పెనుమూడి రేవుకు పుష్కర శోభ
రేపల్లె: పెనుమూడి రేవు పుష్కరశోభ సంతరించుకొంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పుష్కరఘాట్ పనులను ప్రధానంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. పుష్కరఘాట్‌కు వచ్చే రహదారుల నిర్మాణాలను కాంట్రాక్టర్‌లు నిలిపివేయడంతో ఆ ప్రాంతంలో డస్ట్‌వేసి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులకు కొత్త సమస్య ఎదురైంది. పుష్కరాలకు కృష్ణానది నీరు రాదని రూడీకావటంతో సముద్రపు పోటునీటిని తుంపర్ల స్నానాన్ని భక్తులకు అందించేందుకు పైపులైన్‌లు వేసేపనిలో నిమగ్నమయ్యారు. ఘాట్ వద్ద పూర్తిస్థాయిలో లైటింగ్ పనులు కూడా పూర్తికాకపోవటంపై ఉన్నతస్థాయి అధికారులు మండల స్థాయి అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నోరుమెదపలేని అధికారులు..
పుష్కరాలకు సంబంధించిన పనుల నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్‌లుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అవతారం ఎత్తడంతో అధికారులు పనులు చేయించలేని పరిస్థితి నెలకొంది. దీంతో పనులు శరవేగంగా జరగకపోగా నాణ్యతాలోపాలు కనిపిస్తున్నా అధికారులు నోరుమెదపలేని స్థితిలో కొనసాగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధికారులు పుష్కర భక్తులకు అరకొర సౌకర్యాలతో మమ అనిపించే దిశగా ముందుకు సాగుతున్నారు.