ఎన్.డి.ఆర్.ఎఫ్. మహిళ
‘రెస్క్యూ ఆపరేషన్’ అనే మాట వినే ఉంటారు. విపత్తులలో.. విలయాలలో.. వైపరీత్యాలలో.. ప్రాణాలకు తెగించడం. ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడటం. ఈ పనిలో ఇప్పటివరకు పురుషులే ఉన్నారు. ఇకపై మహిళలూ రెస్క్యూలోకి దిగబోతున్నారు! తొలి బ్యాచ్‌లో 100 మహిళలు శిక్షణ పొంది ‘ఏ క్షణానికైనా’ సిద్ధంగా ఉన్నారు.
ఆపదలో ఆదుకునేవాళ్లను ఆపద్బాంధవులు అంటారు. మన దేశానికి అధికారిక ఆపద్బాంధవి.. ‘జాతీయ విపత్తు రక్షణ దళం’. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్.డి.ఆర్.ఎఫ్.) ఈ జాతీయ దళం పేరుకు ఆపద్బాంధవి అయినప్పటికీ ఇందులో ఇంతవరకు మరీ చిన్నస్థాయిలో తప్ప ప్రత్యక్షంగా ప్రాణాలు కాపాడే ‘డిజాస్టర్ కంబాట్’లో మహిళా సిబ్బంది లేరు. ‘రెస్క్యూ ఆపరేషన్‌లోకి మహిళల్ని తీసుకుని రిస్క్ చెయ్యలేం’ అనేవాళ్లు అధికారులు. ‘‘ఇది ‘హై–ప్రెషర్’ జాబ్, మగవాళ్లు మాత్రమే చేయగలరు’ అని కూడా! నీటిలో కొట్టుకుపోతున్న వాళ్లను హెలికాప్టర్‌ల నుంచి పైకి లాగడమే కాదు, కొన్నిసార్లు నడుముకు కట్టుకుని కూడా ఒడ్డుకు చేర్చవలసి ఉంటుంది.
అదుపుతప్పి వ్యాపిస్తున్న మంటలను దారికి తేవడమే కాదు, కొన్నిసార్లు మంటల్లో చిక్కుకున్న వాళ్ల కోసం ఆ మంటల్లోకే వెళ్లవలసి ఉంటుంది. భూకంపాలప్పుడు శిథిలాల కింద ఉన్నవారిని కనిపెట్టడమే కాదు, సమయం మించిపోక ముందే ప్రాణాలతో వారిని బయటికి తేవాలి. ఇంకా.. రోడ్డు ప్రమాదాలు, విమాన ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారిని స్ట్రెచర్‌ల మీదే కాదు, అవసరం అయితే భుజాలపై మోసుకుని కూడా అంబులెన్స్‌లోకి ఎక్కించవలసి ఉంటుంది. ప్రతి క్షణమూ విలువైనదే కనుక ప్రతి ప్రయత్నమూ బలమైనదే కావాలి. ఆ బలం మహిళలకు ఉండదు అనుకునేవారు. అయితే ఆ ఆలోచనా ధోరణి మారింది. ఎన్.డి.ఆర్.ఎఫ్. తన బలం పెరగాలంటే రెస్క్యూ టీమ్‌లలో మహిళలు తప్పనిసరిగా ఉండాలని భావిస్తోంది. ఫలితమే ‘జాతీయ విపత్తు రక్షణ దళం’లోకి మహిళల చరిత్రాత్మక రంగ ప్రవేశం.
∙∙
తొలిసారి శిక్షణ పొంది వచ్చిన ఈ వంద మంది మహిళా బృందాన్ని ఉత్తరప్రదేశ్‌లోని గర్హ్ ముక్తేశ్వర్ పట్టణంలో గంగానది పొడవున గస్తీ విధుల్లో నియమించారు. ఆపద నుంచి కాపాడే పడవల్ని నడపడం, అవసరమైతే అప్పటికప్పుడు వాటికి మరమ్మతులు చేయడం, ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినవారిని గాలించి ఆ పడవల్లో ఒడ్డుకు చేర్చడం వంటివన్నీ వారు విజయవంతంగా పూర్తి చేసిన శిక్షణ లో భాగమే. వీళ్లు కాక మరో వందమందికి పైగా మహిళలకు ఎన్.డి.ఆర్.ఎఫ్. డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్.ప్రధాన్ శిక్షణ ఇప్పించబోతున్నారు. ఈ మొత్తం 200 మందీ ఇన్‌స్పెక్టర్‌లుగా, సబ్ ఇన్‌స్పెక్టర్‌లుగా, కానిస్టేబుళ్లుగా తమ విధులు నిర్వర్తిస్తారు.
నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యిమంది సిబ్బందిలో 108 మంది మహిళల్ని మాత్రమే చేర్చుకునేందుకు తనకున్న అధికారం మేరకే ఈ నియామకాలు చేపట్టగలిగారు ఎన్.డి.ఆర్.ఎఫ్. డీజీ. లేకుంటే ఇంకా ఎక్కువమందినే తీసుకునేవారు. ‘‘మహిళలు రెస్క్యూ టీమ్‌లో ఉండటం వల్ల ప్రత్యేకమైన ఆపత్సమయ ప్రయోజనాలు ఉన్నాయి. మహిళల్ని కాపాడేందుకు మహిళలే చొరవ చూపగలరు. ఇంకా ప్రత్యేకమైన సందర్భాలలో మహిళల్ని మహిళలే ఆదుకోవడం అవసరమౌతుంది కూడా’’ అని ప్రధాన్ అంటున్నారు. ‘‘మహిళా బృందం, పురుష బృందం రెండూ ప్రధానమే. అయితే స్త్రీ, పురుషులు కలిసి ఉండే బృందాన్ని ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపుతున్నాం. ప్రాణాల్ని రక్షించేటప్పుడు స్త్రీ పురుషులిద్దరూ కలిసి పని చేయడం వల్ల తక్షణ ఫలితాలు ఉంటాయి’’ అంటారు ప్రధాన్.
Comments
Please login to add a commentAdd a comment