రహదారులకూ ‘అవినీతి’ మరకలు | Corruption stains on Puskara roads | Sakshi
Sakshi News home page

రహదారులకూ ‘అవినీతి’ మరకలు

Published Fri, Sep 2 2016 7:34 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

రాళ్లు తేలుతున్న సిమెంటు రోడ్డు - Sakshi

రాళ్లు తేలుతున్న సిమెంటు రోడ్డు

* జిల్లాలో దాదాపు రూ.300 కోట్లకు పైగా పనులు
అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో నిర్వహణ
కాంట్రాక్టుల కోసమే అన్నట్టు మంజూరు
పుష్కరాలు పూర్తయ్యేసరికి దెబ్బతిన్న రోడ్లు
నగరంలో అసంపూర్తిగా రోడ్ల పనులు
 
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలో నిర్మించిన రోడ్ల పనుల్లో అవినీతి పగుళ్ల రూపంలో బట్టబయలవుతోంది. పనుల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, విజిలెన్స్‌ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నామని పదేపదే చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటల య్యాయి. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఘాట్‌ల అనుసంధానం కోసం లింక్‌ రోడ్లు, భవన నిర్మాణాలకు సంబంధించి దాదాపు 100 పనులను రూ.66.76 కోట్లతో చేపట్టారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో 83 పనులను రూ.170.37 కోట్లతో పనులు చేశారు. గుంటూరు కార్పొరేషన్‌లో 94 పనులను రూ.40.02 కోట్లతో, తాడేపల్లి మున్సిపాలిటిలో 42 పనులు రూ.18.25, రేపల్లెలో 7 పనులు రూ.కోటితో, మంగళగిరి మున్సిపాలిటీలో నాలుగు పనులు రూ.2 కోట్లతో చేపట్టారు. పనులు హడావుడిగా మంజూరు చేసి పుష్కరాలు ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులు, కాంట్రాక్టర్‌లపై ఒత్తిడి తెచ్చింది. ఎక్కువ శాతం కాంట్రాక్టు పనులు పచ్చ నేతలే దక్కించుకోవటంతో వారు అందివచ్చిన అవకాశాన్ని సద్వినిమోగం చేసుకొన్నారు. నాణ్యతకు తూట్లు పొడిచి, కోట్ల రూపాయల సొమ్మును కొల్లగొట్టారు. ఈ పనుల్లో సైతం చినబాబుకు వాటాలు ఉండటంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోయారు. సిమెంటు పనులు నాసిరకంగా చేసి, కనీసం క్యూరింగ్‌ కూడా చేయలేదు. మట్టి, మెటల్‌ రోడ్లు కనీసం కన్సాలిడేషన్‌ లేకుండా తూతూమంత్రంగా చేయడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కురిసిన వర్షాలకు కొన్ని రోడ్లు కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల రోడ్లపై కంకర తేలింది. కొన్ని రోడ్లు పగిలిపోయాయి. గుంటూరు నగరంలో డ్రెయిన్‌లు, కాలువలు, రోడ్లు అప్పుడే దెబ్బతింటున్నాయి. నగరంలో ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కంకర వేసి వదిలి వేయడంతో నగర ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. పుష్కరాల్లో రోడ్లు, డ్రెయిన్‌లు, సిమెంట్‌ రోడ్డు పనులకు దాదాపు రూ.300 కోట్ల పనులు చేపట్టారు. పనుల్లో నాణ్యత డొల్లతనం కొట్టొచ్చినట్టు కనపడుతోంది.
 
లింక్‌ రోడ్ల పేరుతో...
పల్నాడు ప్రాంతంలో కాంట్రాక్టు పనుల కోసమే అన్నట్లు కోట్ల రూపాయల పనుల్లో తెలుగు తమ్ముళ్లు దోచుకున్నారు. దాచేపల్లి మండలంలోని రామాపురంలో రూ.1.05 కోట్లతో వేసిన సిమెంట్‌ రోడ్డు పగుళ్లు వచ్చింది. అద్దంకి హైవే నుంచి పొందుగలకు వేసిన రోడ్డు ప్రస్తుత వర్షాలకు కోతకు గురైంది. రూ.1.20 కోట్లలో నిర్మించిన చెన్నాయపాలెం రోడ్డు దుస్థితీ అంతే. గురజాల నుంచి దైదకు రూ.3.20 కోట్లతో వేసిన రోడ్డు అంతంతమాత్రంగానే ఉంది. అమరావతిలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో దాదాపు రూ.4 కోట్లతో అప్రోచ్‌ రోడ్లను తూతూమంత్రంగా వేశారు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ధరణికోట నుంచి సత్తెనపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్టును అనుసంధానం చేసేందుకు రూ.1.90 కోట్లతో వేశారు. అమరావతిలో పుష్కర ఘాట్‌లను అనుసంధానిస్తూ రూ.కోటితో, ధ్యానబుద్ధ ఘాట్‌ వద్ద రూ.50 లక్షలతో రోడ్లు వేశారు. కొల్లూరు, కొల్లిపర మండలాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెనుమూడి–రేపల్లె రోడ్డు హడావుడిగా రూ.4 కోట్లతో చేశారు. పెనుమూడిలో వీఐపీ ఘాట్‌ రోడ్డు, మైనేనిపాలెం అప్రోచ్‌ రోడ్డు పనులు నాసిరకంగా చేశారు. ఇలా జిల్లాలో జరిగిన పుష్కర రోడ్డు పనులు అవినీతికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మొత్తం పనులపై విజిలెన్స్‌ బృందాలతో తనిఖీలు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement