సాక్షి, బెంగళూరు: డిమాండ్లను సర్కారు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ ఉద్యోగులు తీర్మానించడంతో బస్సుల సంచారంలేక ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. సమ్మెలో పాల్గొంటున్న రవాణా శాఖ ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఖాతరు చేయడం లేదు. గురువారం నాటికి సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రవాణాశాఖ ఉద్యోగులు కొవ్వొత్తులతో ధర్నాకు దిగారు. 6వ వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం జీతాలను పెంచాలని స్పష్టం చేశారు.
2,237 మందికి తాఖీదులు..
ఎస్మా తప్పదన్న ప్రభుత్వం ఆ చట్టం ప్రయోగానికి వెనుకాడుతోంది. ప్రతిరోజు కొందరు ఉద్యోగులకు నోటీస్‌లు జారీ చేస్తోంది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా విధులకు రావాలని బీఎంటీసీ 2,237 మంది ఉద్యోగులకు ఆదేశాలు పంపింది. అయితే స్పందన లేదు. దీంతో వారందరూ సంజాయిషి ఇవ్వాలని మళ్లీ తాఖీదులు పంపారు. ఉద్యోగుల దాడుల్లో రాష్ట్రవ్యాప్తంగా 60 బస్సులు ధ్వంసం అయ్యాయి. రవాణాశాఖ ఉద్యోగుల తరపున పోరాటం చేస్తున్న కోడిహళ్లి చంద్రశేఖర్ ప్రభుత్వ బెదిరింపులకు భయపడేదిలేదని శుక్రవారం నుంచి వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
బెంగళూరు బస్టాండ్లలో బుధవారంతో పోలిస్తే గురువారం ప్రయాణికుల సంఖ్య పెరిగింది. పండుగకు ఊరికివెళ్లి రైళ్లలో బెంగళూరుకు చేరుకున్న ప్రజలకు ఇళ్లకు వెళ్లేందుకు బీఎంటీసీ బస్సులు లేక ఉసూరన్నారు. ప్రైవేటు బస్సులే గమ్యం చేర్చాయి. అయితే నగరంలోని అనేక ప్రాంతాలకు బస్సులు నడవడం లేదు. మెజస్టిక్ రైల్వేస్టేషన్, మెట్రో స్టేషన్లలో రద్దీ కనిపించింది.
రూ.170 కోట్ల నష్టం: డీసీఎం
సమ్మె వల్ల ఇప్పటికి సుమారు రూ.170 కోట్లు నష్టం వచ్చిందని, వెంటనే విధులకు హాజరుకావాలని రవాణా మంత్రి, డిప్యూటీ సీఎం లక్ష్మణ సవది విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం 4,500 రవాణాబస్సులు సంచరించాయన్నారు. ఇప్పటివరకు సమ్మెతో రూ.170 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. బస్సులపై రాళ్ల దాడులు చేయడం సరికాదన్నారు. ప్రజల కోసం 24 వేల ప్రైవేటు బస్సులు సంచరిస్తున్నాయని తెలిపారు.
ఆర్టీసీ సిబ్బందికి హీరో యశ్ మద్దతు
బనశంకరి: ఒక బస్సు డ్రైవర్ కుమారునిగా తనకు ఆర్టీసీ కార్మికుల సమస్యలు తెలుసని ప్రముఖ నటుడు యశ్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుండటంతో బుధవారం కన్నడ హీరో రాకింగ్‌స్టార్ యశ్ రవాణాశాఖ మంత్రి లక్ష్మణసవదికి లేఖ రాసి, గురువారం స్వయంగా కలిసి మాట్లాడారు. అంతకు ముందు ఆయన ట్విట్టర్‌లో ఆర్టీసీ కార్మికుల కష్టాలను పంచుకున్నారు. తన తండ్రి కూడా ఎన్నోసార్లు ఖాళీ కడుపుతో విధులకు వెళ్లిన సందర్భాలు తనకు గుర్తు ఉన్నాయని, ఇంతటి పని ఒత్తిడి ఉంటుందని వారి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. రవాణాశాఖ మంత్రి లక్ష్మణసవది కూడా స్పందించినట్లు చెప్పారు. సీఎంతో మాట్లాడి డిమాండ్లు చర్చిస్తామని చెప్పినట్లు ఆయన పోస్టు చేశారు.
చదవండి: పండుగ సెలవులకు బస్సుల కొరత.. అక్కడ డబుల్ చార్జీలు
— Yash (@TheNameIsYash) April 15, 2021
Comments
Please login to add a commentAdd a comment