30 పోలీస్ యాక్టు అమలు
గుంటూరు, (పట్నంబజారు): పుష్కరాలను పురష్కరించుకుని అర్బన్ జిల్లా పరిధిలో గురువారం నుంచి 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. యాక్ట్ ప్రకారం రాస్తారోకోలు, ర్యాలీలు, ప్రదర్శనలు, సభలు, సమావేశాలు వంటివి నిర్వహించేందుకు అనుమతి ఉండదన్నారు. ఏదైనా నిర్వహించాలంటే తప్పనిసరిగా చట్టప్రకారం పోలీసులను అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పుష్కరాల్లో భాగంగా ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని పోలీసులకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దీనికి విరుద్ధంగా ఎవరూ వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా ఇబ్బంది కలిగితే తక్షణమే డయల్ 100కు గానీ, దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్‌లో గానీ సమాచారాన్ని అందించాలని సూచించారు. అన్ని పోలీసు స్టేషన్‌ల పరిధిలోని అనుమానితులు, నేరస్తులు, బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.