పుష్కరాలకు సర్వం సిద్ధం
జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే
సీతానగరం (తాడేపల్లి రూరల్) : రానున్న పుష్కరాలకు సర్వం సిద్ధం చేశామని, అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం అహర్నిశలూ కష్టపడుతోందని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ఏర్పాటు చేస్తున్న మినీ పార్కును పరిశీలించేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నాలుగు కిలోమీటర్ల పొడవునా 72 ఘాట్‌ల నిర్మాణం పూర్తయిందని, వీటిని ఏ, బీ, సీ, డీ ఘాట్లుగా గుర్తించామన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అమరావతి, ధరణికోట, తాళ్లాయపాలెం, సీతానగరం, పెనుమూడి ఘాట్లకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా అని, గుంటూరు నగర శివారులో లక్ష మంది భక్తులకు వసతి కోసం గోరంట్ల రోడ్డులో ఒకటి, విజయవాడ రోడ్డులో మరొకటి పుష్కర నగర్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వాటిలో భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. దీనికి అనుసంధానంగా ప్రతి పుష్కరఘాట్‌కు సమీపంలో ఐదారు పుష్కర నగర్లు ఏర్పాటు చేసి 25 వేల మందికి వసతి ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతోపాటు పుష్కర నగర్ నుంచి ఘాట్లకు వచ్చే భక్తులకు ఎటువంటి రుసుం వసూలు చేయకుండా ప్రయాణం చేసే విధంగా వసతులు కల్పించినట్టు వివరించారు.