నీటి వసతి లేని పాఠశాల
స్నానాల పరిస్థితి ఏమిటి ?
తలలు పట్టుకుంటున్న అధికారులు
తాడేపల్లి (తాడేపల్లి రూరల్) : పుష్కర విధులకు విచ్చేసే అధికారులకు బస ఏర్పాటు చేయడానికి యంత్రాంగం పలు పాఠశాలలు, సత్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పాఠశాలలో సుమారు 300 మంది సిబ్బంది బస చేయనున్నారు. అధికారులు మొక్కుబడిగా పాఠశాలలు అప్పజెప్పారు కానీ, అందులో బస చేసే ఉద్యోగులకు స్నానాలు, టాయ్‌లెట్లు, ఆహారం వంటి అంశాలలో ఇప్పటికీ ఏర్పాట్లు చేయలేదు. 300 మంది ఉద్యోగులకు స్నానాలకు అవసరమైన నీరు, టాయ్‌లెట్లు లేని పాఠశాలలు, సత్రాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క పాఠశాలలో 300 మంది ఉంటే మొత్తం విధులు నిర్వర్తించే సుమారు 5 వేల మంది ఉద్యోగులకు నీటి వసతికి తీసుకున్న చర్యలు ఏమిటో స్పష్టం చేయలేదు. భోజన సదుపాయం ఒక చోట, వసతి మరో చోట కావడంతో విధులు నిర్వహించిన అనంతరం వసతి గహంలో ఉంటే భోజనానికి అక్కడకు వెళ్లాలంటే రెండు మూడు కిలోమీటర్లకు పైగా నడిచి వెళ్లాల్సి ఉంది. పుష్కరఘాట్లలో విధులు నిర్వహించి, మరలా భోజనం కోసం అంతదూరం వెళ్లాలంటే ఎలా అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పురుషులు అయితే ఏదో విధంగా వసతి గహాల్లో కాలకత్యాలు తీర్చుకుని, స్నానం చేయగలరు. మరి మహిళా ఉద్యోగుల పరిస్థితి ఏమిటో అర్థంకాక సతమతమవుతున్నారు. ఒకరోజు రెండు రోజులైతే ఏదో విధంగా సరిపెట్టుకుంటారు. 12 రోజులు ఎలా అని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప వచ్చే భక్తులకు, ఉద్యోగులకు సరైన సదుపాయాలు కల్పించడంలో శ్రద్ధ చూపడం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.