ఉగ్రభయం
ఉగ్రవాదుల కేంద్రంగా బెంగళూరు
ఇక్కడి నుంచే జిహాదీల నియామకం
బ్రిటన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం
నగరానికి చేరిన కేంద్ర నిఘా వర్గాలు
పరిశీలిస్తున్నామన్న కమిషనర్ ఎంఎన్ రెడ్డి
బెంగళూరు : ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు నగరం ఉగ్రవాదుల కేంద్రంగా తయారవుతోందని బ్రిటన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేసిన కథనం కలకలం రేపింది. ఈ విషయంపై రెండు మూడు రోజుల క్రితమే సమాచారం అందుకున్న కేంద్ర నిఘా వ్యవస్థకు చెందిన అధికారులు బెంగళూరుకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి ధ్రువీకరించారు. వివరాలు... ప్రముఖ ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ (ఐఎస్‌ఐఎస్)లో యువకులను సభ్యులుగా చేర్పించడం బెంగళూరు కేంద్రంగా సాగుతోందని బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ ప్రసారం చేసింది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థలో బోర్డు మెంబర్‌గా ఉన్న మహ్ది అన్న వ్యక్తి ‘షమి విట్‌నెస్’ అన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ వర్గానికి చెందిన యువకులను తన ట్వీట్‌లోని వ్యాఖ్యల ద్వారా ఆకర్షించేవాడని తెలిపింది. ఆయన అకౌంట్‌కు 17,700 మంది ఫాలోయర్లు ఉన్నారని పేర్కొంది. ఇందులో ఎక్కువ మంది విదేశీయులేనని తెలిపింది. ఇతనికి ‘ఐఎస్‌ఐఎస్’ తోపాటు ఇతర ప్రభావ ఉగ్రవాద సంస్థలతో కూడా ఎక్కువ పరిచయాలు ఉన్నాయని తెలిపింది. ఈ విషయాన్ని మహ్దితో స్వయంగా మాట్లాడి నిర్ధారణకు వచ్చామని ఈ మీడియా పేర్కొంది. ఇంతకంటే ఎక్కువగా అతని వివరాలు చెబితే అతని ప్రాణాలకు ముప్పు వస్తుందని తెలిపింది. కాగా, తనకు కూడా ఐఎస్‌ఐఎస్ సంస్థలో చేరాలని ఉందని, అయితే సంసార బాధ్యతల వల్ల ఆ పనిచేయలేకపోతున్నానని మహ్ది తన ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా బ్రిటన్‌లో ఉన్న చాలా మంది జిహాదీలు తనను నిత్యం ఏదో ఒక రూపంలో (మెయిల్, ఫోన్, ట్విట్టర్) పలకరిస్తుంటారని, తమ మధ్య హాస్యోక్తులు కూడా ఉంటాయని ఆయన అకౌంట్‌లో పేర్కొన్నారు.
ఐఎస్‌ఐఎస్ సభ్యులు విదేశీయుల శిరస్సులను ఖండించడం సమర్థిస్తాను అని మహ్ది పేర్కొన్నట్లు తెలిపింది. ఇలా అనేక విషయాలను సదరు వార్తా సంస్థ ప్రచారం చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర నిఘా బృందం బెంగళూరుకు చేరుకుని దర్యాప్తు చేస్తోంది. ఈ విషయంపై నగర కమిషనర్ ఎంఎన్ రెడ్డి మాట్లాడుతూ... ‘బ్రిటన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ వార్తా సంస్థ ప్రచారం చేసిన వార్తాకథనంపై దర్యాప్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఉగ్రవాద కార్యకలాపాలపై రాష్ట్ర నిఘా వర్గంతో పాటు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారు.’ అని పేర్కొన్నారు.