IT capital
-
బెంగళూరు గొంతెండుతోంది
‘‘అవడానికి మాదో లగ్జరీ అపార్ట్మెంట్. కానీ ఏం లాభం? నెల రోజులుగా చుక్క నీటికీ దిక్కు లేక అల్లాడుతున్నాం! 24 గంటలూ రావాల్సిన నల్లా నీళ్లు ఏ రాత్రి వేళో వస్తున్నాయి. అవీ మురికిమయం! స్నానపానాలకే కాదు, చివరికి టాయ్‌లెట్ అవసరాలకు కూడా నీరు లేదు. సరిగా నీళ్లు కూడా పోయక ఏ ఫ్లాట్‌లో చూసినా టాయ్లెట్లు భరించలేనంతగా కంపు కొడుతున్నాయి. దాంతో రెసిడెంట్లు మూకుమ్మడిగా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. అలా వెళ్లలేనివాళ్లం విధిలేక పక్కనే ఉన్న ఫోరం సౌత్ మాల్‌లోకి వెళ్లి టాయ్‌లెట్ అవసరాలు తీర్చుకుంటున్నాం!’’ – రెడిట్‌లో ఓ బెంగళూరు వాసి పెట్టిన పోస్టిది! అలాంటిదేమీ లేదంటూ సదరు అపార్ట్మెంట్ అసోసియేషన్ ఖండించినా ఈ పోస్టు ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనికి బెంగళూరు టెకీల నుంచి విపరీతమైన స్పందన వెల్లువెత్తుతోంది. తమ నీటి కష్టాలకు అంతు లేదంటూ వర్ణిస్తూ వారు పెడుతున్న పోస్టులతో ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది... దేశ ఐటీ రాజధాని బెంగళూరు గొంతెండిపోతోంది. తీవ్ర నీటి కొరతతో అల్లాడుతోంది. గుక్కెడు తాగునీటి కోసం జనం అలో లక్ష్మణా అంటూ అలమటిస్తున్నారు. నగరవ్యాప్తంగా బోర్లన్నీ చుక్క నీరైనా లేకుండా ఎండిపోయాయి. నగరంలో ఏటా వేసవిలో నీటి కొరత మామూలే అయినా ఈసారి మాత్రం సమస్య చాలా దారుణంగా ఉంది. ఇంకా వేసవి మొదలైనా కాకముందే నీటి కొరత తారస్థాయికి చేరింది. కోట్లు పెట్టి లగ్జరీ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్లు కూడా కనీసం స్నానానికైనా నీళ్లు లేక లబోదిబోమంటున్నారు. సమర్థమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేక ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రస్తుతానికి చేష్టలుడిగింది. రాష్ట్రవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొని ఉందంటూ ప్రకటించింది! నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే తాలూకా స్థాయిలో కంట్రోల్ రూములు, హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. బెంగళూరులో నీటి సమస్య నివారణకు ఎంతదూరమైనా వెళ్తామంటూ ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ చేసిన ప్రకటనలు ఇప్పటికైతే కార్యరూపం దాల్చలేదు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకుండా చూసేందుకు నగరంలో నీటి వాడకంపై రాష్ట్ర జల బోర్డు కఠిన ఆంక్షలు విధించింది. కార్లు కడిగేందుకు, మొక్కలకు, మెయింటెన్స్, నిర్మాణ పనులకు తాగునీటి వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా తప్పదని హెచ్చరించింది. బెంగళూరులోనే గాక కర్ణాటకవ్యాప్తంగా నీటి ఎద్దడి ఆందోళనకర స్థాయిలోనే ఉంది. గత సీజన్లో వర్షాభావమే ఈ దుస్థితికి కారణమన్న ప్రభుత్వ ప్రకటనపై జనం మండిపడుతున్నారు. ఇంతటి సమస్య తప్పదని ముందే తెలిసి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేదంటూ దుయ్యబడుతున్నారు. ‘‘నిజానికి మూడు నెలలుగా నీటి సమస్య వెంటాడుతోంది. నెల నుంచి పరిస్థితి మరీ విషమించింది’’ అంటూ వాపోతున్నారు. ట్యాంకర్ల రేట్లు చుక్కల్లోకి... ► బెంగళూరులో ఏకంగా 60 శాతం జనం నీటి కోసం వాటర్ ట్యాంక్‌ల మీదే ఆధారపడ్డారు! అదను చూసి ప్రైవేట్ ట్యాంకర్లు రేట్లు ఎడాపెడా పెంచేశాయి. ► మామూలు రోజుల్లోనే 6,000 లీటర్ల ట్యాంకర్‌కు రూ.600, 8,000 లీటర్లకు రూ.800, 12 వేల లీటర్ల ట్యాంకరైతే రూ.1,000 చార్జి చేస్తారు. ► ఈ రేట్లకు జీఎస్టీ అదనం. పైగా దూరం 5 కి.మీ. దాటితే మరో రూ.200 దాకా పెరుగుతుంది. ► ఇప్పుడు ప్రైవేట్ ట్యాంకర్లు రెట్టింపు, అంతకుమించి వసూలు చేస్తున్నాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ► దాంతో ట్యాంకర్ల రేట్లకు పరిమితి విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఎక్కడా పెద్దగా అమలు కావడం లేదు. ► ఇవేం ధరలంటూ గట్టిగా నిలదీస్తే ట్యాంకర్వాలాలు ఆ కాలనీల ముఖం కూడా చూడటం లేదు. ► మున్సిపాలిటీ నల్లాల వద్ద క్యూ లైన్లు కిలోమీటర్లు దాటేస్తున్నాయి. అక్కడా ఒక్క బిందెకు మించి ఇవ్వడం లేదు! ► ఆర్వో ప్లాంట్ల ముందు కూడా ఒక్కరికి ఒక్క క్యానే అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి! ► చాలా ప్లాంట్లు ‘నో వాటర్’ అంటూ బోర్డులు పెట్టి బ్లాకులో అడ్డగోలు రేట్లకు అమ్ముకుంటున్నాయి. ► నీటి ఎద్దడి దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు ఆన్లైన్ బాట పడుతున్నాయి. ఆన్లైన్ క్లాసులతో పని కానిస్తున్నాయి. ఎందుకింత సమస్య... ► 2023లో కర్ణాటకవ్యాప్తంగా నెలకొన్న వర్షా భావ పరిస్థితులు ప్రస్తుత నీటి సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి. ► రాష్టంలో ఎక్కడ చూసినా భూగర్భ జలాలు అడుగంటాయి. కావేరీ బేసిన్‌లోని రిజర్వాయర్లన్నీ దాదాపుగా వట్టిపోయాయి. ► కర్ణాటకలోని 16 పెద్ద రిజర్వాయర్లలో 2023లో ఇదే సమయానికి సగం వరకున్న నీటిమట్టం ఈసారి 29 శాతానికి పడిపోయింది. ► బెంగళూరులో ఎక్కడ చూసినా బోర్లే దర్శనమిస్తుంటాయి. భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం నగరంలో నీటి ఎద్దడికి ప్రధాన కారణం. ► రియల్టీ బూమ్ నేపథ్యంలో రెండు దశాబ్దాలుగా నగరంలోని చెరువులు, నీటి ఆవాసాలన్నీ కాలనీలు, అపార్ట్మెంట్లుగా మారిపోయాయి. ఆ దెబ్బకు స్థానిక నీటి వనరులు పూర్తిగా కనుమరుగయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నెంబర్ 1 గా నిలిచిన బెంగళూరు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని, ఐటీ సిటీ బెంగళూరు దేశంలో నివాసయోగ్య నగరాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్– 2020 ప్రకారం భారతదేశంలో అత్యంత నివాసయోగ్య నగరంగా బెంగళూరు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆహ్లాదరకరమైన వాతావరణం, పచ్చని చెట్లు, విస్తరిస్తున్న ఐటీ రంగం తదితరాలతో ఈ హోదాను సొంతం చేసుకుంది. తరువాతి స్థానాల్లో చెన్నై, సిమ్లా విజ్ఞాన, పర్యావరణ కేంద్రం (సీఎస్ఈ) విడుదల చేసిన నివాసయోగ్యాల నగరాల జాబితాలో బెంగళూరు తర్వాత స్థానాల్లో చెన్నై, సిమ్లా, భువనేశ్వర్, ముంబై నిలిచాయి. ఢిల్లీ ఆరోస్థానంలో నిలవడమే కాకుండా ఆర్థిక సామర్థ్యంలోనూ చాలా వెనుకబడి ఉంది. మొత్తం ఐదు విభాగాల్లో సీఎస్ఈ అధ్యయనం జరిపి ర్యాంకింగులను ప్రకటించింది. నాణ్యమైన జీవన ప్రమాణాల్లో 60.84 శాతం మార్కులతో చెన్నై తొలిస్థానం, 55.67 శాతం మార్కులతో బెంగళూరు రెండో స్థానం, భోపాల్ మూడో స్థానంలో నిలిచాయి. ఇక ఆర్థిక సామర్థ్యం అంశంలో బెంగళూరు టాప్‌లో నిలిచింది. 100కు 78.82 శాతం మార్కులు లభించాయి. బెంగళూరుకు సమీపంలో మరే ఇతర నగరం కూడా లేకపోవడం విశేషం. బెంగళూరు తర్వాత ఢిల్లీకి రెండో స్థానం (50.73 శాతం) దక్కింది. -
ఉగ్రభయం
ఉగ్రవాదుల కేంద్రంగా బెంగళూరు ఇక్కడి నుంచే జిహాదీల నియామకం బ్రిటన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం నగరానికి చేరిన కేంద్ర నిఘా వర్గాలు పరిశీలిస్తున్నామన్న కమిషనర్ ఎంఎన్ రెడ్డి బెంగళూరు : ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు నగరం ఉగ్రవాదుల కేంద్రంగా తయారవుతోందని బ్రిటన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేసిన కథనం కలకలం రేపింది. ఈ విషయంపై రెండు మూడు రోజుల క్రితమే సమాచారం అందుకున్న కేంద్ర నిఘా వ్యవస్థకు చెందిన అధికారులు బెంగళూరుకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి ధ్రువీకరించారు. వివరాలు... ప్రముఖ ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ (ఐఎస్ఐఎస్)లో యువకులను సభ్యులుగా చేర్పించడం బెంగళూరు కేంద్రంగా సాగుతోందని బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ ప్రసారం చేసింది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థలో బోర్డు మెంబర్‌గా ఉన్న మహ్ది అన్న వ్యక్తి ‘షమి విట్నెస్’ అన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ వర్గానికి చెందిన యువకులను తన ట్వీట్లోని వ్యాఖ్యల ద్వారా ఆకర్షించేవాడని తెలిపింది. ఆయన అకౌంట్‌కు 17,700 మంది ఫాలోయర్లు ఉన్నారని పేర్కొంది. ఇందులో ఎక్కువ మంది విదేశీయులేనని తెలిపింది. ఇతనికి ‘ఐఎస్ఐఎస్’ తోపాటు ఇతర ప్రభావ ఉగ్రవాద సంస్థలతో కూడా ఎక్కువ పరిచయాలు ఉన్నాయని తెలిపింది. ఈ విషయాన్ని మహ్దితో స్వయంగా మాట్లాడి నిర్ధారణకు వచ్చామని ఈ మీడియా పేర్కొంది. ఇంతకంటే ఎక్కువగా అతని వివరాలు చెబితే అతని ప్రాణాలకు ముప్పు వస్తుందని తెలిపింది. కాగా, తనకు కూడా ఐఎస్ఐఎస్ సంస్థలో చేరాలని ఉందని, అయితే సంసార బాధ్యతల వల్ల ఆ పనిచేయలేకపోతున్నానని మహ్ది తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా బ్రిటన్‌లో ఉన్న చాలా మంది జిహాదీలు తనను నిత్యం ఏదో ఒక రూపంలో (మెయిల్, ఫోన్, ట్విట్టర్) పలకరిస్తుంటారని, తమ మధ్య హాస్యోక్తులు కూడా ఉంటాయని ఆయన అకౌంట్లో పేర్కొన్నారు. ఐఎస్ఐఎస్ సభ్యులు విదేశీయుల శిరస్సులను ఖండించడం సమర్థిస్తాను అని మహ్ది పేర్కొన్నట్లు తెలిపింది. ఇలా అనేక విషయాలను సదరు వార్తా సంస్థ ప్రచారం చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర నిఘా బృందం బెంగళూరుకు చేరుకుని దర్యాప్తు చేస్తోంది. ఈ విషయంపై నగర కమిషనర్ ఎంఎన్ రెడ్డి మాట్లాడుతూ... ‘బ్రిటన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ వార్తా సంస్థ ప్రచారం చేసిన వార్తాకథనంపై దర్యాప్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఉగ్రవాద కార్యకలాపాలపై రాష్ట్ర నిఘా వర్గంతో పాటు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారు.’ అని పేర్కొన్నారు. -
‘విశాఖ ఐటీ రాజధాని’ ఉత్తిమాటేనా?
విశాఖపట్నం: రాష్ట్రంలో ఐటీ రంగానికి పెద్దదిక్కుగా ఉన్న విశాఖ ప్రస్తుతం భవిష్యత్తు ప్రయాణం ఎటో తేల్చుకోలేకపోతోంది. నగరాన్ని ఐటీ రాజధానిగా తీర్చుదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో స్పష్టత ఇవ్వకపోవడంతో కంపెనీలు గందరగోళానికి గురవు తున్నాయి. ఒకపక్క సమస్యలతో మనుగడ కష్టంగా మారగా, మరోపక్క పభుత్వం మొక్కుబడి వ్యవహారంతో అయోమయానికి గురవుతున్నాయి. కంపెనీల విస్తరణ, ఉద్యోగ నియామకాల విషయంలో ముందడుగు వేయడానికి సంశయిస్తున్నాయి. ఉన్న సంక్షోభ పరిస్థితులు చక్కదిద్దకుండా హడావుడి చేస్తుండడంతో మొదట్లో కాస్తోకూస్తో ఆశగా ఉన్న యాజమాన్యాలు క్రమక్రమంగా నిరుత్సాహానికి లోనవుతున్నాయి. సోమవారం విశాఖలో ఐటీశాఖ అత్యున్నతస్థాయి విధానపరమైన సమీక్ష జరుగుతుండడంతో తాడోపేడో తేల్చుకోవడానికి సమాయత్తమవుతున్నాయి. ఐటీ రాజధానిగా చేస్తారా? విభజనకు ముందు హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఐటీ రంగంలో విశాఖది రెండోస్థానం. అక్కడ మొత్తం 2,500 కంపెనీలు పనిచేస్తుండగా, వార్షిక టర్నోవర్ రూ.60,200 కోట్లు. విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న మొత్తం 70 కంపెనీల టర్నోవర్ రూ.1450 కోట్లు. కానీ విడిపోయిన తర్వాత రాష్ట్రంలో విశాఖ ఐటీ రంగం కేవలం మూడుశాతమే మిగిలింది. దీంతో విశాఖను ఐటీ రాజధానిగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం అదే పనిగా ప్రకటిస్తోంది. కానీ ఇక్కడ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లి సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రిని కలిసి సమస్యలు వివరించినా పెద్దగా స్పందన లేకపోవడంతో భవిష్యత్తుపై ఆశలు వదిలేసుకుంటున్నాయి. ప్రస్తుతం నగరంలో 70 ఐటీ కంపెనీలు, నాలుగు ఎస్ఈజెడ్లున్నాయి. ఇవన్నీ అనేక పురిటినొప్పులు పడుతున్నాయి. ఎస్ఈజెడ్లకు కేటాయించిన భూముల్లో సగానికిపైగా కంపెనీలు నిర్మాణాలు చేపట్టకుండా భూములు ఖాళీగా ఉంచాయి. నిర్మాణం పూర్తిచేసుకున్న కంపెనీలకు అనుమతులు, మౌలిక సదుపాయాలు లేక పాడుబడ్డ భవనాలుగా మారాయి. ఐటీకి పవర్‌హాలీడే విధిస్తుండడంతో ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా ఏదో చేస్తామని యాజమాన్యాలను ఊరించే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 16న ఐటీశాఖ నుంచి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్, ఐటీఈ అండ్ సీ సెక్రటరీ సంజయ్‌జాజూ, పరిశ్రమల అభివృద్ధి ఫోరం చైర్మన్ జె.ఎ.చౌదరి తదితరులు నగరానికి వస్తున్నారు. రాష్ట్రంలో విశాఖను ఐటీ రాజధానిగా ఏవిధంగా తీర్చిదిద్దాలి? సమస్యలు? వంటివాటిపై విధానపరమైన సమీక్ష జరపనున్నారు. ఇందులో ఐటీ సమస్యలను ఏకరువుపెట్టడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ ఐటీ కంపెనీల సమావేశాలు, ఇతరత్రా అవసరాలను తీర్చేందుకు రూ.20 కోట్లతో చేపట్టిన ఇంక్యుబేషన్ సెంటర్ రెండేళ్లవుతున్నా నిర్మాణం పూర్తవలేదు. రెండో ఇంక్యుబేషన్ కేంద్రానికి మరో రూ.23 కోట్లు నిధులు సిద్ధంగా ఉన్నా భూములే లేవు. దీనిపై కంపెనీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి. ఐటీ కంపెనీలకు కనీసం బస్సు సౌకర్యం, తాగునీటి వసతి ఇలా ప్రాథమికంగా ఏవీ లేవు. ముందు ఈ సౌకర్యాలు కల్పించి ఆ తర్వాత ఐటీ రాజధానిగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేయనున్నట్లు రుషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఒ.నరేష్కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. రూ.50 వేల కోట్లతో 10వేల ఎకరాల్లో విశాఖకు ఐటీఐఆర్ వస్తుందని గత ప్రభుత్వంతోపాటు సీఎం చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే 4 వేల ఎకరాల భూములు కూడా సిద్ధం చేసి ఉంచారు. ఐటీఐఆర్‌ను ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ భూములను వెనక్కి తీసుకుని వేరే కంపెనీలకు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీనిపైనా తాము ప్రశ్నిస్తామని నరేష్కుమార్ చెప్పారు. -
ఐటీ..వెరీ పిటీ
వెనక్కుపోతున్న కీలక రంగం సహాయ నిరాకరణం.. మారని వాతావరణం పేరుకే రాష్ట్రంలో రెండో ఐటీ రాజధాని అడుగడుగునా అవస్థలతో హాని కొత్త కంపెనీల ఊసే కరువు ఉన్నవాటిపై సమస్యల బరువు పెరగని వ్యాపారాలు.. కలగామారిన కొత్త ఉద్యోగాలు అంగట్లో అన్నీ ఉన్నాయ్.. వైజాగ్ ఐటీ నెత్తిన మట్టి ఉంది. సిటీ పెద్దది.. పేరున్నది.. పరిశ్రమల పెన్నిధి. పారిశ్రామిక రాజధానిగా వన్నెకెక్కింది. ఐటీ రంగాన్ని చూస్తే ఇదంతా వృథా అనిపిస్తుంది. అప్పుడప్పుడూ తాటాకు చప్పుళ్లలాటి ప్రకటనల హోరు తప్పితే ఈ రంగం ఇప్పటికే ముసుగు తన్నేసింది. ఐటీఐఆర్ మాటలో తీపి బాగుంది కానీ నిజం దీనంగా కనిపిస్తోంది. కొత్త పరిశ్రమలు రాక, ఉద్యోగాలు లేక సిస్టమ్ షట్‌డౌన్ అయ్యే కష్టం వెంటాడుతోంది. సాక్షి,విశాఖపట్నం: వైజాగ్ ఐటీ.. వెరీ పిటీ! సాఫ్ట్వేర్ రంగం నిపుణులు తేలిగ్గా చేసే వ్యాఖ్య ఇది! చేదనిపించినా కాదనలేని వాస్తవం ఇది! ఐటీ రంగంలో రెండోరాజధానిగా కీర్తి బాగుంది కానీ కళ్లెదుట నిజం కలవరం కలిగిస్తోంది. కనీస వసతులు లేక, ప్రభుత్వం కనికరించక, కాస్తయినా ప్రోత్సాహం కానరాక విశాఖలో ఐటీ నానాటికీ వెనకడుగు వేస్తోంది. మొత్తం 70 కంపెనీలు, నాలుగు ఎస్ఈజెడ్లుంటే అందులో పాతిక శాతమైనా పనిచేయడం లేదంటే పరిస్థితి అర్థమవుతుంది. అసలు డొల్ల విశాఖలోని 70 ఐటీ కంపెనీల్లో పూర్తిస్థాయిలో పనిచేస్తున్నవి 20 లోపే. నాలుగుఎస్ఈజెడ్ల్లో రెండు మాత్రమే పనిచేస్తుండగా,మిగతావి నిరుపయోగంగా మారాయి. దీనివల్ల కార్యకలాపాలు జరగక 2014-15నాటికి విశాఖలో రూ.5 వేల కోట్లదాటాల్సి ఉన్న టర్నోవర్ రూ. 1450 కోట్ల వద్దే ఆగిపోయింది. ఉద్యోగాలు 70వేలు దాటాల్సి ఉండగా, కేవలం 10,200 మందికే ఉపాధి లభిస్తోంది. గడిచిన అయిదేళ్లలో నాలుగైదు పెద్ద కంపెనీలు మినహా మరేం రాలేదు. కొత్త ఐటీ కంపెనీలు విశాఖకు రావాలంటే ప్రత్యేకంగా ప్రభుత్వం కృషి చేయాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని ఐటీ ప్రమోటింగ్ స్టాఫ్‌గా ఇక్కడ నియమించాలి. అది జరగడం లేదు. ఐటీ అభివృద్ధి చెందాలంటే అనుబంధ సౌకర్యాలూ ముఖ్యం. అత్యున్నత విద్యా, వైద్య, రవాణా సౌకర్యాలు ప్రధానం. కానీ నగరంలో వీటి అభివృద్ధి అంతంతే. విదేశీ క్లయింట్లు విశాఖకు రావాలంటే సరయిన విమాన సౌకర్యమూ లేదు. ఐటీ రంగ అభివృద్ధికి నిరంతరం విద్యుత్ అత్యవసరం. కాని విశాఖలో మాత్రం కంపెనీలకు కేటాయించిన విద్యుత్ కోటాను మించి వాడితే యూనిట్‌కు రూ.50 వంతున వసూలు చేస్తున్నారు. గతేడాది విద్యుత్‌కోతతో ఐటీ పరిశ్రమలు విలవిలలాడాయి. ఈసారీ అదే పరిస్థితి ఉంది. నగరానికి దూరంగా ఉన్న ఐటీ ఎస్‌ఈజెడ్‌ల్లో పనిచేసే కంపెనీ ఉద్యోగుల రాకపోకలకు కనీస రవాణా వ్యవస్థ లేదు. ఇక ఐటీఐఆర్ సంగతే సందేహంగా ఉంది. అవసరమైతే 10 వేల ఎకరాలు ఉన్నా వాటిని మాస్టర్‌ప్లాన్‌లో గుర్తించకపోవడంతో ఐటీఐఆర్ సాధ్యమా అనిపిస్తోంది. రుషికొండలో మొత్తం మూడు ఐటీ సెజ్‌లలో కనీస సౌకర్యాల అభివృద్ధి కోసం హైదరాబాద్ తరహాలో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి 2012 జనవరిలో ఐటీ శాఖ మంత్రి పొన్నాల శంకుస్థాపనచేశారు. ఇంకా అది మొదలవలేదు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా రెండో సెంటర్‌కు రూ. 23 కోట్లు మంజూరు చేసింది. దీనికి భూమి మంజూరు కాలేదు. ఇదా ప్రోత్సాహం? కొత్త ఐటీ కంపెనీలు రావాలన్నా , ఉన్నవి సక్రమంగా పనిచేయాలన్నా ఎస్ఈజెడ్లను ప్రభుత్వం వెంటనే డీ-నోటిఫై చేయాలి. లేకపోతే కంపెనీలకు రుణాలు కూడా పుట్టక మూతపడే పరిస్థితి ఎదురవుతుంది. వీటిని డీ నోటిఫై చేస్తేనే విశాఖలో ఐటీకి మనుగడ . ఈపీడీసీఎల్ విద్యుత్ కోతలు తీవ్రంగా విధిస్తోంది. రాష్ట్రప్రభుత్వం తరఫున గతకొన్నేళ్లుగా ఏ ఒక్క ఉన్నతాధికారికూడా ఇక్కడకురాలేదు. అభివృద్ధి ఇంకెలా సాధ్యమవుతుంది? - ఓ.నరేష్కుమార్, రుషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు