పుష్కరాలకు 1,500 మంది వైద్యసేవలు
24 గంటలు అందుబాటులో వైద్య సేవలు
డీఎంహెచ్‌వో డాక్టర్ పద్మజారాణి
గుంటూరు మెడికల్ : కృష్ణా పుష్కరాలకు వచ్చే వారికి ఏదైనా అనారోగ్యం వస్తే వైద్య సేవలను అందించేందుకు 1,500 మంది వైద్యులు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లను ఆదివారం ఆమె విలేకరికి వివరించారు. సుమారు 5 లక్షల మంది వివిధ రకాల జబ్బులతో బాధపడేవారు పుష్కరాలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఫిట్స్, ఇతర అత్యవసర, ప్రాణాపాయ వైద్య సేవలకు సంబంధించిన అన్ని రకాల మందులను ఘాట్లలో ఏర్పాటు చేసే వైద్య శిబిరాల వద్ద సిద్ధంగా ఉంచారన్నారు. సుమారు 110 రకాల మందులు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. మరో 30 రకాల మందులు రెండు రోజుల్లో వస్తాయన్నారు. ట్రాలీ స్ట్రెక్చర్లు 75, ఫోల్డింగ్ వీల్ చైర్లు 150, సాధారణ వీల్ చైర్లు 50, ఐరన్ కాట్‌లు 150, నెబిలైజర్లు 150, పల్స్ ఆక్సీమీటర్లు 150, సెలైన్ స్టాండ్లు 250 సిద్ధం చేశామని తెలిపారు. సెక్షన్ ఆపరేటర్లు, ఆక్సిజన్ ఫ్లో మీటర్లు, ఈసీజీ మిషన్లు, ఎమర్జన్సీ లైట్లు, బెడ్ సైడ్ స్క్రీన్లు, ఎగ్జామినేషన్ టేబుళ్లు, డెలివరీ కిట్స్ రెండు రోజుల్లో పుష్కరాల ఘాట్లకు సమకూర్చేందుకు ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు. అలాగే, జిల్లాకు చెందిన డాక్టర్లు 80 మంది, నర్సులు 80 మంది, ఫార్మాసిస్టులు 40 మంది, ఏఎన్‌ఎంలు 400 మంది, ఎంపీహెచ్‌ఏలు 200 మంది, ఇతర పారా మెడికల్ సిబ్బంది, వైద్యాధికారులు శిబిరాల్లో సేవలు అందిస్తారని చెప్పారు. వీరితో పాటుగా 68 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు, 78 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 78 మంది స్టాఫ్ నర్సులు, ఇతర జిల్లాల నుంచి డెప్యూటేషన్‌పై రెండు రోజుల్లో వస్తారని ఆమె తెలిపారు. జిల్లాలోని 72‡ఘాట్లలో ఏ–ప్లస్, ఏ కేటగిరి వాటిల్లో 24 గంటలు వైద్య సేవలు అందిస్తారని, ‘బి’ ఘాట్లలో ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు, ‘సి’ ఘాట్లలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.