సాక్షి, హైదరాబాద్: రైలు బోగీల పరిశుభ్రత, ఇతర నిర్వహణకు సంబంధించిన ఆన్‌బోర్డు సేవలు సరిగా లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోంది. బోగీల్లో చెత్తా చెదారం పేరుకుపోవడం, ప్రయాణికులు తిని వదిలేసిన, పడేసిన తినుబండారాల వల్ల ఎలుకలు, బొద్దింకలు వంటివి పెరిగిపోతున్నాయి.
విద్యుత్ వైర్లను ఎలుకలు కొరికేయడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఒకట్రెండు సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి కూడా. బోగీల్లో ఎలుకలు, బొద్దింకలపై ప్రయాణికులు తరచూ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నా అధికారుల్లో చలనం లేదనే విమర్శలు వస్తున్నాయి.
కోవిడ్ తర్వాత ఆన్‌బోర్డు సేవలు దెబ్బతిని
కోవిడ్ సమయంలో కొన్ని నెలలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అన్ని రకాల ప్రయాణికుల సేవలకూ బ్రేక్ పడింది. తర్వాత దశలవారీగా రైళ్లన్నీ పట్టాలెక్కినా.. ఆన్ బోర్డు సేవలను అందజేసే ప్రైవేట్ సంస్థలతో పూర్తిస్థాయి ఒప్పందాలు మాత్రం కుదుర్చుకోలేదు.
ఒప్పందం చేసుకున్న పలు కాంట్రాక్టు సంస్థలు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయక బోగీల నిర్వహణ అధ్వానంగా మారుతోందని.. దీనితో కొన్ని రైళ్లలో ఆన్‌బోర్డు సేవలు సరిగా అందడం లేదని, చాలా రైళ్లలో ఇటీవలివరకు బెడ్‌రోల్స్‌ను కూడా అందజేయలేకపోయారని అధికారులు చెప్తున్నారు.
తరచూ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు
గతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉండగానే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు బోగీల్లో మంటలు వచ్చాయి. మరోసారి సికింద్రాబాద్ స్టేషన్‌లోనే చెన్నైకి వెళ్లే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా షార్ట్‌సర్క్యూట్ జరిగి బోగీలు దెబ్బతిన్నాయి. నాంపల్లి స్టేషన్‌లో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఇదే తరహా ప్రమాదానికి గురైంది. తాజాగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోనూ ఐదు బోగీలు కాలిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment