నట్టేట మునిగిన నాణ్యత
నట్టేట మునిగిన నాణ్యత
Published Sat, Sep 17 2016 4:35 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
* ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణాల్లో అక్రమాలు
* రోజుల వ్యవధిలోనే దెబ్బతింటున్న వైనం
* రూ.కోట్ల నిధులు తారుమారు
కృష్ణా పుష్కరాల్లో భాగంగా కొల్లూరు మండలంలో చేపట్టిన ఆర్‌అండ్‌బీ రహదారుల నిర్మాణంలో నాణ్యత నట్టేట కలిపేశారు. మండల వ్యాప్తంగా రూ.15.30 కోట్లతో చేపట్టిన పనులు బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. ఏ ఒక్క రహదారీ మన్నికగా లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పనులు దక్కించుకున్న టీడీపీ నేతలు తమ ఇష్టానుసారంగా రోడ్ల నిర్మాణాలు చేపట్టి బిల్లులు తీసుకొని చేతులు దులుపేసుకున్నారు.
కొల్లూరు: పవిత్ర కృష్ణా పుష్కరాల మాటున టీడీపీ నేతలు సాగించిన అక్రమాల డొంక రోజుల వ్యవధిలోనే బట్టబయలైంది. మండలంలో రూ. 15.30 కోట్లతో నిర్మించిన రహదారుల్లో నాణ్యతకు మంగళం పాడి కాంట్రాక్టర్లు తమ జేబులు నింపుకున్నారన్న విషయం రహదారుల దుస్థితి చూస్తే బహిర్గతమవుతుంది. రోజుల వ్యవధిలోనే రూ. 5.69 కోట్లతో నిర్మించిన కొల్లూరు–గాజుల్లంక, పెసర్లంక– కొత్తూరులంక రహదారులు దెబ్బతిన్నాయి. తాజాగా మరో రెండు రోడ్లు కాంట్రాక్టర్ల అవినీతికి ఛిద్రమై ఎందుకూ పనికిరా>కుండా పోతున్నాయి. ఏ ఒక్క రోడ్డూ నిర్మాణంలోనూ నాణ్యత పాటించకపోవడంతో రహదారులు నిర్మించి ప్రయోజనం లేకుండా పోయింది. రహదారులపై తారు లేయర్‌లు తొలగిపోవడం, అంచుల వెంబడి బీటలు వారడం, రహదారి కుంగిపోవడం వంటి లోపాలు బహిర్గతమయ్యాయి. రూ. 3.15 కోట్ల వ్యయంతో కొల్లూరు–కొల్లిపర మండలాల నడుమ 8.12 కిలోమీటర్ల పొడవున చేపట్టిన రహదారి నిర్మాణం, మరమ్మతులు కాంట్రాక్టర్ల అక్రమాలకు వేదికగా మారాయి.
నెలలోనే అధ్వానం..
ఈపూరు నుంచి చిలుమూరు మధ్య నూతనంగా నిర్మించిన రహదారి పొడవునా తారు తొలగిపోయి రోడ్డు ఎందుకూ పనికిరాకుండా పోయింది. కనీసం 15 ఏళ్ల పాటు మన్నాల్సిన బీటీ రోడ్డు నెల రోజుల వ్యవధిలో అధ్వాన స్థితికి చేరడం పనుల్లో ఏమేరకు ప్రమాణాలు పాటించారో తేటతెల్లమవుతుంది. కొల్లూరు వద్ద చేపట్టిన రోడ్డు అంచుల పటిష్టత మట్టితో చేపట్టాల్సి ఉండగా ఇసుకతో తూతూ మంత్రంగా ముగించారు. దీంతో అంచులు కోతకు గురై రోడ్డు దెబ్బతినే ప్రమాదం ఉంది.
కాంట్రాక్టర్ కక్కుర్తి...
రూ. 3.15 కోట్లు వెచ్చించి నిర్మించిన గాజుల్లంక–చింతమోటు రహదారి నిర్మాణంలో కాంట్రాక్టర్ల కక్కుర్తి కారణంగా రహదారి పాడై పాత రోడ్డులా తయారవుతుంది. పోతార్లంక సమీపంలో రోడ్డు పగుళ్ళిచ్చి కుంగిపోయింది. కిష్కిందపాలెం–తడికలపూడి మధ్యలో సైతం రోడ్డు అంచుల్లో తారు పొరలు తొలగిపోవడం, అంచులు పగిలిపోవడం పనుల జరిగిన తీరుకు అద్దం పడుతుంది. రూ. 3.31 వ్యయంతో 6 కిలోమీటర్ల నిర్మించిన తెనాలి–వెల్లటూరు మార్గంలో సైతం లోపాలు బహిర్గతమవుతున్నాయి. క్రాప అడ్డరోడ్డు రోడ్డు అంచులు కుంగి బీటలువారాయి. లోపాలను కప్పిపుచ్చుకునేందుకు అతుకులతో సరిపెట్టారు. పనులు పూర్తవ్యకముందే బిల్లులు చెల్లించి తమ వాటాలు అందుకున్న విశ్వాసాన్ని అధికారులు ప్రదర్శిస్తున్నారు.
డీఈ దృష్టికి తీసుకెళ్ళండి..
రహదారుల దుస్థితి, నాణ్యతా ప్రమాణాలపై ఆర్ అండ్ బీ ఈఈ పకీర్‌బాబును సాక్షి వివరణ కోరగా డీఈ దృష్టికి తీసుకువెళితే అయన ఆ వ్యవహారం ఏమిటో చూస్తారని పేర్కొన్నారు.
– పకీర్‌బాబు, ఈఈ
Advertisement