సాక్షి, బెంగళూరు/బనశంకరి: అర్జంటుగా ఎన్నో పనులు. ఊరికి వెళ్దామంటే ఆర్టీసీ బస్సులు లేవు. ప్రైవేటు బస్సుల్లో డబుల్ చార్జీలు. అవి కూడా దూరప్రాంతాలకు వెళ్లడం లేదు. కార్లు, క్యాబ్‌లను భరించే స్థోమత లేదు.. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె వల్ల సామాన్యులు పడుతున్న కష్టాలు ఎన్నో. రవాణా శాఖ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడవ రోజుకు చేరుకుంది. 6వ వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలుచేయాలని ఉద్యోగులు, చేయలేమని ప్రభుత్వం తేల్చిచెప్పాయి. ఇరు పక్షాలూ మెట్టు దిగకపోవడంతో పాతిక వేల బస్సులు బస్టాండ్లకే పరిమితం అయ్యాయి. యథా ప్రకారం లక్షలాది ప్రజలకు రవాణా సౌలభ్యం కనాకష్టమైంది.
కండక్టర్ ఆత్మహత్య..
విధులకు రావాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో బెళగావి జిల్లా సవదత్తిలో శివకుమార్ నీలగార (40) అనే కండక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రవాణా ఉద్యోగులు విధులకు హాజరుకాకపోతే ఉద్యోగాల నుంచి తీసేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వ హెచ్చరికలు ఖాతరు చేయని ఉద్యోగులు శుక్రవారం సైతం సమ్మెను కొనసాగించారు. నోటీస్‌లను జారీచేయగా పట్టించుకోలేదు. కాగా, ఆర్టీసీ బస్సులపై రాళ్లు విసిరారని బళ్లారిలో ఇద్దరు రవాణా సిబ్బందిని పోలీసులు అరెస్ట్‌చేశారు.
బెంగళూరు బస్టాండ్లు వెలవెల..
మూడోరోజు సమ్మె కొనసాగుతుండటంతో బెంగళూరు మరింతగా బోసిపోయింది. ఆర్టీసీ సమ్మెతో బస్టాండ్లు వెలవెలబోయాయి. మెజెస్టిక్‌లో బీఎంటీసీ, కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్లలో ప్రయాణికులు ప్రైవేటు బస్సులు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్, ఆటోలను ఆశ్రయించారు. ప్రభుత్వం సూచించిన రూట్‌మ్యాప్ ప్రకారం ప్రైవేటు బస్సులు సంచరిస్తున్నాయి.
ప్రైవేటు బస్సులకు.. పండుగ..
మూడురోజుల్లో ఉగాది పండుగ వస్తుండడంతో బెంగళూరుతో పాటు ప్రధాన నగరాల నుంచి ఊళ్లకు వెళ్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులు ఎక్కుతున్నారు. శనివారం, ఆదివారాలు సెలవులు, సోమవారం ఒకరోజు సెలవు పెడితే మంగళవారం ఉగాది పండుగ కావడంతో నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఊళ్ల బాట పట్టారు. ప్రైవేటు బస్సుల్లో అడిగినంత డబ్బు ఇచ్చి సొంత ఊళ్లకు వెళ్లక తప్పడం లేదని పలువురు వాపోయారు. అయితే బెంగళూరు నుంచి బళ్లారి, హుబ్లీ, రాయచూరు, కలబురిగి, బీదర్, బాగల్‌కోటె, విజయపుర, బెళగావి తదితర ఉత్తర కర్ణాటక నగరాలకు ప్రైవేటు బస్సులు వెళ్లడం లేదు. రైళ్లలో వెళదామనుకున్నా టికెట్లు సులభంగా దొరకడం లేదు. దీంతో ఊళ్లకు చేరేదెలా అని టెన్షన్ నెలకొంది.
సమ్మె కొనసాగిస్తాం: కోడిహళ్లి
సాక్షి బెంగళూరు: తెలంగాణలో మాదిరిగా ఆర్టీసీ ఉద్యోగులను సస్పెండ్ చేస్తామంటే చేసుకోండి. అది కూడా చూస్తాం అని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల గౌరవాధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ సవాలుచేశారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెను కొనసాగిస్తున్నట్లు, సామాన్య ప్రజలు మరికొన్ని రోజులు ఇబ్బందులు పడక తప్పదని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. త్వరలో బెళగావిలో, కలబుర్గిలో రవాణా ఉద్యోగుల సమావేశాలను నిర్వహిస్తామన్నారు.
విధులకు వస్తేనే చర్చలు: సీఎం
బనశంకరి: ఆర్టీసీ ఉద్యోగులు పట్టువీడి విధులకు రావాలి, ఎవరి మాటలో విని బలిపశువులు కావద్దు అని ముఖ్యమంత్రి యడియూరప్ప సూచించారు. శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ సమ్మె విరమించి విధులకు హాజరయ్యే వరకూ ఆర్టీసీ సంఘాలతో ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రవాణా ఉద్యోగులు పట్టువీడకపోవడం సరికాదన్నారు. మూడురోజుల నుంచి బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారని, ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 6వ వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడం సాధ్యం కాదని మరోసారి స్పష్టంచేశారు. బంద్ వల్ల ఆర్టీసీ మరింత నష్టపోతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment