రద్దీకి అనుగుణంగా ‘రైల్వే’ సేవలు
Published Thu, Aug 11 2016 7:29 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
గుంటూరు (నగరంపాలెం) : కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికుల రద్దీకి అనుగుణంగా గుంటూరు రైల్వే డివిజన్‌లో అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ విజయశర్మ తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లోని వీఐపీ లాంజ్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 11 నుంచి 23 వరకు డివిజన్ మీదుగా 73 రిజర్వ్‌డ్ క్లాస్, 72 అన్ రిజర్వ్‌డ్ క్లాస్ రైళ్ళు మొత్తం 145 ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నామన్నారు. డివిజన్ పరిధిలోని 26 రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు రెండు, ప్యాసింజర్ రైళ్ళకు 936 అదనపు బోగీలు ఏర్పాటు చేశామనిచెప్పారు. కృష్ణా నది సమీప ప్రాంతాల్లోని విష్ణుపురం, పొందుగల, పెదకూరపాడు, గుంటూరు, మంగళగిరి, రేపల్లె రైల్వే స్టేషన్‌లలో అన్ని రైళ్ళకు తాత్కాలిక హాల్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించటానికి బాత్ రూమ్స్, మంచి నీటి పంపులు, క్లోక్ రూంలు, పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా రెస్ట్ రూంలు, ప్రధమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ టిక్కెట్ వాహనం, అదనపు బుకింగ్ కౌంటర్లు సాధారణ టిక్కెట్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించటానికి డివిజన్‌లో మొదటిసారిగా స్నానఘాట్‌లు, పుష్కరనగర్‌ల వద్ద అన్ రిజర్వ్‌డ్ టిక్కెట్‌లు జారీ చేయటానికి రెండు బుకింగ్ కౌంటర్లు కలిగిన మొబైల్ వాహనం సిద్ధం చేశామని తెలిపారు. పుష్కర రైల్వే స్టేషన్‌లలో తాత్కాలికంగా అదనపు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఆర్‌పీఎఫ్ సిబ్బంది రైల్వే పోలీసులు సమన్వయంతో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని వివరించారు. యాత్రికులు రైల్వే శాఖ కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకోవాలని కోరారు. ఏడీఆర్‌ఎం వినయ్ అంబాడే, సీనియర్ డీసీఎం కె ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement