న్యూయార్క్: అమెరికాలోని అయోవాలో పాఠశాలలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని మృతి చెందాడు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులతో సహా పాఠశాల నిర్వహకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.
శీతాకాలం సెలవుల తర్వాత పాఠశాలలు మొదటిరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 7:30కి పిల్లలు బ్రేక్ ఫాస్ట్ కోసం తరగతి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఓ పిల్లాడు కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో నలుగురు పిల్లలతో సహా పాఠశాల నిర్వహకుడు కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. కాల్పులు జరిపిన విద్యార్థిని డైలాన్ బట్లర్(17 )గా అధికారులు గుర్తించారు. బట్లర్ కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
కాల్పుల శబ్దం విన్న వెంటనే తరగతి గదిలోకి పారిపోయామని స్థానిక విద్యార్థులు తెలిపారు. అందరూ బయటకి రండి అని పిలుపు విన్న తర్వాతే బయటకు వచ్చానని ఓ విద్యార్థి పేర్కొన్నారు. పాఠశాల ప్రాంగణంలో నేలంతా రక్తసిక్తమైందని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు.
అమెరికా గన్ కల్చర్ రోజురోజుకీ ఎక్కువవుతోంది. పాఠశాలల్లో కాల్పుల ఘటన ఈ ఏడాది రెండోది. వర్జీనియాలో స్కూల్ బయటే ఓ కాల్పులకు పాల్పడిన ఘటన తర్వాత రోజు ఇది జరిగింది. మొత్తంగా 2018 నుంచి అమెరికా స్కూళ్లలో కాల్పుల ఘటనల సంఖ్య 182కు చేరింది.
ఇదీ చదవండి: సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment