అమరావతిలో కొనసాగుతున్న రద్దీ
అమరావతిలో కొనసాగుతున్న రద్దీ
Published Fri, Aug 19 2016 9:20 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM
పుష్కర ఘాట్ వద్ద భక్తుల కోలాహలం
సాక్షి, అమరావతి : అమరావతిలో పుష్కర భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. పుష్కరాల ఎనిమిదో రోజూ రద్దీ కొనసాగింది. ఘాట్లన్నీ భక్తులతో కళకళలాడాయి. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు కష్ణమ్మకు ప్రత్యేకంగా సారె పెట్టి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. అమరావతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో ఎక్కువమంది భక్తులు ఇక్కడే పుణ్య స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఎనిమిది రోజుల్లో శుక్రవారం మధ్యాహ్నానికి 29,38,611 మంది పుణ్య స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో ఒక్క అమరావతిలోనే 13,53,594 మంది స్నానాలు చేసినట్టు చెబుతున్నారు. శుక్రవారం ఒక్కరోజు మధ్యాహ్నం సమయానికే లక్షా 25 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి సీసీ కెమెరాల ద్వారా ఘాట్‌లను పరిశీలిస్తూ ఘాట్ ఇన్‌చార్జిలు, పోలీసులు, దేవదాయ శాఖ, ఆర్టీసీ, రైల్వే అధికారుల సమన్వయంతో భక్తుల సంఖ్యను అంచనా వేస్తున్నారు. ఈ నెల 14న అత్యధికంగా 3,22,500 మంది భక్తులు అమరావతికి వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అమరావతిలోని ధ్యానబుద్ద ఘాట్‌లోనే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోంది.
అమరావతిలోనే అధికారుల మకాం...
అమరావతిలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఇన్‌చార్జి జేసీ ముంగా వెంకటేశ్వరరావుతో పాటు జిల్లాలోని ఉన్నతాధికారులందరూ ఇక్కడే మకాం వేసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శానిటేషన్ బాధ్యతను జెడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య, డీపీవో శ్రీదేవిలకు అప్పజెప్పారు. శానిటేషన్ పర్యవేక్షణ బాధ్యతను గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ నాగలక్ష్మికి శుక్రవారం నుంచి అదనపు బాధ్యతగా అప్పగించారు. మత్స్యశాఖ డీడీ బలరాం, డీఎంహెచ్‌ఓ పద్మజ, ధ్యానబుద్ధ ఘాట్ ఇన్‌ర్జి సబ్‌కలెక్టర్ హిమాంశుక్లా, అమరేశ్వర ఘాట్ ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ కృతికా బాత్రా, రూరల్ ఎస్పీ నారాయణనాయక్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Advertisement
Advertisement