proceeding
-
ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య వివాదంలో కీలక పరిణామం
సాక్షి, జనగామ జిల్లా: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య వేధింపుల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రామాభివృద్ధికి 25 లక్షలు మంజూరు చేస్తూ ఎమ్మెల్యే రాజయ్య ప్రొసీడింగ్ లెటర్ ఇవ్వడంతో సర్పంచ్ నవ్య.. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమక్షంలో రాజయ్య ఇచ్చిన ప్రొసీడింగ్ లేఖ చూపించి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. రాజకీయాలు వేరు.. వ్యక్తిగత జీవితం వేరంటూ ప్రస్తుతం ఎమ్మెల్యే మంజూరు చేసిన రూ.25 లక్షలు గ్రామాభివృద్ధికే ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వద్ద తన భర్త తీసుకున్న ఏడు లక్షలు ఏదైనా అమ్మి తిరిగి ఇచ్చేయాలని భర్తకు ఆల్టిమేటం ఇచ్చారు. తల తాకట్టు పెట్టైన ఏడు లక్షలు భర్త తిరిగి చెల్లించాల్సిందేనని సూచించారు. నిజాయితీగా ఎమ్మెల్యే వేధింపులపై పోరాటం కొనసాగిస్తానని, ఆధారాలతో మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తానని నవ్య చెప్పారు. చదవండి: ఎమ్మెల్యే రాజయ్యపై నవ్య ఆరోపణలు.. కడియం కీలక వ్యాఖ్యలు -
30 పోలీస్ యాక్టు అమలు
గుంటూరు, (పట్నంబజారు): పుష్కరాలను పురష్కరించుకుని అర్బన్ జిల్లా పరిధిలో గురువారం నుంచి 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. యాక్ట్ ప్రకారం రాస్తారోకోలు, ర్యాలీలు, ప్రదర్శనలు, సభలు, సమావేశాలు వంటివి నిర్వహించేందుకు అనుమతి ఉండదన్నారు. ఏదైనా నిర్వహించాలంటే తప్పనిసరిగా చట్టప్రకారం పోలీసులను అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పుష్కరాల్లో భాగంగా ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని పోలీసులకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దీనికి విరుద్ధంగా ఎవరూ వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా ఇబ్బంది కలిగితే తక్షణమే డయల్ 100కు గానీ, దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్లో గానీ సమాచారాన్ని అందించాలని సూచించారు. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని అనుమానితులు, నేరస్తులు, బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.