భద్రతే ప్రామాణికం
ప్రొఫెసర్ ప్రసన్నకుమార్ సూచన
పుష్కర ఏర్పాట్లపై సమీక్ష
గుంటూరు మెడికల్ : యాత్రికుల భద్రతే ప్రామాణికంగా పుష్కరాల్లో అధికారులు సమర్థంగా పనిచేయాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రొఫెసర్ డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ తెలిపారు. గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో కలెక్టర్ కాంతిలాల్ దండే అధ్యక్షతన శనివారం అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులతో పుష్కరాల ఏర్పాట్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ పుష్కరాల్లో ఉద్యోగులు నిర్వహించాల్సిన విధులు, యాత్రికుల పట్ల వ్యవహరించాల్సిన తీరు గురించి మాట్లాడారు. ఘాట్ల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలని, పోలీస్, అగ్నిమాపక శాఖలదే కీలకపాత్ర అన్నారు. పుష్కర ఘాట్‌లను మరోసారి పరిశీలించి లోపాలుంటే సవరించాలని చెప్పారు. ఘాట్ల వద్దకు వచ్చే యాత్రికులకు, స్నానం అయిన తర్వాత వెళ్లే వారికి విడివిడిగా బారికేడ్లు ఏర్పాటుచేయాలన్నారు. ఆగస్టు 12 నుంచి 15వ తేదీ, 18, 21 తేదీలు చాలా ముఖ్యమని, ఆ రోజుల్లో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా అధికారులు జాగ్రత్తగా విధులను నిర్వహించాలని చెప్పారు. ఆర్టీసీ, రైల్వేశాఖ యాత్రికులను చేరవేయడంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైల్వేస్టేçÙన్, బస్టాండ్‌లో యాత్రికుల రద్దీని నియంత్రించేందుకు భద్రత చర్యలు అవసరమని వెల్లడించారు. ఉద్యోగులందరికీ ఘాట్‌ల వారీగా, షిప్టుల వారీగా విధులు కేటాయించాలని ప్రసన్నకుమార్ తెలిపారు. 10వ తేదీ నుంచే పుష్కర విధులకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. యాత్రికులకు వంట చేసుకునే అవకాశాన్ని కల్పించాలని, పుష్కర ఘాట్‌లకు దూరంగా ఉన్న వీధుల్లో ఒకవైపు మాత్రమే వ్యాపారాలు జరిగేలా చర్యలు చూడాలన్నారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ పుష్కరాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.