కృష్ణమ్మకు అడ్డుకట్ట
కృష్ణమ్మకు అడ్డుకట్ట
Published Tue, Aug 9 2016 7:20 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
కనకదుర్గ వారధి వద్ద నదిలో
క్రాస్‌బండ్ నిర్మాణం
దిగువకు నీరు ప్రవహించకుండా ఏర్పాట్లు
విజయవాడలో నీరు పుష్కలంగా చూపేందుకు యత్నం
సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాలు దగ్గరకొచ్చేశాయి. కృష్ణమ్మ ఒడిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు సన్నద్ధమవుతున్నారు. అయితే పవిత్ర పుష్కర స్నానానికి భంగం వాటిల్లేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పులిచింతల నుంచి బ్యారేజీకి విడుదల చేస్తున్న నీరు తక్కువగా ఉంది. ఆ నీటిని బ్యారేజీ వద్ద జలకళ ఉట్టిపడేలా చేయటం కోసం కిందికి వదలకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందకుగాను కనకదుర్గ వారధి వద్ద అధికారులు క్రాస్‌బండ్ నిర్మిస్తున్నారు. నదిలో నీటిమట్టం పెరిగే క్రమంలో అడ్డుకట్ట వేయడం అనాలోచిత చర్యని భక్తులు పేర్కొంటున్నారు.
నీరు ఉందని చూపేందుకే..
కృష్ణానదిలో పవిత్ర స్నానాలకు ఆశించినస్థాయిలో నీరు కనిపించడం లేదనే ఉద్దేశంతోనే అడ్డుకట్ట నిర్మిస్తున్నామని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. అడ్డుకట్ట కారణంగా విజయవాడ పరిధిలోని ఘాట్లు నీటితో కళకళలాడుతాయని వారు భావిస్తున్నారు. పుష్కరాలకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం 153 పుష్కర ఘాట్లు సిద్ధమవుతున్నాయి. 12 రోజులపాటు జరుగనున్న కృష్ణా పుష్కరాల్లో పవిత్ర స్నానాల కోసం వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తులు స్నానాలు ఆచరించేందుకు సరిపడా నీటిని నిల్వ చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
కలుషిత నీటిలో స్నానాలు ఎలా?
ప్రభుత్వ చర్యతో పవిత్ర స్నానానికి భంగం వాటిల్లే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. నదిలో నీరు ప్రవహిస్తుంటే అందులో స్నానం చేయడం అనారోగ్యకరమని, అడ్డుకట్ట వేస్తే నీరు కలుషితమయ్యే ప్రమాదముందని పేర్కొన్నారు. దుర్గాఘాట్, కృష్ణవేణి ఘాట్, సీతానగరం ఘాట్ వద్ద రోజుకు 3 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసే అవకాశం ఉంది. మొదటి సారి స్నానం చేసే భక్తులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురుకాకపోయినా.. ఆ తరువాత పవిత్ర స్నానాలు చేయదలచిన భక్తులు మాత్రం కలుషిత నీటిలోనే చేయాల్సి ఉంటుంది. కలుషిత నీటిలో స్నానాలు చేసిన భక్తుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కింది భాగంలో ఉన్న ఘాట్లకు నీరెలా?
ప్రకాశం బ్యారేజీ కింది భాగంలో ఉన్న కృష్ణా, సీతానగరం ఘాట్ కాకుండా సుమారు 30 పుష్కర ఘాట్లు ఉన్నాయి. ఈ ఘాట్ల వద్ద రోజుకు కనీసం అంటే 50 వేల మంది భక్తులు పవిత్రస్నానాలు చేసే అవకాశం ఉందిని అధికారుల అంచనా. కనకదుర్గ వారధి వద్ద నీటికి అడ్డుకట్ట వేయటంతో కింది భాగంలో ఉన్న 30 ఘాట్లకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. నీరు లేకుంటే ఆ ఘాట్లకు వెళ్లే భక్తుల పవిత్ర స్నానాలు ప్రశ్నార్థకంగా మారతాయి. అలాంటప్పుడు కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ఘాట్లు ఏర్పాటు చేయటం ఎందుకని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement