Womens staff
-
ఇండియాలో తొలిసారి కాపాడే మహిళా దళాలు
‘రెస్క్యూ ఆపరేషన్’ అనే మాట వినే ఉంటారు. విపత్తులలో.. విలయాలలో.. వైపరీత్యాలలో.. ప్రాణాలకు తెగించడం. ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడటం. ఈ పనిలో ఇప్పటివరకు పురుషులే ఉన్నారు. ఇకపై మహిళలూ రెస్క్యూలోకి దిగబోతున్నారు! తొలి బ్యాచ్‌లో 100 మహిళలు శిక్షణ పొంది ‘ఏ క్షణానికైనా’ సిద్ధంగా ఉన్నారు. ఆపదలో ఆదుకునేవాళ్లను ఆపద్బాంధవులు అంటారు. మన దేశానికి అధికారిక ఆపద్బాంధవి.. ‘జాతీయ విపత్తు రక్షణ దళం’. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్.డి.ఆర్.ఎఫ్.) ఈ జాతీయ దళం పేరుకు ఆపద్బాంధవి అయినప్పటికీ ఇందులో ఇంతవరకు మరీ చిన్నస్థాయిలో తప్ప ప్రత్యక్షంగా ప్రాణాలు కాపాడే ‘డిజాస్టర్ కంబాట్’లో మహిళా సిబ్బంది లేరు. ‘రెస్క్యూ ఆపరేషన్లోకి మహిళల్ని తీసుకుని రిస్క్ చెయ్యలేం’ అనేవాళ్లు అధికారులు. ‘‘ఇది ‘హై–ప్రెషర్’ జాబ్, మగవాళ్లు మాత్రమే చేయగలరు’ అని కూడా! నీటిలో కొట్టుకుపోతున్న వాళ్లను హెలికాప్టర్ల నుంచి పైకి లాగడమే కాదు, కొన్నిసార్లు నడుముకు కట్టుకుని కూడా ఒడ్డుకు చేర్చవలసి ఉంటుంది. అదుపుతప్పి వ్యాపిస్తున్న మంటలను దారికి తేవడమే కాదు, కొన్నిసార్లు మంటల్లో చిక్కుకున్న వాళ్ల కోసం ఆ మంటల్లోకే వెళ్లవలసి ఉంటుంది. భూకంపాలప్పుడు శిథిలాల కింద ఉన్నవారిని కనిపెట్టడమే కాదు, సమయం మించిపోక ముందే ప్రాణాలతో వారిని బయటికి తేవాలి. ఇంకా.. రోడ్డు ప్రమాదాలు, విమాన ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారిని స్ట్రెచర్ల మీదే కాదు, అవసరం అయితే భుజాలపై మోసుకుని కూడా అంబులెన్స్‌లోకి ఎక్కించవలసి ఉంటుంది. ప్రతి క్షణమూ విలువైనదే కనుక ప్రతి ప్రయత్నమూ బలమైనదే కావాలి. ఆ బలం మహిళలకు ఉండదు అనుకునేవారు. అయితే ఆ ఆలోచనా ధోరణి మారింది. ఎన్.డి.ఆర్.ఎఫ్. తన బలం పెరగాలంటే రెస్క్యూ టీమ్‌లలో మహిళలు తప్పనిసరిగా ఉండాలని భావిస్తోంది. ఫలితమే ‘జాతీయ విపత్తు రక్షణ దళం’లోకి మహిళల చరిత్రాత్మక రంగ ప్రవేశం. ∙∙ తొలిసారి శిక్షణ పొంది వచ్చిన ఈ వంద మంది మహిళా బృందాన్ని ఉత్తరప్రదేశ్‌లోని గర్హ్ ముక్తేశ్వర్ పట్టణంలో గంగానది పొడవున గస్తీ విధుల్లో నియమించారు. ఆపద నుంచి కాపాడే పడవల్ని నడపడం, అవసరమైతే అప్పటికప్పుడు వాటికి మరమ్మతులు చేయడం, ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినవారిని గాలించి ఆ పడవల్లో ఒడ్డుకు చేర్చడం వంటివన్నీ వారు విజయవంతంగా పూర్తి చేసిన శిక్షణ లో భాగమే. వీళ్లు కాక మరో వందమందికి పైగా మహిళలకు ఎన్.డి.ఆర్.ఎఫ్. డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్.ప్రధాన్ శిక్షణ ఇప్పించబోతున్నారు. ఈ మొత్తం 200 మందీ ఇన్స్పెక్టర్లుగా, సబ్ ఇన్స్పెక్టర్లుగా, కానిస్టేబుళ్లుగా తమ విధులు నిర్వర్తిస్తారు. నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యిమంది సిబ్బందిలో 108 మంది మహిళల్ని మాత్రమే చేర్చుకునేందుకు తనకున్న అధికారం మేరకే ఈ నియామకాలు చేపట్టగలిగారు ఎన్.డి.ఆర్.ఎఫ్. డీజీ. లేకుంటే ఇంకా ఎక్కువమందినే తీసుకునేవారు. ‘‘మహిళలు రెస్క్యూ టీమ్‌లో ఉండటం వల్ల ప్రత్యేకమైన ఆపత్సమయ ప్రయోజనాలు ఉన్నాయి. మహిళల్ని కాపాడేందుకు మహిళలే చొరవ చూపగలరు. ఇంకా ప్రత్యేకమైన సందర్భాలలో మహిళల్ని మహిళలే ఆదుకోవడం అవసరమౌతుంది కూడా’’ అని ప్రధాన్ అంటున్నారు. ‘‘మహిళా బృందం, పురుష బృందం రెండూ ప్రధానమే. అయితే స్త్రీ, పురుషులు కలిసి ఉండే బృందాన్ని ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపుతున్నాం. ప్రాణాల్ని రక్షించేటప్పుడు స్త్రీ పురుషులిద్దరూ కలిసి పని చేయడం వల్ల తక్షణ ఫలితాలు ఉంటాయి’’ అంటారు ప్రధాన్. -
మహిళా సాధికారతకు భారతీయ పరిశ్రమ బాసట
♦ 2 వినూత్న కార్యక్రమాలను ♦ ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంక్ ♦ 100 హెల్త్ క్యాంపులను ♦ నిర్వహించనున్న ఎస్బీఐ ♦ మహిళా సిబ్బంది పెంపుపై కెనాన్ దృష్టి ముంబై: భారతీయ కంపెనీలు మహిళా సాధికారకతకు చేయూతనందిస్తామని ఉద్ఘాటించాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్యాంకు లు సహా ఇతర కంపెనీలు మహిళల కోసం పలు ప్రోత్సాహకాలను ప్రకటించాయి. మహిళల కోసం 100 ఉచిత హెల్త్ చెకప్ క్యాంపులను నిర్విహ స్తామని దేశీ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ ప్రకటించింది. ఇందులో కంటి పరీక్షలు, కాన్సర్ డిటెక్షన్, డయాబెటిక్ చెకప్ వంటి తదితర ఆరోగ్య పరీక్షల ఉంటాయని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించలేని ఏ సమాజం కూడా అభివృద్ధి దిశగా పయనించలేదని పేర్కొన్నారు. ప్రైవే ట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్.. మహిళలు ఏడాదిపాటు ఇంటి వద్ద నుంచే పనిచేసే వె సులుబాటు కల్పిస్తూ ‘ఐవర్క్ఃహోమ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే మూడేళ్లలోపు పిల్లలను కలిగిన మహిళా ఉద్యోగులు పని నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లాల్సి వస్తే వారు వారి పిల్లలను కూడా తమతోపాటు తీసుకెళ్లే వెసులుబాటు కల్పించింది. జీవితంలో కాలానుగుణంగా కలిగే వివిధ పరిణామాల వల్ల (మాతృత్వం, పిల్లల సంరక్షణ) మహిళలు బలవంతంగా ఉద్యోగాలను వదిలేయవలసి వస్తోందని, అందుకే ఇలాంటి సమయాల్లో వారికి ఇంటి వద్ద నుంచే పనిచేసే వెసులుబాటు కల్పిస్తున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ చెప్పారు. ముంబైలో విల్లే పార్లే వాయువ్య ప్రాంతంలో మహిళల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. 2018 నాటికి ఉద్యోగ సిబ్బందిలో మహిళల వాటాను 20 శాతానికి పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కెనాన్ తెలిపింది. -
12.66 లక్షల జనాభాకు 155 మంది మహిళా పోలీసులు
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఏటా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నేరాలను అరికట్టడంలో పోలీసు శాఖ విఫలం అవుతోంది. ప్రధానంగా స్త్రీల సంఖ్యకు అనుగుణంగా మహిళా పోలీసు సిబ్బంది లేకపోవడమే ప్రధాన కారణం. ప్రతీ ఠాణాలో కచ్చితంగా ఒక మహిళా సిబ్బంది ఉండాలి. జిల్లాలోని చాలా ఠాణాల్లో మహిళా పోలీసులు లేకపోవడంతో బాధితులు స్టేషన్‌కు రాలేకపోతున్నారు. వారి సమస్యలను పోలీసులకు వివరించ లేకపోతున్నారు. తెలంగాణ సర్కారు ఆగస్టు 19 నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారం జిల్లాలో పురుషులు 12,51,672 మంది ఉండగా, మహిళలు 12,66,498 మంది ఉన్నారు. పురుషుల కంటే స్త్రీలే అధికంగా ఉన్నారు. అయినప్పటికీ మహిళా జనాభాకు అనుగుణంగా ఠాణాలు, మహిళా సిబ్బంది లేరు. జిల్లా వ్యాప్తంగా 72 పోలీసుస్టేషన్లు ఉంటే కేవలం ఆదిలాబాద్, శ్రీరాంపూర్‌లో మాత్రమే మహిళా ఠాణాలు ఉన్నాయి. మిగతా 70 పోలీసుస్టేషన్లలో 45 ఠాణాల్లో మహిళా సిబ్బంది ఉండగా, 25 ఠాణాల్లో లేరు. 12.66 లక్షల మహిళా జనాభాకు కేవలం 155 మంది మహిళా పోలీసులు అందుబాటులో ఉన్నారు. ఈ లెక్కన చూస్తే సుమారు 8 వేల మంది మహిళా జనాభాకు ఒక్క పోలీసు ఉన్నాడన్నమాట. మహిళా పోలీసుల కొరత జిల్లాలో మహిళా పోలీసుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రతీ పోలీసుస్టేషన్లో బాధిత మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక మహిళా రిసెప్షనిస్టు ఉండాలి. జిల్లా వ్యాప్తంగా 19 మంది సీఐల పరిధిలో కౌన్సిలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల కౌన్సెలింగ్ సమయంలో బాధిత మహిళల సమస్యలు వినడానికి మహిళా కానిస్టేబుల్ ఉండాలి. అదేవిధంగా ఏడు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో ప్రతీ సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం ఉంటుంది. అయితే జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో మినహా ఎక్కడా మహిళా పోలీసు సిబ్బంది లేరు. దీంతో మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. కొందరు బాధిత మహిళలు తమ సమస్యలు, బాధను, వేదనను పురుషులకు చెప్పడానికి ముందుకు రావడం లేదు. మహిళా సిబ్బంది ఉంటేనే తమ బాధను, సమస్యను వివరంగా చెప్పగలుగుతారు. వారికి న్యాయం జరుగుతుంది. ఎంపిక కాలేకపోతున్న మహిళా అభ్యర్థులు జిల్లాలో 1993 సంవత్సరంలో మహిళా పోలీసు వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 155 మంది సిబ్బంది ఉండగా మరో 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2012 సంవత్సరంలో మహిళా పోలీసుల నియామకం జరిగింది. 80 పోస్టులకు ఎంపిక నిర్వహించగా కేవలం 46 మంది మహిళా అభ్యర్థులు మాత్రమే ఎంపికయ్యారు. మిగతా పోస్టులకు అర్హత సాధించకపోవడంతో అవి ఖాళీగా మిగిలాయి. అభ్యర్థులు ఎంపిక కాకపోవడానికి కారణం చాలా మంది మహిళలు తక్కువ బరువు ఉండడం, శారీరక ఆరోగ్యం లేకపోవడమే. అసలే మహిళలు పోలీసు ఉద్యోగం చేయాలంటే భయపడుతారు. కొందరు ముందుకు వచ్చినా ఆరోగ్యరిత్యా ఎంపిక కాలేకపోతున్నారు. ఒక పక్క ప్రభుత్వమే అరకొర పోస్టులు మంజూరు చేస్తుందంటే.. అందులో మంజూరైన పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు. దీంతో జిల్లాలో మహిళా పోలీసు వ్యవస్థ పటిష్టం కావడం లేదు. ఫలితంగా పోలీసుస్టేషన్లలో మహిళల ఫిర్యాదుల సంఖ్య తగ్గుతోంది. పెరుగుతున్న పనిభారం జిల్లాలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపైనే పనిభారం పడుతోంది. అత్యవసర సమయంలో ఒక్క రోజు కూడా సెలవు దొరకని పరిస్థితి. ఏ సమయంలో ఫోన్ వచ్చినా పరుగెత్తాలి. విధులు నిర్వహించే ప్రాంతంలో వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మహిళలకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. మహిళా సంఘాలు ధర్నాలు, ఆందోళనలు చేసిన సమయంలో వారిని కట్టడి చేసేందుకు నానాతంటాలు పడాల్సి వస్తోంది. పోలీసు స్టేషన్లలో కేసుల విషయంలో పనిభారం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైన ప్రభుత్వం చొరవ చూపి మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని మహిళా పోలీసు స్టేషన్లు, పోలీసుల సంఖ్య పెంచాలని ప్రజలు, బాధిత మహిళలు కోరుతున్నారు.