తుదిదశలో పుష్కర ఏర్పాట్లు
తుదిదశలో పుష్కర ఏర్పాట్లు
Published Wed, Aug 10 2016 8:08 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM
తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక క్యూలైన్లు
సందర్శనార్థం ఎనిమిది నమూనా దేవాలయాలు
పుష్కరనగర్‌లలో షెడ్ల ఏర్పాటు
అమరావతి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతిలో పుష్కరాల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. శుక్రవారం పుష్కరాలు ప్రారంభం కానుండగా ధ్యానబుద్ధ ఘాట్‌లో కాంక్రీట్‌పనులతో పాటు టైల్స్ వేయటం కూడా పూర్తిచేశారు. ధ్యానబుద్ధునికి ప్రత్యేకంగా విద్యుత్ లైటింగ్‌తో అలంకరణ చేశారు. ఘాట్‌లో ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ప్రత్యేకంగా కూలైన్‌లు ఏర్పాటు చేశారు. భక్తులు లోతుకు వెళ్లకుండా ప్రత్యేకంగా మెష్ ఏర్పాటు చేశారు. ఈఘాట్‌లోనే కొంత భాగాన్ని వీఐపీ ఘాట్‌గా చేశారు. భక్తులు పుష్కరస్నానం చేశాక వివిధ పుణ్యక్షేత్రాల దేవతామూర్తులను దర్శించుకునేందుకు ఎనిమిది నమూనా దేవాలయాలు దాదాపుగా పూర్తయ్యాయి. తిరుపతి, అయినవెల్లి, నెమలి, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గదేవాలయం, కాణిపాకం, సింహాచలం, ఒంటిమిట్ట దేవాలయాల నమూనాలను నిర్మించారు.
అమరేశ్వర దేవస్థానం వద్ద...
అమరేశ్వర దేవస్థానం వద్ద ఘాట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈఘాట్‌లో తాత్కాలిక మరుగుదొడ్లు, పిండ ప్రధాన షెడ్లు వేశారు, అమరేశ్వరాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దేవాలయంలో క్యూలైన్‌లు, సమాచార బోర్డులు, కౌంటర్‌లు ఏర్పాటు చేశారు. ఇక విజయవాడ, సత్తెనపల్లి రోడ్లలో ఏర్పాటు చేసిన పుష్కరనగర్‌లలో 3000మందికి సరిపడా షెడ్లు, గుంటూరు రోడ్డులోని పుష్కరనగర్‌లో 10వేల మందికి సరిపడా షెడ్లు వేశారు. ఇక్కడ తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రవిసర్జన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల తాగునీటి కోసం ప్రత్యేకంగా బోర్లు వేసి మినరల్ వాటర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రసిద్ధమెన వంటకాలతో పర్యాటక శాఖ నిర్వహించే ఆహార ప్రదర్శనశాలకు, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటుకు షెడ్లు సిద్ధం చేశారు. ఘాట్‌లలో, మెయిన్ రోడ్లలో విద్యుత్ లైట్లను, మెయిన్ రోడ్డులో డివైడర్‌పై రంగురంగు విద్యుత్ బల్పులను, ఘాట్‌లలో హైమాస్ట్ లైట్‌లు అమర్చారు. గురువారం పుష్కరఘాట్‌లను అగ్నిమాపకశాఖ వారిచే శుభ్రం చేయించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement