ఐటీ..వెరీ పిటీ
- వెనక్కుపోతున్న కీలక రంగం
- సహాయ నిరాకరణం.. మారని వాతావరణం
- పేరుకే రాష్ట్రంలో రెండో ఐటీ రాజధాని
- అడుగడుగునా అవస్థలతో హాని
- కొత్త కంపెనీల ఊసే కరువు
- ఉన్నవాటిపై సమస్యల బరువు
- పెరగని వ్యాపారాలు.. కలగామారిన కొత్త ఉద్యోగాలు
అంగట్లో అన్నీ ఉన్నాయ్.. వైజాగ్ ఐటీ నెత్తిన మట్టి ఉంది. సిటీ పెద్దది.. పేరున్నది.. పరిశ్రమల పెన్నిధి. పారిశ్రామిక రాజధానిగా వన్నెకెక్కింది. ఐటీ రంగాన్ని చూస్తే ఇదంతా వృథా అనిపిస్తుంది. అప్పుడప్పుడూ తాటాకు చప్పుళ్లలాటి ప్రకటనల హోరు తప్పితే ఈ రంగం ఇప్పటికే ముసుగు తన్నేసింది. ఐటీఐఆర్ మాటలో తీపి బాగుంది కానీ నిజం దీనంగా కనిపిస్తోంది. కొత్త పరిశ్రమలు రాక, ఉద్యోగాలు లేక సిస్టమ్ షట్‌డౌన్ అయ్యే కష్టం వెంటాడుతోంది.
సాక్షి,విశాఖపట్నం: వైజాగ్ ఐటీ.. వెరీ పిటీ! సాఫ్ట్‌వేర్ రంగం నిపుణులు తేలిగ్గా చేసే వ్యాఖ్య ఇది! చేదనిపించినా కాదనలేని వాస్తవం ఇది! ఐటీ రంగంలో రెండోరాజధానిగా కీర్తి బాగుంది కానీ కళ్లెదుట నిజం కలవరం కలిగిస్తోంది. కనీస వసతులు లేక, ప్రభుత్వం కనికరించక, కాస్తయినా ప్రోత్సాహం కానరాక విశాఖలో ఐటీ నానాటికీ వెనకడుగు వేస్తోంది. మొత్తం 70 కంపెనీలు, నాలుగు ఎస్‌ఈజెడ్‌లుంటే అందులో పాతిక శాతమైనా పనిచేయడం లేదంటే పరిస్థితి అర్థమవుతుంది.
అసలు డొల్ల
విశాఖలోని 70 ఐటీ కంపెనీల్లో పూర్తిస్థాయిలో పనిచేస్తున్నవి 20 లోపే. నాలుగుఎస్‌ఈజెడ్‌ల్లో రెండు మాత్రమే పనిచేస్తుండగా,మిగతావి నిరుపయోగంగా మారాయి. దీనివల్ల కార్యకలాపాలు జరగక 2014-15నాటికి విశాఖలో రూ.5 వేల కోట్లదాటాల్సి ఉన్న టర్నోవర్ రూ. 1450 కోట్ల వద్దే ఆగిపోయింది. ఉద్యోగాలు 70వేలు దాటాల్సి ఉండగా, కేవలం 10,200 మందికే ఉపాధి లభిస్తోంది.
గడిచిన అయిదేళ్లలో నాలుగైదు పెద్ద కంపెనీలు మినహా మరేం రాలేదు. కొత్త ఐటీ కంపెనీలు విశాఖకు రావాలంటే ప్రత్యేకంగా ప్రభుత్వం కృషి చేయాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని ఐటీ ప్రమోటింగ్ స్టాఫ్‌గా ఇక్కడ నియమించాలి. అది జరగడం లేదు.
ఐటీ అభివృద్ధి చెందాలంటే అనుబంధ సౌకర్యాలూ ముఖ్యం. అత్యున్నత విద్యా, వైద్య, రవాణా సౌకర్యాలు ప్రధానం. కానీ నగరంలో వీటి అభివృద్ధి అంతంతే. విదేశీ క్లయింట్లు విశాఖకు రావాలంటే సరయిన విమాన సౌకర్యమూ లేదు.
ఐటీ రంగ అభివృద్ధికి నిరంతరం విద్యుత్ అత్యవసరం. కాని విశాఖలో మాత్రం కంపెనీలకు కేటాయించిన విద్యుత్ కోటాను మించి వాడితే యూనిట్‌కు రూ.50 వంతున వసూలు చేస్తున్నారు. గతేడాది విద్యుత్‌కోతతో ఐటీ పరిశ్రమలు విలవిలలాడాయి. ఈసారీ అదే పరిస్థితి ఉంది.
నగరానికి దూరంగా ఉన్న ఐటీ ఎస్‌ఈజెడ్‌ల్లో పనిచేసే కంపెనీ ఉద్యోగుల రాకపోకలకు కనీస రవాణా వ్యవస్థ లేదు. ఇక ఐటీఐఆర్ సంగతే సందేహంగా ఉంది. అవసరమైతే 10 వేల ఎకరాలు ఉన్నా వాటిని మాస్టర్‌ప్లాన్‌లో గుర్తించకపోవడంతో ఐటీఐఆర్ సాధ్యమా అనిపిస్తోంది.
రుషికొండలో మొత్తం మూడు ఐటీ సెజ్‌లలో కనీస సౌకర్యాల అభివృద్ధి కోసం హైదరాబాద్ తరహాలో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి 2012 జనవరిలో ఐటీ శాఖ మంత్రి పొన్నాల శంకుస్థాపనచేశారు. ఇంకా అది మొదలవలేదు. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా రెండో సెంటర్‌కు రూ. 23 కోట్లు మంజూరు చేసింది. దీనికి భూమి మంజూరు కాలేదు.
ఇదా ప్రోత్సాహం?
కొత్త ఐటీ కంపెనీలు రావాలన్నా , ఉన్నవి సక్రమంగా పనిచేయాలన్నా ఎస్‌ఈజెడ్‌లను ప్రభుత్వం వెంటనే డీ-నోటిఫై చేయాలి. లేకపోతే కంపెనీలకు రుణాలు కూడా పుట్టక మూతపడే పరిస్థితి ఎదురవుతుంది. వీటిని డీ నోటిఫై చేస్తేనే విశాఖలో ఐటీకి మనుగడ . ఈపీడీసీఎల్ విద్యుత్ కోతలు తీవ్రంగా విధిస్తోంది. రాష్ట్రప్రభుత్వం తరఫున గతకొన్నేళ్లుగా ఏ ఒక్క ఉన్నతాధికారికూడా ఇక్కడకురాలేదు. అభివృద్ధి ఇంకెలా సాధ్యమవుతుంది?
- ఓ.నరేష్‌కుమార్, రుషికొండ ఐటీ పార్క్స్
అసోసియేషన్ ఉపాధ్యక్షుడు