పుష్కరాలకు కృష్ణమ్మ పరవళ్లు
కృష్ణా పరీవాహక ఘాట్లకు నీటి విడుదల
ఆరు టీఎంసీలు.. వారం పాటు కొనసాగే అవకాశం
మాచర్ల: కృష్ణా బోర్డు ఉత్తర్వులతో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాగర్ రిజర్వాయర్ నుంచి సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 3844 క్యూసెక్కుల నీటిని డెల్టాలోని పరీవాహక ప్రాంతానికి విడుదల చేశారు. దీంతో కృష్ణా పరివాహక ప్రాంతమైన ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి రెండు వైపులా పుష్కరఘాట్‌లకు నీరు అందుతోంది.
తీరిన నీటి సమస్య..
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద నీరు జూరాల నుంచి వస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు రోజురోజుకూ నీటిమట్టం పెరుగుతుండటం, మూడు రోజుల్లో పుష్కరాలు ప్రారంభమతున్నందున డెల్టాకు 6 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. దీనికి స్పందించిన బోర్డు 6 టీఎంసీల నీటిని సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. సాగర్ రిజర్వాయర్ నుంచి డెల్టాకు నీటి విడుదల వారం రోజులకు పైగా కొనసాగే అవకాశం ఉండటంతో డెల్టా ప్రాంత పరిధిలోని రెండు వైపులా పుష్కరఘాట్‌లకు నీటి సమస్య పరిష్కారమైంది. భక్తులు ఆందోళన చెందుతున్న సమయంలో ఆల్మటి నుంచి అన్ని ప్రాజెక్టులకు నీరు చేరి శ్రీశైలం రిజర్వాయర్ 860 అడుగులకు చేరుకోవడంతో పుష్కరఘాట్‌లకు నీటి సమస్య లేకుండా సాగర్ రిజర్వాయర్ నుంచి డెల్టా ద్వారా నీటి విడుదల ప్రారంభం కావడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. సాగర్ రిజర్వాయర్ నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 509 అడుగులకు చేరింది. ఇది 124 టీఎంసీలకు సమానం.