ప్రచార ఆర్భాటానికి రూ.కోట్ల ఖర్చు
-
పుష్కర పనుల్లో అవినీతి
-
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిరెడ్డి ధ్వజం
-
చంద్రబాబు సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
గుంటూరు (పట్నంబజారు): కేవలం ప్రచారార్భాటాల కోసం పవిత్ర కృష్ణా పుష్కరాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు సర్కార్ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ఖర్ఛు చేసిన నిధులు, అభివృధ్ధి పనులపై తక్షణమే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు అరండల్‌పేటలోని పార్టీ నగర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుష్కరాల కోసం రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తే, 2 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించి, పిండ ప్రదానాలు చేశారని, అంటే ఒక్కొక్క మనిషి కోసం రూ.1000 ప్రభుత్వం వెచ్చించిందా అని ప్రశ్నించారు. శాశ్వత నిర్మాణాల కోసం ప్రభుత్వం అన్ని వేల కోట్లు ఖర్చు చేస్తే తాము కూడా హర్షించేవారమన్నారు. అవకతవకలు జరిగాయని మీడియాలో ఘోషిస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వేలాది కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు సర్కార్ ప్రత్యక్షంగా, పరోక్షంగా 22 మంది మృతికి కారణమైందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రూ.800 కోట్లతో పుష్కరాలను నిర్వహిస్తే, ఇక్కడికంటే అధికంగా 5 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారని, ఏ ఒక్క ప్రమాదం జరలేదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. పుష్కరాలను సైతం రాజకీయ వేదికగా మార్చుకుని గంటల కొద్దీ ప్రసంగాలు చేయడం హాస్యాస్పదమన్నారు. భక్తులను పోలీసులతో నిర్బంధించి, ఎటువైపు కదలనివ్వకుండా నిలువరించి ప్రసంగాలు చేశారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము) రేపల్లె నియోజకవర్గ గడపగడపకు వైఎస్సార్ పరిశీలకుడు మోదుగుల బసవపున్నారెడ్డి, మైనారిటీ విభాగం గుంటూరు నగరాధ్యక్షుడు షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు.