పుష్కరాల ముసుగులో దోపిడీ
వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి
అచ్చంపేట: గోదావరి, కృష్ణా పుష్కరాల పేరుతో చంద్రబాబు తన కార్యకర్తలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టారని పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్యయకర్త కావటి శివనాగ మనోహరనాయుడు ఆరోపించారు. బుధవారం ఆయన పార్టీ మండల కన్వీనర్ సందెపోగు సత్యం నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు రూ.1800 కోట్లు, కృష్ణా పుష్కరాలకు రూ.1300 కోట్లు వెచ్చించి వేసిన రోడ్లు, దేవాలయాల మరమ్మతులు, çపుష్కరఘాట్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందన్నారు. నియోజకవర్గంలో క్రోసూరు నుంచి అమరావతి, అచ్చంపేట నుంచి ఊటుకూరు వరకు, అచ్చంపేట నుంచి మాదిపాడు వరకు వేసిన రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత లేదన్నారు. పుష్కర ఘాట్ల నిర్మాణాలకు ముందుగా అంచనాలు తయారు చేయకుండా, టెండర్లు పిలవకుండా పైపై పూతలతో దోచుకోవాలని చూస్తే వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. దీనిపై సమాచార హక్కు చట్టం ప్రకారం ఏ ఘాట్‌కు ఎంత వెచ్చించారు, నాణ్యాతా పరమైన సమాచారాన్ని రాబడతామన్నారు. ఎంత వరకు ఖర్చు చేశారో అంతే బిల్లు చేసుకోవాలి తప్ప దోచుకోవాలని చూస్తే విజలెన్స్, క్యాలిటి కంట్రోల్‌కు ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేస్తామన్నారు.