైడెన్ కీలక చట్టం తెచ్చారు. అమెరికా అత్యున్నత అధకారమైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఈచట్టం తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం సంతకం చేశారు. కొత్త చట్టం ప్రకారం లైసెన్స్‌లేని తుపాకులు, సీరియల్ నంబర్‌లేని తుపాకులు, 3డీ పద్ధతిలో ముద్రించిన తుపాకుల కట్టడి, నిషేధంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. సాధారణ గన్, పిస్టల్‌ను ఆటోమేటిక్ మెషీన్ గన్‌గా మార్చే యంత్రాలను నిషేధించేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం దఖలు పడనుంది. మరికొద్ది వారాల్లో అధ్యక్షుడిగా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై బైడెన్ సంతకం చేయడం గమనార్హం. 3డీ ప్రింటెడ్ గన్లను స్కానింగ్ యంత్రాలు, మెటల్ డిటెక్టర్లు కూడా గుర్తించలేకపోతున్నాయని బైడెన్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తంచేశారు. కొత్త చట్టంపై ముసాయిదా రూపకల్పన బాధ్యతలను 2023లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అప్పగించడం తెల్సిందే. ఉత్తర్వులకు ముందు అప్పీల్ ఉత్తర్వులపై సంతకం చేయడానికి ముందు అధ్యక్షుడు బైడెన్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ చేశారు. ‘‘అమెరికాలో పిల్లల మరణాలకు వ్యాధులు, ప్రమాదాలకంటే తుపాకీ హింసే ప్రధాన కారణం. ఇది బాధాకరం. ఈ హింసను అంతం చేయడానికి నాతో, ఉపాధ్యక్షురాలు హారిస్‌తో చేతులు కలపండి. తుపాకీ హింసను అరికట్టేందుకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తున్నా’’అని అన్నారు. ఆయుధాలను పూర్తిగా నిషేధించాలని ఇటీవలే బైడెన్ పిలుపునిచ్చారు. ఒక దేశంగా తుపాకీ హింసను అంగీకరించలేమన్నారు. దేశంలో తుపాకీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా కాంగ్రెస్‌ను కోరారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి అమ్మకాలపై సమగ్ర తనిఖీలు, సమతుల్యత పాటించాలని పిలుపునిచ్చారు. ఈ చర్యలేవీ చనిపోయిన పిల్లలను తిరిగి తీసుకురాలేవని, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే భవిష్యత్‌లో పిల్లల ప్రాణాలను కాపాడగలమని చెప్పారు. -
అమెరికాలో గన్ కల్చర్‌పై బైడెన్ కొత్త చట్టం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని వారాల్లో తన పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో అమెరికాలో గన్ కల్చర్ తగ్గించేందుకు ప్లాన్ చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో తుపాకీ హింసకు అంతం పలకాలనే ఉద్దేశంతో బైడెన్ కొత్త చట్టంపై సంతకాలు చేశారు.తాజాగా బైడెన్ ట్విట్టర్ వేదికగా..‘అమెరికాలో గన్ కల్చర్ కారణంగా చాలా మంది పిల్లులు చనిపోతున్నారు. వ్యాధులు, ప్రమాదాల కారణంగా మృతి చెందుతున్న చిన్నారుల కంటే.. తుపాకీల కారణంగా మరణించిన వారి సంఖ్యే ఎక్కవగా ఉంది. ఇది చాలా బాధాకరమైనది. ఈ హింసను అంతం చేయడానికి నేను, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కృషి చేస్తున్నాం. మీరు మాతో చేతులు కలపండి తుపాకీ హింసను అరికట్టేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై తాను సంతకాలు చేస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.ఆర్డర్ ప్రకారం, మొదటి భాగం మెషిన్ గన్ మార్పిడి పరికరాలతో సహా ఉత్పన్నమయ్యే తుపాకీ బెదిరింపులుపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ఇది హ్యాండ్ హెల్డ్ గన్ లేదా పిస్టల్‌ను ఆటోమేటిక్ తుపాకీ లేదా ఆయుధంగా మారుస్తుంది. ఇటువంటి పరికరాలు ఇప్పటికే చట్టవిరుద్ధం, అయితే చట్ట అమలు సంస్థలు అటువంటి పరికరాలను విచక్షణారహితంగా ఉపయోగించడాన్ని నిరోధిస్తుంది. కొత్త చట్టం దాని లభ్యతపై అణిచివేతను నిర్ధారిస్తుంది.అగ్రరాజ్యంలో తుపాకీదే హవా..అమెరికాలో తీవ్రమైన తుపాకీ హింస ఉంది. ముఖ్యంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో కాల్పుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. గత రెండు దశాబ్దాలలో పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో వందలాది కాల్పులు జరిగాయి. ఈ హింసలు యూఎస్ తుపాకీ చట్టాలు, రాజ్యాంగం రెండవ సవరణపై తీవ్ర చర్చకు దారితీసింది. ఈ చట్టం ప్రకారం.. ఆయుధాలను కలిగి ఉండే హక్కు ఉంది.విద్యాసంస్థల్లో కాల్పుల కారణంగా 2020లో 4,368 మంది పిల్లలు తుపాకీ కారణంగా మృతి చెందారు. ఇక, 2019లో ఆ సంఖ్య 3,390గా ఉండగా.. 2021లో 4,752కు చేరింది. ఇక, 2007లో వర్జీనియా టెక్‌లో కాల్పుల కారణంగా 30 మందికిపైగా మరణించిన అత్యంత ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. పిల్లల గన్ వాడకంపై పేరెంట్స్ కూడా దృష్టిసారించాలని అన్నారు. Today, I'll sign an Executive Order to crack down on emerging firearm threats like unserialized, 3D-printed guns and machine gun conversion devices.It'll also direct my Cabinet to help improve school-based active shooter drills.It's our job to do better.— President Biden (@POTUS) September 26, 2024 ఇది కూడా చదవండి: పాలస్తీనా మా సొంతం -
US Elections: గన్ కల్చర్‌కు మానసిక రుగ్మతలే కారణం: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: అమెరికాలో గన్ కంట్రోల్ పాలసీపై అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల ఘటనలు జరిగిన వెంటనే గన్ కంట్రోల్ పాలసీపై మాట్లాడటం సాధారణమైపోయిందని, అసలు ఈ సమస్యకు మాలకారణమైన మానసిక రుగ్మతలకు పరిష్కారం వెతకాలని వివేక్ రామస్వామి సూచించారు. అయోవాలో తాజాగా దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందడంతో అమెరికాలో రాజకీయ పార్టీలు గన్ కంట్రోల్ పాలసీపై చర్చ ప్రారంభించాయి. దీనిపై అయోవాలోనే ఓటర్లతో సమావేశమైన సందర్భంగా గురువారం వివేక్ రామస్వామి స్పందించారు. ‘సంఘటన జరిగిన వెంటనే ఆత్రుతతో చట్టం పాస్ చేస్తే సమస్య పరిష్కారం కాదు. గన్ కంట్రోల్ పాలసీ తీసుకురావడం ఒక స్టుపిడ్ చర్య. గన్ కల్చర్ అనేది అమెరికా సంస్కృతిలో భాగమైంది. మూలాల్లోకి వెళ్లకుండా సమస్యను పరిష్కరించడానికి మనమేం దేవుళ్లం కాదు’ అని వివేక్ అన్నారు. కాగా,కాల్పులు ఘటన కారణంగా అయోవాలో తన ప్రచారాన్ని వివేక్ రద్దు చేసుకున్నారు.కేవలం ప్రార్థనలతో సరిపెట్టారు. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తుది పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రైమరీ బ్యాలెట్లు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఇదీచదవండి.. కొరియా దేశాల మధ్య ఉద్రిక్తత -
US: పాఠశాలలో కాల్పుల కలకలం
న్యూయార్క్: అమెరికాలోని అయోవాలో పాఠశాలలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని మృతి చెందాడు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులతో సహా పాఠశాల నిర్వహకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. శీతాకాలం సెలవుల తర్వాత పాఠశాలలు మొదటిరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 7:30కి పిల్లలు బ్రేక్ ఫాస్ట్ కోసం తరగతి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఓ పిల్లాడు కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో నలుగురు పిల్లలతో సహా పాఠశాల నిర్వహకుడు కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. కాల్పులు జరిపిన విద్యార్థిని డైలాన్ బట్లర్(17 )గా అధికారులు గుర్తించారు. బట్లర్ కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాల్పుల శబ్దం విన్న వెంటనే తరగతి గదిలోకి పారిపోయామని స్థానిక విద్యార్థులు తెలిపారు. అందరూ బయటకి రండి అని పిలుపు విన్న తర్వాతే బయటకు వచ్చానని ఓ విద్యార్థి పేర్కొన్నారు. పాఠశాల ప్రాంగణంలో నేలంతా రక్తసిక్తమైందని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. అమెరికా గన్ కల్చర్ రోజురోజుకీ ఎక్కువవుతోంది. పాఠశాలల్లో కాల్పుల ఘటన ఈ ఏడాది రెండోది. వర్జీనియాలో స్కూల్ బయటే ఓ కాల్పులకు పాల్పడిన ఘటన తర్వాత రోజు ఇది జరిగింది. మొత్తంగా 2018 నుంచి అమెరికా స్కూళ్లలో కాల్పుల ఘటనల సంఖ్య 182కు చేరింది. ఇదీ చదవండి: సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్ -
అమెరికాలో వరుస ఘటనలు, సరికొత్త స్మార్ట్ గన్.. ఎవరుపడితే వారు కాల్చలేరు
వాషింగ్టన్: యజమాని మినహా మరెవరూ పేల్చడం సాధ్యంగాని 9ఎంఎం తుపాకీని తయారు చేసింది అమెరికాకుచెందిన బయోఫైర్ కంపెనీ. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, కాల్చే వ్యక్తిని పోల్చుకునే ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీ దీని సొంతం. ఇలాంటి తుపాకీ ప్రపంచంలో ఇదే మొదటిది. గన్ను పక్కన పెట్టేయగానే లాక్ అవుతుంది. అమెరికా వంటి దేశాల్లో చిన్నారులు పొరపాటున తుపాకీ కాల్చడం, గన్ చోరీ తదితరాలకు ఇక తెర పడుతుందని బయోఫైర్ సంస్థ చెబుతోంది. ఈ సంస్థకు ఇంటెల్, గూగుల్, నాసాలు తోడ్పాటునందిస్తున్నాయి. అమెరికాలో తరచూ తుపాకీల కాల్పులు ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ హింసను నియంత్రించి తుపాకీని ఎవరు పడితే వారు వాడకుండా చేయాలనే సదుద్దేశంతో ఈ స్మార్ట్గన్ను అభివృద్ధి చేసినట్లు బయోఫైర్ పేర్కొంది. వచ్చే ఏడాది ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఇప్పుడే ప్రీ ఆర్డర్లు కూడా తీసుకుంటోంది. ఈ స్మార్ట్ గన్ను బయోఫైర్ వ్యవస్థపకుడు క్లోయేఫర్(26) అభివృద్ధి చేస్తున్నారు. 15 ఏళ్ల వయసు నుంచే దీన్ని రూపొందిస్తున్నారు. సాంకేతికతతో ప్రతి సమస్యను పరిష్కరించేలేమని, కానీ అమెరికాలో క్లిష్టమైన సమస్యలను సాంకేతికతను ఉపయోగించి పరిష్కరించుకోగలమని క్లోయేఫర్ పేర్కొన్నారు. ఈ గన్‌తో పొరపాటున పిల్లల చేతుల్లో తుపాకులు పేలే ఘటనలు తగ్గుతాయని చెప్పారు. యజమానులు తప్ప మరెవరికీ తుపాకీని ఉపయోగించడం సాధ్యం కాకపోతే దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉండవన్నారు. చదవండి: కృత్రిమ మేధపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆందోళన.. తేడావస్తే అంతే! -
వాషింగ్టన్లో కాల్పుల కలకలం... ఇద్దరికి గాయాలు
న్యూయార్క్: వాషింగ్టన్ లీస్ట్రీట్ వీధిలోని ఐడియా పబ్లిక్ చార్టర్ స్కూల్ బ్లాక్ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతలో ఘటన జరిగినట్టు వాషింగ్టన్ పోలీస్ రాబర్ట్ కాంటె తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. 15 ఏళ్ల యువకుడు ఆ స్కూల్లోని ఇద్దరు విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సదరు నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అంతేకాదు ఆ స్కూల్లో ఉన్న దాదాపు 350 మంది విద్యార్థులను, స్కూల్ సిబ్బందిని ఈ విషయమై విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ అధికారులు మాట్లాడుతూ...ఈ ఏడాది సుమారు రెండు వేల అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతేడాదితో పోల్చితే అదనంగా 800 అక్రమ ఆయుధాలు ఎక్కు ఉన్నాయన్నారు. అదే బుధవారం వేరొక ఘటనలో ఒక భవనం వద్ద మరో బాలుడు తుపాకీ కాల్పుల్లో మృతి చెందినట్లు తెలిపారు. (చదవండి: 20 ఏళ్ల యుద్ధానికి తెరపడిన రోజు... అఫ్గాన్‌లో మిన్నంటుతున్న సంబరాలు) -
ఆరేళ్ల బాలుడి కాల్పులు.. ఐదేళ్ల చెల్లి మృతి!
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇండియానాపొలిస్ నగరం సమీపంలోని మున్సీ పట్టణంలో ఘోరంగా జరిగింది. ఆరేళ్ల బాలుడు ఇంట్లో ఐదేళ్ల తన చెల్లిని తుపాకీతో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన బాలిక కన్నుమూసింది. ఈ ఘటనలో బాలుడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం తెల్లవారుజామున జరిగినట్లు అధికారులు తెలిపారు. బాలిక తలలో తూటా దిగినట్లు చెప్పారు. ఆమెను స్థానిక ఐయూ హెల్త్ బాల్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. సురక్షిత ప్రాంతంలో పెట్టిన రెండు హ్యాండ్ గన్స్‌లో నుంచి ఒకదానిని తన ఆరేళ్ల బాలుడు తీసుకున్నట్లు చెప్పారు అరెస్టయిన జాకబ్ గ్రేసన్. తన చెల్లిన కాల్చినట్లు చెప్పారు. నిరక్ష్యంగా వ్యవహరించినందుకు జాకబ్‌తో పాటు ఆయన భార్య కింబెర్లి గ్రేసన్‌ను అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: రాబోయే పదేళ్లలో కొత్త ముప్పు.. ప్రాణాలు హరించే.. -
రిపబ్లికన్లే అడ్డంకి
ముక్కుపచ్చలారని పసిమొగ్గలు రక్తమోడుతున్నారు. చదువులమ్మ చెట్టు నీడలోనే వారికి నూరేళ్లూ నిండిపోతున్నాయి. పదేళ్ల క్రితం శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూలు నుంచి నిన్నటి టెక్సాస్ ఘటన వరకు బడిలో తుపాకుల శబ్దం గుండెల్లో దడ పుట్టిస్తోంది. అగ్రరాజ్యంలో తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలు ఎందుకు రాలేకపోతున్నాయి ? సాటి మనుషుల ప్రాణాల కంటే మర తుపాకీలే అమెరికన్లకు ఎక్కువా? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. నిత్యం ఎక్కడో చోట కాల్పుల ఘటనలు జరుగుతున్నా, పాఠశాలల్లోకి దుండగులు చొరబడి అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను తీస్తున్నప్పటికీ అగ్రరాజ్యం తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలను తీసుకురావడంలో విఫలమవుతోంది. దీనికి ప్రధానంగా సాంస్కృతికపరమైన, రాజకీయప రమైన కారణాలను చెప్పుకోవచ్చు. మితిమీరిన వ్యక్తి స్వేచ్ఛతో తుపాకీ ఉండడం తమ హక్కు అని 74% మంది అమెరికన్లు భావిస్తారని ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో వెల్లడైంది. వ్యక్తిగత భద్రత కోసం తుపాకీ ఉండాలని 26% మంది అమెరికన్లు భావిస్తారు. ప్రైవేట్ వ్యక్తులు తుపాకులు కలిగిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో జనాభా కంటే ఆయుధాల సంఖ్యే ఎక్కువగా ఉండడం ఆందోళనకరంగా మారింది. దేశంలో ప్రతి 100 మంది జనాభాకు 120 తుపాకులు ఉన్నాయి. అంటే సగటున ప్రతి ఒక్కరి దగ్గర తుపాకీ ఉన్నట్టే. 2020 నాటికి అగ్రరాజ్యం జనాభా 33 కోట్లు ఉంటే, ఆ దేశ ప్రజల దగ్గర 40 కోట్ల ఆయుధాలున్నాయి. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోవడానికి రాజకీయ ఏకాభిప్రాయం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తుపాకీ నియంత్రణ చట్టాలను కఠినతరం చేయాలని ఇప్పుడిప్పుడే సాధారణ ప్రజలు స్వరం పెంచుతున్నప్పటికీ డెమొక్రట్లు, రిపబ్లికన్ల మధ్య విధానపరంగా విభేదాలున్నాయి. 2012 సంవత్సరంలో కనెక్టికట్‌లోని న్యూటౌన్‌లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూలులో తుపాకీ గుళ్లకి 20 మంది చిన్నారులు బలయ్యాక 13 రాష్ట్రాలు తుపాకుల విక్రయంలో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. అవన్నీ డెమొక్రట్ల పాలనలో ఉన్న రాష్ట్రాలే. అదే సమయంలో రిపబ్లికన్ల అధీనంలో ఉన్న 14 రాష్ట్రాల్లో ప్రజలు కూరగాయలు కొన్నంత సులుభంగా తుపాకులు కొనే వెసులుబాటు ఉంది. ప్రజలు తమ ప్రాణ రక్షణ కోసం తుపాకులు తమ వెంట ఉంచుకోవచ్చునని మొదట్నుంచీ రిపబ్లికన్ల వాదనగా ఉంది. అమెరికా రాజ్యాంగంలోని రెండో సవరణ ప్రకారం ‘‘ఆయుధాలు దగ్గర ఉంచుకోవడం ప్రజల హక్కు. రాష్ట్రాల భద్రత కోసం పౌర సైన్యం అత్యంత అవసరం. ఈ నియమాలను ఉల్లంఘించకూడదు’’ అని చెబుతోంది. తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలు ఉండాలన్న డిమాండ్లు వచ్చిన ప్రతీసారి రిపబ్లికన్లు రాజ్యాంగ సవరణని గుర్తుచేస్తూ ప్రజల హక్కులు కాలరాయొద్దని గళమెత్తుతున్నారు. అమెరికాలో తుపాకుల నియంత్రణ చట్టాలను నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏ) సమర్థంగా అడ్డుకుంటూ ఉండడంతో విచ్చలవిడిగా తుపాకులు అందుబాటులోకి వస్తున్నాయి. తుపాకులపై నిషేధం విధిస్తే అమెరికన్లకు రక్షణ ఉండదని, గన్ ఫ్రీ స్కూలు జోన్స్ వల్ల ఎక్కువ ప్రమాదాలు ముంచుకొస్తున్నాయని ఎన్ఆర్ఏ సీఈవో వేన్ లాపీరే అభిప్రాయపడ్డారు. ఎన్ఆర్ఏ సభ్యుల్లో 77% రిపబ్లికన్లే కావడం గమనార్హం. మానసిక వ్యాధికి మందు వేయాలని వాదనలు తుపాకుల నియంత్రణ చట్టాలను విమర్శించేవారు కాల్పులకు పాల్పడినవారంతా ఏదో ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నవారేనని వాదిస్తున్నారు. కాల్పులకు అడ్డుకట్ట వేయాలంటే వ్యక్తుల స్వేచ్ఛను హరించేలా తుపాకుల్ని నియంత్రించడం కాకుండా మతి స్థిమితంలేని వారికి చికిత్స చేయాలన్నది రిపబ్లికన్ల వాదనగా ఉంది. తుపాకుల్ని అమ్మే ముందు వారి నేర చరితను చూడాలన్న డిమాండ్లను రిపబ్లికన్లు అంగీకరించడం లేదు. ► 2012 డిసెంబర్లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూలు విషాదం మొదలు ఇప్పటివరకు 948 సార్లు స్కూళ్లలో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ► 46 లక్షల మంది పిల్లల ఉండే ఇళ్లలో తుపాకుల్లో బుల్లెట్లు్ల లోడ్ చేసే ఉండటం అత్యంత ఆందోళనకరం. ఆ తుపాకులను తల్లిదండ్రులు జాగ్రత్త పరచకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. ► పాఠశాలల్లో కాల్పుల ఘటనల్లో వాడిన తుపాకుల్లో 68% ఇంటి నుంచి, స్నేహితులు, బంధువుల నుంచి తీసుకువచ్చినవే. ► స్కూళ్లలో జరిగే తుపాకీ కాల్పుల్లో 93% ముందస్తుగా ప్రణాళిక చేసుకున్నవే. ► శ్వేత జాతీయుల కంటే నల్లజాతి వారే నాలుగు రెట్లు అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
గర్భవతి అయిన తల్లిని తుపాకితో కాల్చిన చిన్నారి
వాషింగ్టన్ : గర్భవతి అయిన తల్లిని నాలుగేళ్ల చిన్నారి తుపాకీతో కాల్చిన షాకింగ్ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీటెల్‌కు చెందిన 8 నెలల గర్భిణి తన ప్రియుడితో కలిసి టీవీ చూస్తోంది. ఆ సమయంలో పక్క గదిలో ఆడుకుంటున్న వారి కొడుకుకు బెడ్ కింద తుపాకీ దొరికింది. ఆడుకుంటూ తల్లి వద్దకు వచ్చిన చిన్నారి వెనుక నుంచి ఆమె తలపై కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ చిన్నారి తండ్రి ఆమెను ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, అయితే ఈ కేసులో చిన్నారి తండ్రి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని కింగ్స్ కంట్రీ షెరిఫ్ ఆఫీస్ ప్రతినిధి రియాన్ అబాట్ తెలిపారు. కాగా తమ వద్ద ఉన్న తుపాకీని భద్రపరచని పక్షంలో ఎవరైనా దానిని ఉపయోగించినట్లైతే.. తుపాకీ యజమానే శిక్ష అనుభవించాల్సి ఉంటుందనే తీర్మానంపై వాషింగ్టన్ ఓటర్లు సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా బాలుడి తండ్రి ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని రియాన్ తెలిపారు. అయితే ఆ గన్ తన స్నేహితుడిది అని అతడు చెప్పాడని.. ఈ క్రమంలో అతడిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. గన్‌కల్చర్‌ను రూపుమాపే క్రమంలో ఇటువంటి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
ఆ గన్స్‌తో అరాచకమే..
న్యూయార్క్ : అమెరికాలో గన్ కల్చర్ విశృంఖలమయ్యే పరిణామాన్ని అక్కడి న్యాయమూర్తి నిరోధించారు. గన్ను సింపుల్‌గా త్రీడీ ప్రింటర్ నుంచి డౌన్లోడ్ చేసుకనే వెసులుబాటు దుష్పరిణామాలకు దారితీస్తుందని అమెరికన్ జడ్జి హెచ్చరించారు. త్రీడీ ప్రింటెడ్ గన్ల బ్లూప్రింట్స్ ఇంటర్నెట్ను ముంచెత్తే కొద్ది గంటల ముందే అమెరికన్ న్యాయమూర్తి ఆ ప్రక్రియను అడ్డుకున్నారు. బ్లూప్రింట్స్ పబ్లికేషన్ అమెరికన్ పౌరుల భద్రతకు పెనుముప్పుగా పరిణమిస్తుందని అమెరికన్ డిస్ర్టిక్ట్ జడ్జ్ రాబర్ట్ లాస్నిక్ సీటెల్‌లో పేర్కొన్నారు. ఈ గన్స్‌ను రూపొందించే డిఫెన్స్ డిస్ర్టిబ్యూటెడ్ కంపెనీ కోర్టు నిర్ణయంతో అసంతృప్తి వ్యక్తం చేసింది. కంపెనీ వెబ్సైట్లో ఇప్పటికే బ్లూప్రింట్స్‌ను అప్లోడ్ చేశామని సంస్థ న్యాయవాది జోష్ బ్లాక్‌మన్ తెలుపగా ఫెడరల్ చట్టాలకు ఇవి విరుద్ధమని న్యాయమూర్తి లాస్నిక్ స్పష్టం చేశారు. కాలేజీలు, బహిరంగ ప్రదేశాల్లో త్రీడీ ప్రింటర్లు అందుబాటులో ఉన్నందున జన బాహుళ్యానికి ఇవి హానికరమని లాస్నిక్ ఆందోళన వ్యక్తం చేశారు. తనకుతాను అరాచకవాదిగా చెప్పుకునే డిఫెన్స్ డిస్ర్టిబ్యూటెడ్ వ్యవస్ధాపకుడు కోడీ విల్సన్ త్రీడీ ప్రింటెడ్ గన్స్ బ్లూప్రింట్స్‌ను సమర్ధించుకున్నారు. ఆన్లైన్ బ్లూప్రింట్స్ అందుబాటులో ఉండడం భావప్రకటనా స్వేచ్ఛ, ఆయుధాలను కలిగి ఉండే హక్కుల కింద ఫెడరల్ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని వాదించారు. కాగా కోర్టు నిర్ణయం తమకు నిరుత్సాహం కలిగించిందని కంపెనీ న్యాయవాది బ్లాక్‌మన్ పేర్కొన్నారు. తమ క్లెయింట్ విల్సన్ కోర్టు ఉత్తర్వులను గౌరవిస్తారని, చట్టాలకు అనుగుణంగానే నడుచుకుంటారని చెప్పారు. ఇక త్రీడీ ప్రింటర్‌తో రూపొందే ఆయుధాలను నియంత్రించడం, గుర్తించడం కష్టమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ప్రపంచ భద్రతకు పెనుముప్పుగా పరిణమిస్తాయని పేర్కొంటున్నారు. మరోవైపు త్రీడీ ప్రింటెడ్ గన్స్ బ్లూప్రింట్స్కు అనుగుణంగా ట్రంప్ యంత్రాంగం సదరు కంపెనీతో అంగీకారానికి రావడాన్ని సవాల్ చేస్తూ ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎనిమిది రాష్ట్రాలు, కొలంబియా డిస్ర్టిక్ట్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి. గన్లను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే సదుపాయం ఉంటే నేరగాళ్ల చేతిలో ఆయుధాలు విశృంఖలమవుతాయని రాష్ట్రాలు ఆన్లైన్ బ్లూప్రింట్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
టాప్ ట్రెండింగ్‌లో ‘గన్ కంట్రోల్’!
వాషింగ్టన్: ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా నరమేధాలు జరుగుతున్నాయి. అయితే అమెరికాలో వీటి శాతం చాలా ఎక్కువ. అమెరికాలో ఏటేటా తుపాకీ కాల్పుల మోత పెరుగుతూ వస్తోంది. మన దేశంలో చాక్లెట్లు దొరికినంత ఈజీగా అమెరికాలో గన్స్ లభిస్తాయి. ఎంతలా అంటే అక్కడి పౌరుల చేతిలో గన్ ఉండటం ఓ అలవాటుగా మారుతోంది. అమెరికాలో స్వేచ్ఛగా బతకవచ్చని అందరూ భావిస్తుంటారు... కానీ, స్వేచ్ఛ హత్యలు జరుగుతున్నాయని గుర్తించడం లేదు. కోపం వచ్చినా, నచ్చని ఘటన జరిగినా... అక్కడి వారు చేసే పని తమ తుపాకీకి పని చెప్పడం. కాల్పులకు పాల్పడ్డ యువకుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు (ఫైల్) జాతి విధ్వేషమనీ కొందరు, డబ్బుల కోసమనీ మరికొందరు, సరదా కోసం ఇంకొందరు.. ఇలా ఏదో రకంగా ఇతరుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. అక్కడి వారి చేతుల్లో గన్ అత్యవసర సరుకుగా మారింది. గత కొంతకాలం నుంచి జాతి విధ్వేషదాడులు మరీ ఎక్కువ కాగా, ఆసియా వాసులు ముఖ్యంగా భారతీయులైతే మరీ బిక్కు బిక్కుమంటూ పరాయి దేశంలో గడపాల్సి వస్తోంది. ఈ మధ్య ఫ్లోరిడా హైస్కూల్లో జరిగిన నరమేధంలో దాదాపు 17మంది అమాయక విద్యార్థులు మృత్యుఒడికి చేరారు. ఈ విషాదంతో అమెరికా సహా ఇతర అగ్రదేశాలు మొత్తం విస్తుపోయాయి. ఫ్లోరిడా నరమేధం ముందువరకు అమెరికా పౌరులు గన్ షాప్‌లు ఎక్కడ? గన్స్ ఈజీగా ఎక్కడ దొరుకుతాయి? అని గూగుల్‌లో వీటి గురించే వెతికేవారు. అమెరికన్లు సెర్చ్ చేసే వాటిలో గన్స్, గన్ కల్చర్ టాప్ లిస్ట్‌లో ఉండేవి. కానీ ఆ ఉదంతం తర్వాత పరిస్థితిలో మార్పొచ్చింది. ఇప్పుడు అమెరికా పౌరులంతా.. గన్ కల్చర్‌ను ఎలా కంట్రోల్ చేయాలి? అందుకోసం ఏ చర్యలు తీసుకోవాలి? మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గన్ కల్చర్‌పై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు.. లాంటి వాటికోసం గూగుల్‌లో వెతుకుతున్నారని ఓ తాజా సర్వేలో తేలింది. -
అగ్రరాజ్యాన్ని చిన్నారులే వణికిస్తున్నారు?
మూడేళ్లు అంతకన్న తక్కువ వయస్సున్న చిన్నారులే అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తున్నారు. ఎందుకంటే గడిచిన ఏడాది ఉగ్రవాదుల కన్నా చిన్నారుల కాల్పుల వల్ల ఎక్కువమంది మృత్యువాత పడ్డారు. అమెరికాలో విచ్చలవిడిగా ఉన్న తుపాకీ సంస్కృతిని చాటుతూ తాజాగా దిగ్భ్రాంతికరమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. 2015లో మొత్తం 58 మంది చిన్నారులు తుపాకీ కాల్పులతో కలకలం సృష్టించారు. నిండా మూడేళ్లు మించని బుజ్జాయిలు తుపాకీతో తమను తాము కాల్చుకోవడం లేదా ఇతరులను కాల్చడం ద్వారా 19మంది చనిపోయారు. మరో రెండు కేసులలో ఇద్దరికిపైగా ప్రాణాలు విడిచారని వాష్టింగ్టన్ పోస్టు ఓ కథనంలో వెల్లడించింది. ఇక గత ఏడాది అమెరికాలో మొత్తం మూడు ఉగ్రవాద కాల్పుల ఘటనలు జరుగగా.. అందులో 19 మంది మృతిచెందారు. గత మేలో ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత టెన్నిస్సీలోని చాటనూగాలో ఓ సాయుధ ఉగ్రవాది కాల్పులు జరిపాడు. గత డిసెంబర్లో కాలిఫోర్నియా సాన్‌బెర్నార్డినోలో ఇద్దరు సాయుధులు కాల్పులు జరిపారు. ఈ మొత్తం ఉగ్ర ఘటనల్లో 19 మంది చనిపోగా, చిన్నారులు కాల్పులు జరిపిన ఘటనల్లో అంతకన్నా ఎక్కుమంది ప్రాణాలు కోల్పోయారని పత్రిక కథనాలు విశ్లేషించాయి. పిల్లల కాల్పుల్లో మరణాల ఘటనలు 71శాతం బాధితుడు/షూటర్ ఇంటివద్దే జరుగుతున్నాయయని, తుపాకులను, వాటి మందుగుండు సామగ్రిని సురక్షితంగా పిల్లలకు అందకుండా ఉంచడంలో పెద్దల తీవ్ర నిర్లక్ష్యం ఈ ఘటనల్లో కనిపిస్తోందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో విశ్లేషించింది. ఈ నేపథ్యంలో అమెరికాలో పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు బలమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరముందనే వాదన వినిపిస్తోంది.