కృష్ణవేణి సన్నిధికి భక్త వాహిని
కృష్ణవేణి సన్నిధికి భక్త వాహిని
Published Sat, Aug 13 2016 9:34 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM
* అమరావతిలో పెరిగిన రద్దీ
* ఘాట్ వద్దకు నేరుగా వస్తున్న బస్సులు
* ఘాట్లలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
సాక్షి, అమరావతి: అమరేశ్వరుని సన్నిధిలో భక్త కోటి నదీమ తల్లికి ప్రణమిల్లారు. రెండో రోజు సూర్యోదయానికి ముందు నుంచే భక్తులు అమరావతిలో పుణ్య స్నానాలకు తరలివచ్చారు. మహిళలు, పిల్లలు, పెద్దలు కష్ణవేణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. జ్యోతులు వెలిగించి, కర్పూర హారతులిచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అమరేశ్వరుని ఘాట్‌లో ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా హారతులిస్తున్నారు. అనంతరం అమరేశ్వరుని దర్శించుకొని భక్తులు మొక్కులు తీర్చుకొంటున్నారు. వరుస సెలవులు రావడంతో అమరావతిలో కొద్ది మేర భక్తుల రద్దీ కనిపించింది. బస్సులను నేరుగా ధ్యాన బుద్ధ ఘాట్ వద్దకు అనుమతించడంతో, అక్కడ భక్తుల సందడి పెరిగింది. అమరావతి గుడి ఎదురుగా విజయవాడ వైపు నుంచి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఘాట్‌లో స్నానాలు చేసే భక్తులే కరువయ్యారు. ఆ ఘాట్ వైపు భక్తులు ఎవ్వరూ వెళ్లక పోవడంతో, అక్కడ బోట్లలో సిమ్మర్లు, విధులు నిర్వహించే సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారు. ఘాట్‌లలో కొద్ది మేర నీరు పెరిగింది. ఇప్పటికి జిల్లాలో సగం పైగా ఘాట్‌లలో నీరు లేక స్నానాలు చేయలేని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల జల్లు స్నానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కలెక్టర్ కాంతిలాల్‌దండే, ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ ముంగా వెవకటేశ్వర్లు ధ్యాన బుద్ధ ఘాట్‌ను పరిశీలించారు. ఏర్పాట్లను సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ఘాట్‌లను ప్రత్యేక పర్యవేక్షిస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా ధ్యాన బుద్ధ...
పుష్కర వేళ అమరావతిలో ధ్యాన బుద్ధ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బుద్ద్ధుని సమీపంలో ఉన్న ఘాట్‌లో ఎక్కువ మంది పుణ్య స్నానాలు ఆచరించారు. రాత్రి సమయంలో బుద్దుని విగ్రహం ఆరు రంగుల కాంతులతో భక్తులకు కనువిందు చేస్తోంది. ధ్యాన బుద్ధ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన నమూనా ఆలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పుణ్యస్నానాల అనంతరం భక్తులు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
దాతల చేయూత...
పుష్కర స్నానాలు ఆచరించే భక్తులకు దాతలు పలుచోట్ల అన్నదానాలు, తాగునీరు ఉచితంగా ఏర్పాటు చేశారు. ఘాట్‌ల వద్ద ఎన్‌ఎస్‌ఎస్, రెడ్‌క్రాస్, సత్యసాయిసేవాసమితి, ప్రజాపిత బ్రహ్మకుమారి,విశ్వభారతి వంటి సంస్థలు భక్తులకు సేవాలదించాయి. ఘాట్‌లను శుభ్రంగా ఉంచడంతో కీలక పాత్ర పోషించాయి. ఘాట్‌లో వేసిన పూజా ద్రవ్యాలను స్విమ్మర్‌లు వలతో తొలగిస్తూ ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేశారు.
తప్పని ఇబ్బందులు...
భక్తులంతా ధ్యాన బుద్ధ ఘాట్‌కు రావడంతో అక్కడ పిండ ప్రదానం షెడ్డు సరిపోక అర్చకులు ఇబ్బందులు పడ్డారు. దుస్తులు మార్చుకునే రూములు సరిపడినన్ని లేక మహిళలు ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించక పోవడంతో భక్తులకు తిప్పలు తప్పలేదు. ఘాట్ సమీపంలో భక్తులు సేద తీరేందుకు షామియానాలు ఏర్పాటు చేయక పోడంతో ఎండ వేడిమికి విలవిలాడిపోయారు.
Advertisement