పుష్కరాల్లోనూ ప్రచార ఆర్భాటం
పుష్కరాల్లోనూ ప్రచార ఆర్భాటం
Published Tue, Aug 16 2016 5:44 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
* టీడీపీ నేతల ఫ్లెక్సీ విరిగి ఇద్దరికి గాయాలు
* పూజా సామగ్రి బ్యాగులపైనా సీఎం ఫొటోలు
* భక్తుల విమర్శలు
అమరావతి (గుంటూరు రూరల్) : తెలుగుదేశం పార్టీ నాయకుల అత్యుత్సాహం అమరావతిలో కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు శాపంగా మారింది. టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గాలికి పడిపోయి ఇద్దరికి తీవ్రగాయాలు కాగా వారిని పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి పంపిన సంఘటన సోమవారం అమరావతిలోని ధ్యానబుద్ధ ఘాట్ సమీపంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన పూసల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి అమరావతిలోని ధ్యానబుద్ధ ఘాట్‌లో పుణ్య స్నానం చేశారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేసి దైవసన్నిధిలో దేవుని దర్శించుకుని ఇంటికి బయలుదేరారు. ఘాట్‌నుంచి బయటకు వచ్చిన తరువాత బస్‌ల కోసం కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై నిలబడ్డారు. అదే సమయంలో గాలి తీవ్రంగా వీయటంతో ఒక్కసారిగా ఘాట్‌కు వెళ్లే మార్గంలో స్థానిక టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన ముఖ ద్వారం ఫ్లెక్సీ విరిగి రోడ్డు పక్కేనే నిలబడి ఉన్న భక్తులపై పడింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు, ఆయన కుమారుడు నవీన్‌కు తలకు ఫ్లెక్సీ రేకులు గీసుకుని గాయాలయ్యాయి. అక్కడే డ్యూటీ చేస్తున్న పోలీసులు అప్రమత్తమై సమీపంలోని ప్రథమ చికిత్స కేంద్రానికి బాధితులను తీసుకెళ్లారు. వైద్య చేయించి వెంటనే వెళ్లిపోవాలని చెప్పి ఆటోలో గుట్టు చప్పుడు కాకుండా తరలించారు. దీంతో బాధితుడు గ్రామశివారులోని పుష్కరనగర్‌లో బస్‌ఎక్కి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది వెళ్లినట్లు తెలిసింది.
పిండ ప్రదానం, పూజా సామగ్రికీ పార్టీ రంగు...
భక్తులు పితృదేవతలకు పెట్టే పిండ ప్రదాన సామాగ్రి నుంచి అమ్మవారికి పూజలు చేసుకునే పూజా సామాగ్రి వరకూ ప్రతి విషయానికి చంద్రబాబు స్తుతి సూక్తులతో కూడిన పార్టీ ప్రచార రంగును పులిమారు. చంద్రబాబునాయుడు ఫొటో ముద్రించిన∙సంచుల్లో పిండ ప్రదాన వస్తువులను పెట్టి విక్రయిస్తున్నారు.
చంద్రబాబు స్తుతి గీతాలు....
ఘాట్‌ల నిండా పార్టీ రంగులతో చంద్రబాబు, లోకేష్ ఫొటోలతో బెలూన్‌లను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎక్కడ చూసినా పుష్కరాలకు చెందిన ప్లెక్సీలను ఎక్కడా ఏర్పాటు చేయక పోగా టీడీపీ నాయకుల ప్లెక్సీలను మాత్రం వీధి వీధిలో ఏర్పాటు చేశారు. ప్రతి విద్యుత్ పోలుకు మైకులను ఏర్పాటు చేశారు. పవిత్ర పుష్కరాలలో దేవుని గీతాలను భక్తులకు వినిపించాల్సింది పోయి నిత్యం చంద్రబాబు స్తుతి గీతాలు, పార్టీ పాటలను వినిపిస్తూ భక్తులకు విసుగు తెప్పించారు. ఆలయాల్లో దేవుని గీతాలు వినిపిస్తారు కానీ పార్టీ గీతాలు ఏర్పాటు చేశారేంటని భక్తులు విస్మయం చెందారు.
Advertisement
Advertisement