ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఏటా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నేరాలను అరికట్టడంలో పోలీసు శాఖ విఫలం అవుతోంది. ప్రధానంగా స్త్రీల సంఖ్యకు అనుగుణంగా మహిళా పోలీసు సిబ్బంది లేకపోవడమే ప్రధాన కారణం. ప్రతీ ఠాణాలో కచ్చితంగా ఒక మహిళా సిబ్బంది ఉండాలి. జిల్లాలోని చాలా ఠాణాల్లో మహిళా పోలీసులు లేకపోవడంతో బాధితులు స్టేషన్‌కు రాలేకపోతున్నారు. వారి సమస్యలను పోలీసులకు వివరించ లేకపోతున్నారు.
తెలంగాణ సర్కారు ఆగస్టు 19 నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారం జిల్లాలో పురుషులు 12,51,672 మంది ఉండగా, మహిళలు 12,66,498 మంది ఉన్నారు. పురుషుల కంటే స్త్రీలే అధికంగా ఉన్నారు. అయినప్పటికీ మహిళా జనాభాకు అనుగుణంగా ఠాణాలు, మహిళా సిబ్బంది లేరు. జిల్లా వ్యాప్తంగా 72 పోలీసుస్టేషన్‌లు ఉంటే కేవలం ఆదిలాబాద్, శ్రీరాంపూర్‌లో మాత్రమే మహిళా ఠాణాలు ఉన్నాయి. మిగతా 70 పోలీసుస్టేషన్‌లలో 45 ఠాణాల్లో మహిళా సిబ్బంది ఉండగా, 25 ఠాణాల్లో లేరు. 12.66 లక్షల మహిళా జనాభాకు కేవలం 155 మంది మహిళా పోలీసులు అందుబాటులో ఉన్నారు. ఈ లెక్కన చూస్తే సుమారు 8 వేల మంది మహిళా జనాభాకు ఒక్క పోలీసు ఉన్నాడన్నమాట.
మహిళా పోలీసుల కొరత
జిల్లాలో మహిళా పోలీసుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రతీ పోలీసుస్టేషన్‌లో బాధిత మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక మహిళా రిసెప్షనిస్టు ఉండాలి. జిల్లా వ్యాప్తంగా 19 మంది సీఐల పరిధిలో కౌన్సిలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల కౌన్సెలింగ్ సమయంలో బాధిత మహిళల సమస్యలు వినడానికి మహిళా కానిస్టేబుల్ ఉండాలి. అదేవిధంగా ఏడు పోలీసు సబ్ డివిజన్‌ల పరిధిలో ప్రతీ సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం ఉంటుంది.
అయితే జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో మినహా ఎక్కడా మహిళా పోలీసు సిబ్బంది లేరు. దీంతో మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. కొందరు బాధిత మహిళలు తమ సమస్యలు, బాధను, వేదనను పురుషులకు చెప్పడానికి ముందుకు రావడం లేదు. మహిళా సిబ్బంది ఉంటేనే తమ బాధను, సమస్యను వివరంగా చెప్పగలుగుతారు. వారికి న్యాయం జరుగుతుంది.
ఎంపిక కాలేకపోతున్న మహిళా అభ్యర్థులు
జిల్లాలో 1993 సంవత్సరంలో మహిళా పోలీసు వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 155 మంది సిబ్బంది ఉండగా మరో 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2012 సంవత్సరంలో మహిళా పోలీసుల నియామకం జరిగింది. 80 పోస్టులకు ఎంపిక నిర్వహించగా కేవలం 46 మంది మహిళా అభ్యర్థులు మాత్రమే ఎంపికయ్యారు. మిగతా పోస్టులకు అర్హత సాధించకపోవడంతో అవి ఖాళీగా మిగిలాయి.
అభ్యర్థులు ఎంపిక కాకపోవడానికి కారణం చాలా మంది మహిళలు తక్కువ బరువు ఉండడం, శారీరక ఆరోగ్యం లేకపోవడమే. అసలే మహిళలు పోలీసు ఉద్యోగం చేయాలంటే భయపడుతారు. కొందరు ముందుకు వచ్చినా ఆరోగ్యరిత్యా ఎంపిక కాలేకపోతున్నారు. ఒక పక్క ప్రభుత్వమే అరకొర పోస్టులు మంజూరు చేస్తుందంటే.. అందులో మంజూరైన పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు. దీంతో జిల్లాలో మహిళా పోలీసు వ్యవస్థ పటిష్టం కావడం లేదు. ఫలితంగా పోలీసుస్టేషన్‌లలో మహిళల ఫిర్యాదుల సంఖ్య తగ్గుతోంది.
పెరుగుతున్న పనిభారం
జిల్లాలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపైనే పనిభారం పడుతోంది. అత్యవసర సమయంలో ఒక్క రోజు కూడా సెలవు దొరకని పరిస్థితి. ఏ సమయంలో ఫోన్ వచ్చినా పరుగెత్తాలి. విధులు నిర్వహించే ప్రాంతంలో వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మహిళలకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. మహిళా సంఘాలు ధర్నాలు, ఆందోళనలు చేసిన సమయంలో వారిని కట్టడి చేసేందుకు నానాతంటాలు పడాల్సి వస్తోంది. పోలీసు స్టేషన్‌లలో కేసుల విషయంలో పనిభారం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైన ప్రభుత్వం చొరవ చూపి మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని మహిళా పోలీసు స్టేషన్‌లు, పోలీసుల సంఖ్య పెంచాలని ప్రజలు, బాధిత మహిళలు కోరుతున్నారు.
12.66 లక్షల జనాభాకు 155 మంది మహిళా పోలీసులు
Published Tue, Sep 23 2014 2:26 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement