మహిళా సాధికారతకు భారతీయ పరిశ్రమ బాసట
♦ 2 వినూత్న కార్యక్రమాలను
♦ ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంక్
♦ 100 హెల్త్ క్యాంపులను
♦ నిర్వహించనున్న ఎస్‌బీఐ
♦ మహిళా సిబ్బంది పెంపుపై కెనాన్ దృష్టి
ముంబై: భారతీయ కంపెనీలు మహిళా సాధికారకతకు చేయూతనందిస్తామని ఉద్ఘాటించాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్యాంకు లు సహా ఇతర కంపెనీలు మహిళల కోసం పలు ప్రోత్సాహకాలను ప్రకటించాయి. మహిళల కోసం 100 ఉచిత హెల్త్ చెకప్ క్యాంపులను నిర్విహ స్తామని దేశీ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ ప్రకటించింది. ఇందులో కంటి పరీక్షలు, కాన్సర్ డిటెక్షన్, డయాబెటిక్ చెకప్ వంటి తదితర ఆరోగ్య పరీక్షల ఉంటాయని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించలేని ఏ సమాజం కూడా అభివృద్ధి దిశగా పయనించలేదని పేర్కొన్నారు.
ప్రైవే ట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్.. మహిళలు ఏడాదిపాటు ఇంటి వద్ద నుంచే పనిచేసే వె సులుబాటు కల్పిస్తూ ‘ఐవర్క్‌ఃహోమ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే మూడేళ్లలోపు పిల్లలను కలిగిన మహిళా ఉద్యోగులు పని నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లాల్సి వస్తే వారు వారి పిల్లలను కూడా తమతోపాటు తీసుకెళ్లే వెసులుబాటు కల్పించింది. జీవితంలో కాలానుగుణంగా కలిగే వివిధ పరిణామాల వల్ల (మాతృత్వం, పిల్లల సంరక్షణ) మహిళలు బలవంతంగా ఉద్యోగాలను వదిలేయవలసి వస్తోందని, అందుకే ఇలాంటి సమయాల్లో వారికి ఇంటి వద్ద నుంచే పనిచేసే వెసులుబాటు కల్పిస్తున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ చెప్పారు. ముంబైలో విల్లే పార్లే వాయువ్య ప్రాంతంలో మహిళల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. 2018 నాటికి ఉద్యోగ సిబ్బందిలో మహిళల వాటాను 20 శాతానికి పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కెనాన్ తెలిపింది.