పుష్కర వేళ.. వసూళ్ల పర్వం
పుష్కర వేళ.. వసూళ్ల పర్వం
Published Wed, Aug 10 2016 4:53 PM | Last Updated on Thu, Jul 11 2019 8:52 PM
పుష్కర భక్తుల సౌకర్యాల కోసం అంటూ
అధికార పార్టీ నేతల వసూళ్లు
సమావేశాలు పెట్టి మరీ స్పష్టమైన ఆదేశాలు
అధికారులకూ టార్గెట్లు
పుష్కరాల పేరు చెప్పి.. అధికార పార్టీ నేతలు అక్రమ వసూళ్లకు తెరతీశారు. స్వచ్ఛంద సంస్థలు, వర్తక, వాణిజ్య సంఘాలు, అసోసియేషన్లు, మద్యం దుకాణాలు, రేషన్ షాపులు.. ఎవ్వరినీ వదలటం లేదు. వసూలు చేసిన సొమ్ముకు లెక్కలూ చూపటం లేదు. అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే, ఓ ముఖ్య నేత తనయుడు, పలువురు ముఖ్య నేతలు ఈ దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం.
సాక్షి, గుంటూరు : కాదేదీ కలెక్షన్‌కు అనర్హం అన్నట్టు వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ నేతలు. పవిత్రమైన పుష్కరాల పనుల కోసం విడుదల చేసిన నిధులను ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్ల రూపంలో కొల్లగొట్టిన నేతలు తాజాగా భక్తులకు సేవా కార్యక్రమాల పేరుతో వసూళ్లకు తెర తీశారు. ఈ నెల 12 నుంచి జిల్లావ్యాప్తంగా జరగనున్న పుష్కరాలకు వేలాదిగా భక్తులు వచ్చే అవకాశముంది. వారి సౌకర్యార్థం అంటూ వ్యాపారులతో పాటు పలు వాణిజ్య సముదాయాలకు, అసోసియేషన్‌లకు అధికార పార్టీ నేతలు ఇండెంట్లు వేస్తున్నారు. పుష్కరాల సందర్భంగా స్వచ్ఛందంగా భక్తులకు సహాయసహకారాలు అందించాలనుకుంటున్న స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ వ్యాపార, వర్తక సంఘాలతో పాటు పలు అసోసియేషన్ నేతలను పిలిచి సమావేశాలు పెట్టి మరీ టార్గెట్లు విధిస్తున్నారు. తమ అసోసియేషన్ తరఫున ఫలానా కార్యక్రమం చేపడుతున్నామంటూ హామీ ఇచ్చినప్పటికీ ఒప్పుకోకుండా తమకే డబ్బు పంపాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం.. సాటి వారికి సేవ చేయాలనే దృక్పథంతో తాము డబ్బు ఖర్చు చేద్దామని భావిస్తుంటే .. అధికార పార్టీ నేతలు ఈ విధంగా ఒత్తిళ్లు చేయటంపై స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా వారి మాటకు ఎదురుచెబితే తమ వ్యాపారాలకు ఇబ్బందులు కలిగిస్తారనే భయంతో మిన్నకుంటున్నారు. జిల్లాలోని ఓ సీనియర్ ఎమ్మెల్యే, ఓ ముఖ్యనేత తనయుడు, పుష్కరాలు జరిగే ప్రాంతాల్లోని అధికార పార్టీ ముఖ్య నేతలంతా దౌర్జన్యంగా కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులకు టార్గెట్..
అంతటితో ఆగక ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు విధించి మద్యం దుకాణాలు, రేషన్ డీలర్లు, పెట్రోలు బంకులు, కిరోసిన్ హాకర్లు.. ఇలా పలు వర్గాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆయా శాఖలకు చెందిన అధికారులు నేరుగా వారికి ఫోన్లు చేసి ఈ నెల 11వ తేదీ సాయంత్రం కల్లా డబ్బులు అధికార పార్టీ ముఖ్య నేతలకు చేర్చాలని హెచ్చరికలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే అదునుగా భావించి కొందరు కింది స్థాయి అధికారులు అందులో కొంత మొత్తం తమకు పంపాలంటూ బెదిరిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక అంతా తలలు పట్టుకుంటున్నారు.
లెక్కా పత్రం లేకుండా వసూళ్లు..
పుష్కర యాత్రికులకు అన్నదానం, వసతి సౌకర్యాలు, మంచినీటి సౌకర్యాల కల్పనకు అంటూ చేస్తున్న ఈ వసూళ్లకు లెక్కలు చూపే పరిస్థితే లేదు. ఎవరెవరి నుంచి ఎంతెంత సొమ్ము అందినదీ.. వాటిని ఏయే సౌకర్యాల కల్పనకు ఉపయోగిస్తారు.. అనే సమాచారం మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. దాతలు తాము అందజేస్తున్న సొమ్ముతో ఎంతమందికి సదుపాయాలు అందిస్తున్నారనే విషయం ఎప్పటికప్పుడు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం.
Advertisement
Advertisement