వయసులో చిన్న... సేవలో మిన్న
భక్తుల సేవలో తరిస్తున్న విద్యార్థులు
వయసులో చిన్న అయినా... వారు సేవలో మిన్న... పుష్కరాలకు వచ్చిన భక్తులు... అందునా ముఖ్యంగా వృద్ధులకు వారు సొంత మనవళ్లు, మనవరాళ్లలా ఎంతో ఆప్యాయంగా సేవలందిస్తున్నారు. వికలాంగులకు ఊతకర్ర అవుతున్నారు. వ్యాధిగ్రస్తులకు నైటింగేళ్లవుతున్నారు. రెడ్‌క్రాస్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, రామకృష్ణ మిషన్ వంటి సంస్థలకు చెందిన విద్యార్థులకు వారి సేవాభావాన్ని నిరూపించుకునేందుకు 12 ఏళ్లకు వచ్చే పుష్కరాల్లో ఈ 12 రోజులు ఒక అవకాశంగా మారాయి.
పట్నంబజారు : గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు అనేక జిల్లాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు చేస్తున్న సేవలు కృష్ణా పుష్కరాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు రోహిణి కళాశాలకు చెందిన 80 మంది విద్యార్థులు ధ్యానబుద్ధ, అమరేశ్వర ఘాట్‌లో వీల్‌చైర్లలో సుమారు కిలో మీటరు దూరం నుంచి వృద్ధులు, వికలాంగులను ఘాట్ వద్దకు చేరుస్తూ..తిరిగి ఉచిత బస్సులు నిలిచే దుర్గా విలాస్ హోటల్ వరకు వదలిపెడుతున్నారు. ఘాట్లలో భక్తులకు సహాయ సహాకాలు అందిస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో గుంటూరులోని బండ్లమూడి హనుమాయమ్మ కళాశాల (బీహెచ్)కు విద్యార్థినులు భక్తుల సేవల్లో పాలుపంచుకుంటున్నారు. రామకృష్ణ హిందూ హైస్కూల్లో 35 మంది విద్యార్థినులు నిత్యం వచ్చే వేలాది మంది ఉదయం సమయంలో అల్పాహార కార్యక్రమం నుంచి రాత్రి భోజన కార్యక్రమం వరకు వడ్డన చేయటంతో పాటు...ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అమరేశ్వరుని ఆలయంలో క్యూలైన్లలో భక్తులకు తాగునీటి సౌకర్యం, తదితర సేవలు చేపడుతున్నారు. స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు పిల్ల పోలీసుల్లా అమరావతిలో భక్తుల నియంత్రణలో కీలకపాత్ర వహిస్తున్నారు. సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవలు అందించేందుకు వచ్చిన విద్యార్థులు వీపునకు నీటి డబ్బాను తగిలించుకుని పుష్కర ప్రాంగణంలో పాదచారులకు, భక్తులకు తాగునీటిని అందించడంతో పాటు, ఈ సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత భోజన కార్యక్రమంలో విశేషంగా పాటుపడుతున్నారు. ఉచిత క్లోక్ రూం వద్ద కూడా వారు సేవలు అందిస్తున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా మండుటెండల్లో సైతం సేవలు అందిస్తున్న విద్యార్థులను అభినందించి తీరాల్సిందే.