అగ్రరాజ్యాన్ని చిన్నారులే వణికిస్తున్నారు?
మూడేళ్లు అంతకన్న తక్కువ వయస్సున్న చిన్నారులే అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తున్నారు. ఎందుకంటే గడిచిన ఏడాది ఉగ్రవాదుల కన్నా చిన్నారుల కాల్పుల వల్ల ఎక్కువమంది మృత్యువాత పడ్డారు. అమెరికాలో విచ్చలవిడిగా ఉన్న తుపాకీ సంస్కృతిని చాటుతూ తాజాగా దిగ్భ్రాంతికరమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.
2015లో మొత్తం 58 మంది చిన్నారులు తుపాకీ కాల్పులతో కలకలం సృష్టించారు. నిండా మూడేళ్లు మించని బుజ్జాయిలు తుపాకీతో తమను తాము కాల్చుకోవడం లేదా ఇతరులను కాల్చడం ద్వారా 19మంది చనిపోయారు. మరో రెండు కేసులలో ఇద్దరికిపైగా ప్రాణాలు విడిచారని వాష్టింగ్టన్ పోస్టు ఓ కథనంలో వెల్లడించింది.
ఇక గత ఏడాది అమెరికాలో మొత్తం మూడు ఉగ్రవాద కాల్పుల ఘటనలు జరుగగా.. అందులో 19 మంది మృతిచెందారు. గత మేలో ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత టెన్నిస్సీలోని చాటనూగాలో ఓ సాయుధ ఉగ్రవాది కాల్పులు జరిపాడు. గత డిసెంబర్‌లో కాలిఫోర్నియా సాన్‌బెర్నార్డినోలో ఇద్దరు సాయుధులు కాల్పులు జరిపారు. ఈ మొత్తం ఉగ్ర ఘటనల్లో 19 మంది చనిపోగా, చిన్నారులు కాల్పులు జరిపిన ఘటనల్లో అంతకన్నా ఎక్కుమంది ప్రాణాలు కోల్పోయారని పత్రిక కథనాలు విశ్లేషించాయి.
పిల్లల కాల్పుల్లో మరణాల ఘటనలు 71శాతం బాధితుడు/షూటర్ ఇంటివద్దే జరుగుతున్నాయయని, తుపాకులను, వాటి మందుగుండు సామగ్రిని సురక్షితంగా పిల్లలకు అందకుండా ఉంచడంలో పెద్దల తీవ్ర నిర్లక్ష్యం ఈ ఘటనల్లో కనిపిస్తోందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో విశ్లేషించింది. ఈ నేపథ్యంలో అమెరికాలో పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు బలమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరముందనే వాదన వినిపిస్తోంది.