సొంతింటి రుణానికి ప్రభుత్వ వడ్డీ! | KCR is thinking interest free home loan says KTR | Sakshi
Sakshi News home page

సొంతింటి రుణానికి ప్రభుత్వ వడ్డీ!

Published Sat, Nov 25 2023 5:43 AM | Last Updated on Sat, Nov 25 2023 5:46 AM

KCR is thinking interest free home loan says KTR - Sakshi

శుక్రవారం మాదాపూర్‌లో జరిగిన రియల్‌ ఎస్టేట్‌ సదస్సులో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబం ఉండకూడదనేదే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీ రామారావు అన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్, గృహలక్ష్మి పథకాలతో సమాంతరంగా మధ్యతరగతి వారి కోసం ఓ సరికొత్త పథకానికి సీఎం కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. బ్యాంకు రుణంతో 1,200 నుంచి 1,500 చదరపు అడుగుల మధ్య ఇల్లు కొనుగోలు చేసే వారి బ్యాంకు వడ్డీని ప్రభుత్వమే కట్టేలా ఈ పథకం ఉండే అవకాశం ఉందని వివరించారు. శుక్రవారం కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) హైదరాబాద్‌ ఆధ్వర్వంలో మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన రియల్‌ ఎస్టేట్‌ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రెండేళ్లు కరోనాతో, ఎన్నికలకు మరొక ఏడాది పోగా నికరంగా ఆరున్నరేళ్లు మాత్రమే పరిపాలించామని.. ఈ తక్కువ సమయంలో ప్రజలకు కనీస అవసరాలు మాత్రమే తీర్చగలిగామని కేటీఆర్‌ చెప్పారు.   

హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రణాళికలు 
సృజనాత్మకత కార్యక్రమాల అమలులో చిన్న చిన్న సమస్యలు ఎదురవడం సర్వసాధారణమేనని, అలాంటిదే ధరణి అని కేటీఆర్‌ చెప్పారు. గతంలో లంచం ఇవ్వకుండా రిజి్రస్టేషన్‌ జరిగేది కాదని, కానీ, ఇప్పుడు ధరణితో పారదర్శకంగా ఒకే రోజు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ జరుగుతున్నాయని తెలిపారు. ధరణికి సమస్యలను పరిష్కరించేందుకు నిపుణుల కమిటీ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి చెప్పారు. తెలంగాణలో ఏ ప్రాంతం నుంచి అయినా ఒక గంటలో హైదరాబాద్‌ చేరుకునేలా ఒక రవాణా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. హరిత భవనాలు, పునరుత్పాదక విద్యుత్‌కు ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాల షటిల్‌ సరీ్వస్‌లతో కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. అర్బన్‌ పార్క్‌లను పెంచుతామన్నారు. 

అహంకారం కాదు.. చచ్చేంత మమకారం 
ప్రతిపక్షాలు మాకు అహంకారం అంటూ ప్రజలకు సంబంధం లేని అంశాలను చూపి తిడుతున్నాయని, తెలంగాణపై తమకుంది అహంకారం కాదని, చచ్చేంత మమకారమని కేటీఆర్‌ చెప్పారు. కాంగ్రెస్‌ది సోషల్‌ మీడియాలో హడావుడే తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ లేదని విమర్శించారు. డిసెంబర్‌ 3న మళ్లీ బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ పారీ్టల్లో నిర్ణయాలు ఢిల్లీలో తీసుకోవాల్సి ఉంటుందని, సీఎం పీఠం కోసం కొట్లాడకుండా, సొంతంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వంతో నే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. రెండున్నర దశాబ్దాలలో తెలంగాణ ప్రాంతంపై ప్రభావం చూపిన నేతలు చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్‌ అని అన్నారు. బాబు ఐటీ అభివృద్ధికి, రాజశేఖర్‌ రెడ్డి పేదల అభ్యు న్నతి కోసం కృషి చేశారని తెలిపారు. కేసీఆర్‌ హయాంలో ఐటీ సహా పేదల వరకు అన్ని రంగాల వృద్ధికి కృషి చేస్తున్నారని వివరించారు. కేసీఆర్‌ పాలనలో పల్లెలు, పట్టణాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement