అమరావతికి భక్త వాహిని
* పెద్ద సంఖ్యలో అమరలింగేశ్వరుని దర్శించుకున్న భక్తులు
* క్రమంగా పెరుగుతున్న రద్దీ
సాక్షి, అమరావతి: పంచారామాల్లో ప్రథమా రామం అమరావతి అమరలింగేశ్వర ఆలయం. దీనికితోడు చల్లని వాతావరణం, ఆహ్లాదపరిచే కృష్ణవేణి ప్రవాహం,శివయ్యకు ప్రీతిపాత్రమైన సోమవారం అన్నీ కలిసి రావడంతో పుష్కర స్నానాలు చేసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మహిళలు కృష్ణమ్మకు పసువు, కుంకుమలు పెట్టి పూజలు చేశారు. పలువురు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. ఎండ వేడిమితో అల్లాడిన భక్తులకు, ఈ రోజు వాతావరణం అనుకూలించడంతో కృష్ణమ్మ చెంతనే ఎక్కువ సేపు సేద తీరారు.ధ్యాన బుద్ధ విగ్రహం దగ్గర పిల్లల ఆటలతో పాటు, సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు. నమూనా ఆలయాల్లో సైతం భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు.
అమరలింగేశ్వరుని దర్శించుకునేందుకు..
కృష్ణమ్మ ఒడిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు, అమరలింగేశ్వరుని దర్శించుకొన్నారు. అమరేశ్వరుని వద్ద క్యూలైన్లు కిటకిటలాడాయి. పోస్టాఫీసు వరకు క్యూలైన్ ఏర్పాటు చేసినా, సగభాగం మాత్రమే షామియానాలు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. వీఐపీ దర్శనానికి గంట, రూ.100 దర్శనం రెండు గంటలు, ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. పుష్కరాల డ్యూటీలకు వచ్చిన ఉద్యోగులు, కొంతమంది పోలీసులు తమ కుటుంబ సభ్యులను వీఐపీ దర్శనానికి పంపడంతో ఉచిత దర్శనానికి ఆలస్యమవుతోంది. ఆలయ అధికారులు వీఐపీల సేవతో తరిస్తూ సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడ్డారు.