న్యూయార్క్ : అమెరికాలో గన్ కల్చర్ విశృంఖలమయ్యే పరిణామాన్ని అక్కడి న్యాయమూర్తి నిరోధించారు. గన్‌ను సింపుల్‌గా త్రీడీ ప్రింటర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకనే వెసులుబాటు దుష్పరిణామాలకు దారితీస్తుందని అమెరికన్ జడ్జి హెచ్చరించారు. త్రీడీ ప్రింటెడ్ గన్‌ల బ్లూప్రింట్స్ ఇంటర్‌నెట్‌ను ముంచెత్తే కొద్ది గంటల ముందే అమెరికన్ న్యాయమూర్తి ఆ ప్రక్రియను అడ్డుకున్నారు. బ్లూప్రింట్స్ పబ్లికేషన్ అమెరికన్ పౌరుల భద్రతకు పెనుముప్పుగా పరిణమిస్తుందని అమెరికన్ డిస్ర్టిక్ట్ జడ్జ్ రాబర్ట్ లాస్నిక్ సీటెల్‌లో పేర్కొన్నారు.
ఈ గన్స్‌ను రూపొందించే డిఫెన్స్ డిస్ర్టిబ్యూటెడ్ కంపెనీ కోర్టు నిర్ణయంతో అసంతృప్తి వ్యక్తం చేసింది. కంపెనీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే బ్లూప్రింట్స్‌ను అప్‌లోడ్ చేశామని సంస్థ న్యాయవాది జోష్ బ్లాక్‌మన్ తెలుపగా ఫెడరల్ చట్టాలకు ఇవి విరుద్ధమని న్యాయమూర్తి లాస్నిక్ స్పష్టం చేశారు. కాలేజీలు, బహిరంగ ప్రదేశాల్లో త్రీడీ ప్రింటర్లు అందుబాటులో ఉన్నందున జన బాహుళ్యానికి ఇవి హానికరమని లాస్నిక్ ఆందోళన వ్యక్తం చేశారు.
తనకుతాను అరాచకవాదిగా చెప్పుకునే డిఫెన్స్ డిస్ర్టిబ్యూటెడ్ వ్యవస్ధాపకుడు కోడీ విల్సన్ త్రీడీ ప్రింటెడ్ గన్స్ బ్లూప్రింట్స్‌ను సమర్ధించుకున్నారు. ఆన్‌లైన్ బ్లూప్రింట్స్ అందుబాటులో ఉండడం భావప్రకటనా స్వేచ్ఛ, ఆయుధాలను కలిగి ఉండే హక్కుల కింద ఫెడరల్ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని వాదించారు. కాగా కోర్టు నిర్ణయం తమకు నిరుత్సాహం కలిగించిందని కంపెనీ న్యాయవాది బ్లాక్‌మన్ పేర్కొన్నారు. తమ క్లెయింట్ విల్సన్ కోర్టు ఉత్తర్వులను గౌరవిస్తారని, చట్టాలకు అనుగుణంగానే నడుచుకుంటారని చెప్పారు.
ఇక త్రీడీ ప్రింటర్‌తో రూపొందే ఆయుధాలను నియంత్రించడం, గుర్తించడం కష్టమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ప్రపంచ భద్రతకు పెనుముప్పుగా పరిణమిస్తాయని పేర్కొంటున్నారు. మరోవైపు త్రీడీ ప్రింటెడ్ గన్స్ బ్లూప్రింట్స్‌కు అనుగుణంగా ట్రంప్ యంత్రాంగం సదరు కంపెనీతో అంగీకారానికి రావడాన్ని సవాల్ చేస్తూ ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎనిమిది రాష్ట్రాలు, కొలంబియా డిస్ర్టిక్ట్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి.
గన్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే సదుపాయం ఉంటే నేరగాళ్ల చేతిలో ఆయుధాలు విశృంఖలమవుతాయని రాష్ట్రాలు ఆన్‌లైన్ బ్లూప్రింట్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment